PM Surya Ghar Scheme : డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్, ఇళ్లపై సోలార్ రూఫ్ టాప్-రూ.30 వేల నుంచి రూ.78 వేలు లబ్ది
PM Surya Ghar Scheme : గృహ వినియోగదారులపై విద్యుత్ భారం తగ్గించేందుకు కేంద్రం పీఎం సూర్య ఘర్ పథకం అమలుచేస్తుంది. ఈ పథకాన్ని ఏపీ ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. తొలి విడతలో లక్ష మంది డ్వాక్రా మహిళలకు సోలార్ ప్యానళ్ల అందించేందుకు చర్యలు చేపట్టింది.
PM Surya Ghar Scheme : ప్రజలపై విద్యుత్ భారం తగ్గించే దిశగా కేంద్ర ప్రభుత్వం సోలార్ పవర్ ను ప్రోత్సహిస్తుంది. పీఎం సూర్యఘర్ యోజన్ పథకం ద్వారా సోలార్ రూఫ్ టాప్ ప్యానళ్లను అమర్చుతున్నారు. పీఎం సూర్య ఘర్ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల్లోకి తీసుకెళ్తుంది. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీలకు ఈ పథకం ద్వారా రాయితీలు అందిస్తు్న్నారు. తాజాగా ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. డ్వాక్రా మహిళలకు ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది.

తొలివిడతలో లక్ష మందికి సోలార్ ప్యానళ్లు
ఏపీలో కోటి మందికిపైగా డ్వాక్రా మహిళలు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. దీంతో విడతల వారీగా డ్వాక్రా మహిళల ఇళ్లపై సోలార్ రూఫ్ టాప్‌ను అమర్చాలని నిర్ణయించింది. తొలి విడతలో లక్ష మంది డ్వాక్రా మహిళల ఇళ్లపై సోలార్ ప్యానళ్లను అమర్చే దిశగా అడుగులు వేస్తుంది. ఈ మేరకు డ్వాక్రా మహిళలకు సెర్ప్ అధికారులు అవగాహన కల్పించనున్నారు. ఈ పథకాన్ని అంగీకరించిన డ్వాక్రా మహిలకు పీఎం సూర్య ఘర్ స్కీమ్ కింద రిజిస్ట్రేషన్ చేస్తున్నారు.
రాష్ట్రం వ్యాప్తంగా ఇప్పటికే 80 వేల మంది డ్వాక్రా మహిళలు ఈ పథకం కోసం అంగీకారం తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం పీఎం సూర్య ఘర్ యోజన పథకాన్ని గృహ వినియోగదారుల కోసం అమలు చేస్తుంది. ఈ పథకం ద్వారా మూడు రకాల కెపాసిటీతో సోలార్ రూఫ్‌టాప్ ఏర్పాటుకు రాయితీపై రుణాలు అందించనున్నారు.
రూ.30 వేల నుంచి రూ.78 వేల వరకు రాయితీ
ఒక కిలోవాట్ సోలార్ రూఫ్ టాప్ వ్యయం రూ.70 వేలు కాగా, ఇందులో రూ.30 వేలు కేంద్రం రాయితీగా ఇస్తుంది. రెండు కిలోవాట్ల సోలార్ రూఫ్ టాప్ రూ.1.40 లక్షలు అయితే, రూ.60 వేలు రాయితీ ఇస్తుంది. మూడు కిలోవాట్ల సామర్థ్యం ఉన్న రూఫ్‌టాప్ ఏర్పాటుకు రూ.1.95 లక్షలు కాగా రూ.78 వేలు రాయితీగా ఇస్తారు. ఈ మేరకు లబ్ధిదారులు తమ వినియోగం బట్టి రూఫ్‌టాప్ సామర్థ్యాన్ని నిర్ణయించుకోవచ్చు.
పీఎం సూర్య ఘర్ యోజన పథకంలో లబ్ధిదారుడి వాటా 10 శాతం పోగా... మిగిలిన మొత్తాన్ని 7 శాతం వడ్డీపై బ్యాంకుల నుంచి రుణంగా అందిస్తారు. బ్యాంకుల నుంచి రుణాన్ని అందించే బాధ్యత సెర్ప్ అధికారులు తీసుకున్నారు.
లబ్ధిదారులు 10 శాతం వాటా కూడా చెల్లించలేని పరిస్థితిలో ఉంటే మొత్తాన్ని బ్యాంకు, స్త్రీనిధి, పొదుపు మొత్తం నుంచి రుణంగా అందిస్తారు. డ్వాక్రా మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని, విద్యుత్ భారాన్ని తగ్గించుకోవాలని అధికారులు కోరుతున్నారు.
రూ. 75,021 కోట్ల వ్యయంతో
సోలార్ రూఫ్‌టాప్ ద్వారా ప్రజలు వారి సొంత విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకోవడానికి అవకాశం కల్పించడానికి 29 ఫిబ్రవరి, 2024న ప్రధానమంత్రి సూర్య ఘర్- ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని భారత ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ పథకాన్ని రూ. 75,021 కోట్ల వ్యయంతో 2026-27 వరకు అమలుచేయనున్నారు.
ఈ పథకాన్ని జాతీయ స్థాయిలో నేషనల్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ, రాష్ట్ర స్థాయిలో స్టేట్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీలు అమలుచేస్తాయి. డిస్కామ్‌లు లేదా పవర్/ఎనర్జీ డిపార్ట్‌మెంట్లు తమ సంబంధిత ప్రాంతాల్లో రూఫ్‌టాప్ సోలార్‌ను ప్రోత్సహిస్తాయి.