AP Schools : ఏపీ విద్యా వ్యవస్థలో కీలక సంస్కరణలు, వచ్చే విద్యాసంవత్సరం నుంచి 7500 ఆదర్శ ప్రాథమిక పాఠశాలలు-ap govt to establish 7500 model primary schools revamping education system ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Schools : ఏపీ విద్యా వ్యవస్థలో కీలక సంస్కరణలు, వచ్చే విద్యాసంవత్సరం నుంచి 7500 ఆదర్శ ప్రాథమిక పాఠశాలలు

AP Schools : ఏపీ విద్యా వ్యవస్థలో కీలక సంస్కరణలు, వచ్చే విద్యాసంవత్సరం నుంచి 7500 ఆదర్శ ప్రాథమిక పాఠశాలలు

Bandaru Satyaprasad HT Telugu
Feb 04, 2025 02:37 PM IST

AP Schools : కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థలో కీలక సంస్కరణలు శ్రీకారం చుట్టనుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 7500 ఆదర్శ ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కొత్త విధానంలో 1 నుంచి 5 తరగతులు ఉండే పాఠశాలల్లో క్లాస్ కు ఒక టీచర్ ను కేటాయించనున్నారు.

ఏపీ విద్యా వ్యవస్థలో కీలక సంస్కరణలు, వచ్చే విద్యాసంవత్సరం నుంచి 7500 ఆదర్శ ప్రాథమిక పాఠశాలలు
ఏపీ విద్యా వ్యవస్థలో కీలక సంస్కరణలు, వచ్చే విద్యాసంవత్సరం నుంచి 7500 ఆదర్శ ప్రాథమిక పాఠశాలలు

AP Schools : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యా వ్యవస్థలో కీలక సంస్కరణలు చేపట్టేందుకు సిద్ధమైంది. వచ్చే విద్యా సంవత్సరం(2025-26) నుంచి 7500 ఆదర్శ ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఇందుకోసం గత వైసీపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.117ను రద్దు చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది.

yearly horoscope entry point

త్వరలో కొత్త విద్యా విధానంపై ఉత్తర్వులు జారీ చేయనున్నారు. కొత్త విధానంలో 1 నుంచి 5 తరగతులు ఉండే పాఠశాలల్లో క్లాస్ కు ఒక ఉపాధ్యాయుడిని కేటాయించనున్నారు. 60 మంది విద్యార్థులు ఉండాలనే నిబంధనను సడలించి, 50 మంది విద్యార్థులు ఉన్నా ఆదర్శ పాఠశాలలుగా గుర్తించాలని ప్రభుత్వం యోచిస్తుంది.

జీవో 117 రద్దు!

వైసీపీ ప్రభుత్వంలో ప్రాథమిక పాఠశాలల నుంచి 3, 4, 5 తరగతులను ప్రాథమికోన్నత, హైస్కూళ్లకు మార్చారు. ఈ తరగతులను తిరిగి వెనక్కి తీసుకొచ్చి ప్రాథమిక బడుల్లో విలీనం చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. పాఠశాలల దూరం ఎక్కువగా ఉంటే బేసిక్‌ ప్రైమరీ స్కూళ్లను కొనసాగించనున్నారు. ఇక్కడ 1 నుంచి 5 తరగతులు నిర్వహిస్తారు.

విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయులను కేటాయిస్తారు. జీవో 117ని రద్దు చేసిన తర్వాత తీసుకురాబోయే సంస్కరణలపై ప్రాథమికంగా క్షేత్రస్థాయిలో ప్రతిపాదనలను సిద్ధం చేశారు. పురపాలికల్లో వార్డును యూనిట్‌గా తీసుకుని ఆదర్శ పాఠశాలలను ఏర్పాటు చేస్తారు.

ప్రైవేట్ స్కూళ్ల మోజులో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుంది. దీంతో పాటు గత ప్రభుత్వం హయాంలో 3, 4, 5 తరగతులను హైస్కూళ్లకు తరలించడంతో సింగిల్ టీచర్ స్కూళ్ల సంఖ్య పెరిగింది. రాష్ట్రంలో 12,500 పైగా సింగిల్ టీచర్ స్కూళ్లు ఉన్నాయి.

ఇక్కడి 1, 2 క్లాసులు, 1-5 తరగతులను ఒక్క టీచర్‌ మాత్రమే నిర్వహిస్తున్నారు. కొత్త విధానంలో ఎల్‌కేజీ, యూకేజీ వంటి ప్రీ స్కూల్ విద్యను అందించే అంగన్వాడీలను శాటిలైట్ ఫౌండేషన్ పాఠశాలలుగా మార్చనున్నారు. ప్రీస్కూల్‌తో పాటు 1, 2 తరగతులు బోధించే స్కూళ్లను ఫౌండేషన్ పాఠశాలలుగా మార్చనున్నారు.

ప్రీస్కూల్, 1 నుంచి 5 తరగతి వరకు బోధన చేసే పాఠశాలలను బేసిక్ ప్రాథమిక పాఠశాలలు పరిగణిస్తారు. 6 నుంచి 10వ తరగతి వరకు ఉన్న పాఠశాలలను ఉన్నత పాఠశాలలుగా కొనసాగిస్తారు. ప్రీ స్కూల్, 1 నుంచి 5 ఐదో తరగతి వరకు బోధన చేసేలా గ్రామ పంచాయతీ, వార్డు, డివిజన్‌ లో ఆదర్శ ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేయనున్నారు.

ఈ నెల 10లోపు సీనియారిటీ జాబితా

కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీల చట్టం రూపొందిస్తుంది. ఇప్పటికే ముసాయిదా చట్టాన్ని విద్యాశాఖ తయారు చేసింది. దీనిని బడ్జెట్‌ సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదించనున్నారు. త్వరలోనే ముసాయిదాను పబ్లిక్ డోమైన్ లో పెట్టి సలహాలు, సూచనలు స్వీకరించనున్నారు.

ఫిబ్రవరి 10లోపు ప్రాథమిక సీనియారిటీ జాబితా విడుదల చేయనున్నారు. బదిలీల చట్టం డ్రాఫ్ట్ లో... రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారు బదిలీలకు అర్హులు. ఎనిమిదేళ్ల సర్వీసు పూర్తయితే తప్పనిసరిగా బదిలీ అవ్వాలి. సీనియారిటీని లెక్కింపులో అకడమిక్‌ సంవత్సరాలను ప్రామాణికంగా తీసుకోనే అవకాశం వంటి కీలక అంశాలు ఉన్నాయి.

Whats_app_banner

సంబంధిత కథనం