AP Govt Schools Close : ఏపీలో ప్రాథమిక బడులు క్రమంగా మూతపడుతున్నాయి. 2023-24 విద్యాసంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల తగ్గడంతో, 3,4,5 తరగతుల విలీనం కారణాలుగా తెలుస్తోంది. 3, 4, 5 తరగతులను ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలల్లో విలీనం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు ఒకటి, రెండో తరగతుల్లో విద్యార్థుల చేరికలు తగ్గాయి. గతేడాది 10 మంది లోపు విద్యార్థులున్న పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం ఒక్కరూ చేరకపోవడం, ఉన్నవారు వేరే పాఠశాలలకు వెళ్లిపోవడంతో... ఈ ఏడాది 118 ప్రాథమిక పాఠశాలలను ప్రభుత్వం మూసివేసింది. మరో 50 ఎయిడెడ్ స్కూల్స్ ను మూసివేయనున్నట్లు తెలుస్తోంది. అయితే 3, 4, 5 తరగతుల విలీనాన్ని తల్లిదండ్రులు, విద్యార్థులు వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయంపై విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు లేఖలు రాశారు. దీంతో పలు పాఠశాలలకు మినహాయించి ఇచ్చి మిగిలిన స్కూల్స్ విలీనం చేశారు.
వరల్డ్ బ్యాంక్ రుణ నిబంధనల మేరకు టీచర్ల సంఖ్య తగ్గించుకునేందుకు పాఠశాలలను మూసేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో పాటు విద్యాహక్కు చట్టానికి సైతం సవరణ చేశారు. కిలోమీటరు పరిధిలో ఉండాల్సిన 3,4,5 తరగతులను మూడు కిలోమీటర్ల దూరం వరకు ఉండేలా విద్యాహక్కు చట్టాన్ని సవరించారు. అంగన్‌వాడీ కేంద్రాలను కిలోమీటరు దూరంలో ఉండొచ్చని తెలిపారు. ఎక్కువ దూరం వెళ్లలేక విద్యార్థులు చదువు మానేస్తున్నారని తెలుస్తోంది. గతేడాది రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1,73,416 మంది విద్యార్థులు చదువు మధ్యలోనే మానేసినట్లు లెక్కలు చెబుతున్నాయి. వీరిలో అబ్బాయిలు 99,396, అమ్మాయిలు 74,020 మంది ఉన్నట్లు సమాచారం. బాల్యవివాహాల కారణంగా మరికొందరు బడికి దూరమయ్యారు. వలసల కారణంగా 49,099 మంది విద్యార్థులు బడి మానేసి ఇంటి వద్దే ఉంటున్నారు.
గతేడాది సీబీఎస్ఈ సిలబస్ అమలు చేస్తామని సీఎం జగన్ తెలిపారు. బైజూస్ సంస్థ కంటెంట్ పక్కన పెట్టి రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (SERT) ఆన్‌లైన్ పాఠాలను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అనకాపల్లి జిల్లా నాతవరం మండలం గొలుగొండపేట ప్రాథమిక పాఠశాల నుంచి గతేడాది 3,4,5 తరగతుల్లోని 21 మంది పిల్లలను సమీపంలోని చినపేట ప్రాథమికోన్నత పాఠశాలలో విలీనం చేసేసారు. దీంతో 1, 2 తరగతుల్లో మొత్తం 12 మంది విద్యార్థులు మిగిలారు. ఈ ఏడాది వీరిలో ఇద్దరు మరో ప్రభుత్వ పాఠశాలలో చేరగా, మిగిలినవారు ప్రైవేట్ స్కూల్ లో చేరారు. దీంతో ఈ పాఠశాల మూతపడింది. అయితే జాతీయ విద్యావిధానంలో భాగంగా పాఠశాలల విలీనాన్ని చేపట్టామని, ఈ ప్రక్రియలో ఒక్క పాఠశాల మూతపడినా తనదే బాధ్యత అని గతంలో సీఎం జగన్ అన్నారు. ఇప్పుడు వైసీపీ సర్కార్ 118 పాఠశాలలు మూసివేసిందని, సీఎం జగన్ మాటతప్పారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.