AP Inter College Mid Day Meal : ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. రేపటి నుంచి రాష్ట్రంలోని 475 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ పథకం అమలుకు రూ.115 కోట్లు కేటాయించింది. పేదరికంలో ఉన్న విద్యార్థులు ఆర్థికపరమైన కారణాలతో ఉన్నత విద్యకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ఉచిత భోజన పథకం అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
మధ్యాహ్న భోజన పథకం అమలుకు ఏపీ ప్రభుత్వం మంగళవారం పరిపాలనా అనుమతులు జారీ చేసింది. పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ జీవో ఎంఎస్ నెంబర్ 40ను జారీ చేశారు. దారిద్రరేఖకు దిగువున ఉన్న, పేదరికంలో ఉన్న విద్యార్థులకు ఈ స్కీమ్ వర్తిస్తుందన్నారు. మధ్యహ్న భోజన పథకం ద్వారా విద్యార్థులకు పౌష్టికాహరం అందించడంతో పాటు ఆరోగ్యం, అన్ని విధాల అభివృద్ధి సాధ్యం అవుతుందని ప్రభుత్వం భావిస్తుంది. మధ్యాహ్న భోజన పథకం ద్వారా పౌష్టికాహారం అందడంతో పాటు హాజరు శాతం పెరిగే అవకాశం ఉంందని ప్రభుత్వం భావిస్తోంది.
అలాగే విద్యార్థి దశ నుంచే మంచి ఆహారపు అలవాట్లు అలవడే అవకాశం ఉంటుందని తెలిపింది. ఈ పథకం అమలు కోసం రూ. 29. 39 కోట్లు బడ్జెట్ కేటాయించిన ప్రభుత్వం.... వచ్చే ఆర్ధిక సంవత్సరానికి మరో రూ. 85.84కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ పథకం అమలుకు ఇంటర్ విద్య డైరెక్టర్, మధ్యహ్న భోజన కార్యక్రమం డైరెక్టర్‌లు అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఉత్తర్వులతో పాటు మధ్యాహ్న భోజన గైడ్ లైన్స్ ను వెల్లడించింది.