Rythu Bharosa : రైతుభరోసా.. మూడో విడతగా రూ.1,090.76 కోట్లు రైతుల ఖాతాలకు
Rythu Bharosa : వైఎస్సార్ రైతుభరోసా మూడో విడత పంపిణీకి ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. రూ.1,090 కోట్ల నిధులను ఫిబ్రవరి 28న రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. తెనాలిలో జరగనున్న కార్యక్రమంలో సీఎం జగన్ బటన్ నొక్కి పెట్టుబడి సాయాన్ని రైతులకి పంపిణీ చేయనున్నారు.
Rythu Bharosa : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకి గుడ్ న్యూస్ చెప్పింది. వైఎస్సార్ రైతు భరోసా కింద 2022 -23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మూడో విడత సాయం పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేసింది. ఫిబ్రవరి 28న మూడో విడత సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. తెనాలి మార్కెట్ యార్డులో జరిగే కార్యక్రమంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి.. బటన్ నొక్కి నేరుగా రైతుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే రెండు విడతల్లో రైతు భరోసా నిధులని రైతులకు అందించిన విషయం తెలిసిందే. రెండు విడతల్లో 50.92 లక్షల మంది రైతు కుటుంబాలకు రూ. 5,853.74 కోట్ల మేర సాయం రైతులకి పంపిణీ చేశారు.
మూడో విడత వైఎస్సార్ రైతు భరోసా సాయం పంపిణీలో భాగంగా.. 51,12,453 మంది రైతులకి రూ. 1,090.76 కోట్ల పెట్టుబడి సాయాన్ని రైతు ఖాతాల్లో జమ చేస్తారు. వైఎస్సార్ రైతుభరోసా స్కీమ్ ద్వారా... రాష్ట్రంలోని అర్హులైన రైతులందరికీ ఏటా రూ. 13,500 పెట్టుబడి సాయంగా అందిస్తోన్న విషయం తెలిసిందే. 2019లో ఈ పథకాన్ని ప్రారంభించారు. 2019 -20 లో 46.69 లక్షల మందికి రూ. 6,173 కోట్లు... 2020-21 ఆర్థిక సంవత్సరంలో 51.59 లక్షల మంది రైతులకి రూ.6,928 కోట్లు... ఇన్వెస్ట్ మెంట్ సపోర్ట్ గా అందించారు. 2021- 22లో 52.38 లక్షల మందికి రూ.7,016.59 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారు. 2022-23లో మొదటి విడతగా మే నెలలో రూ.7,500.... రెండో విడతగా అక్టోబర్ లో రూ. 4 వేలు రైతులకి పంపిణీ చేశారు.
కాగా... వైఎస్సార్ రైతు భరోసా ద్వారా ఈ ఏడాది లబ్ధి పొందిన వారిలో భూ యజమానులు 48,97,551 మంది కాగా... 1,23,871 మంది కౌలు రైతులని ప్రభుత్వం వెల్లడించింది. ఆర్ఓఎఫ్ఆర్ సాగుదారులు 91,031 మంది ఉన్నారని పేర్కొంది. తాజా సాయంతో కలిపితే ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 51.12 లక్షల మంది రైతులకి రూ.27,062.09 కోట్ల మేర పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అందజేసినట్లు అవుతుందని వివరించింది.
అలాగే... గతేడాది మాండమస్ తుపాను వల్ల పంట నష్టపోయిన రైతు కుటుంబాలకు రూ.76.99 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీని సర్కార్ అందించనుంది. పెట్టుబడి సాయంతో పాటే నష్టపరిహారాన్ని రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. గత మూడన్నరేళ్లలో అకాల వర్షాలు, వరదలు, తుపాన్లు, ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు దెబ్బతిన్న 21.31 లక్షల మంది రైతులకు రూ. 1,834.80 కోట్లు జమ చేశారు. తాజాగా జమ చేయనున్న ఇన్ పుట్ సబ్సీడితో కలిపి ఈ మొత్తం రూ.1,911.79 కోట్లు అందించినట్లు అవుతుందని ప్రభుత్వం వెల్లడించింది.