AB Venkateswara Rao : ఏబీవీ సస్పెన్షన్ కాలం క్రమబద్ధీకరణ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
AB Venkateswara Rao : విశ్రాంతి ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు మరో ఊరట లభించింది. ఆయన సస్పెషన్ కాలాన్ని క్రమబద్దీకరిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. రెండు విడతల సస్పెన్షన్ కాలానికి మొత్తం వేతనాన్ని, అలవెన్సులను చెల్లించాలని ఆదేశాలు ఇచ్చింది.
AB Venkateswara Rao : విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ కాలాన్ని క్రమబద్దీకరిస్తూ ఏపీ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో రెండు దఫాలుగా ఏబీవీపై సస్పెన్షన్ వేటుపడింది. ఆ కాలాన్ని విధులు నిర్వహించినట్టుగా క్రమబద్దీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

2020 ఫిబ్రవరి 2 నుంచి 2022 ఫిబ్రవరి 7 వరకూ మొదటి దఫాలో ఏబీవీని వైసీపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. రెండో విడతలో 2022 జూన్ 28 తేదీ నుంచి 2024 మే 30 తేదీ వరకు మరోమారు సస్పెన్షన్ వేటు పడింది.
ఈ రెండు విడతల సస్పెన్షన్ కాలాన్ని విధులు నిర్వహించినట్టుగా పేర్కొంటూ కూటమి ప్రభుత్వం క్రమబద్దీకరణ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ కాలానికి ఏబీవీకి చెల్లించాల్సిన మొత్తం వేతనాన్ని, అలవెన్సులను చెల్లించాలని ఆదేశాలు ఇచ్చింది.
సస్పెన్షన్ వేటు పడకపోతే ఎంతమొత్తం ఇవ్వాలో ఆ మేరకు చెల్లించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఇటీవలే ఏబీ వెంకటేశ్వరరావుపై నమోదైన అభియోగాలను వెనక్కి తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అభియోగాలు ఎత్తివేత
విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై నమోదైన అభియోగాలను ఎత్తివేస్తూ ఏపీ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది. ఏబీవీ గత టీడీపీ ప్రభుత్వంలో నిఘా విభాగాధిపతిగా పనిచేశారు.
ఈ సమయంలో ఏరోస్టాట్, యూఏవీ భద్రత పరికరాల కొనుగోలులో అక్రమాలకు పాల్పడ్డారంటూ ఏబీవీపై వైసీపీ ప్రభుత్వం అభియోగాలు నమోదు చేసింది. ఈ కేసులో భాగంగా ఆయనను రెండుసార్లు సస్పెండ్ చేసింది. దీనిపై ఆయన కోర్టులో న్యాయపోరాటం చేసిన విషయం తెలిసిందే.
ఏబీ వెంకటేశ్వరరావుపై మోపిన అభియోగాల్లో వాస్తవం లేదని కూటమి ప్రభుత్వ విచారణలో తేలడంతో ఆయనపై తదుపరి చర్యలు ఉపసంహరించుకుంది. ఈ మేరకు ప్రభుత్వ సీఎస్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆయన పదవీ విరమణ తర్వాత లభించే ప్రయోజనాలు యథావిధంగా పొందే అవకాశం ఏర్పడింది.
అసలేం జరిగింది?
భద్రత పరికరాల కొనుగోలులో అక్రమాలకు పాల్పడ్డారని 2020 డిసెంబర్ లో ఏబీ వెంకటేశ్వరరావుపై అప్పటి వైసీపీ ప్రభుత్వం అభియోగాలు నమోదు చేసింది. ఈ అభియోగాల్లో రెండు రుజువైనట్లు పేర్కొంటూ ఆయనపై చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖకు లేఖ రాసింది.
ఏబీవీ ఇంక్రిమెంట్లు నిలుపుదల చేస్తూ అప్పట్లో కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఏబీవీని సర్వీసు నుంచి తొలగించాలని జగన్ సర్కార్ కేంద్రానికి లేఖ రాసింది. అయితే కేంద్రం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు.
ఈ విషయాలపై ఏబీ వెంకటేశ్వరరావు హైకోర్టు, సుప్రీంకోర్టు, క్యాట్‌ను ఆశ్రయించి న్యాయపోరాటం చేశారు. ఆయనకు అనుకూలంగా తీర్పులు రావడంతో పదవీ విరమణకు ఒక రోజు ముందు వైసీపీ ప్రభుత్వం ఏబీవీకి ప్రింటింగ్ స్టేషనరీ డీజీగా పోస్టింగ్ ఇచ్చింది. పోస్టింగ్ తీసుకున్న రోజే ఆయన పదవీ విరమణ చేశారు.
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో గతంలో ఏబీ వెంకటేశ్వరరావుపై మోపిన అభియోగాలపై విచారణ జరిపింది. ఈ అభియోగాలకు ఆధారాలు లేవని తేలడంతో న్యాయ సలహా తీసుకుని ఆయనపై తదుపరి చర్యలన్నీ నిలిపివేస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా సస్పెండ్ అయినా కాలానికి వేతనం చెల్లించాలని ఆదేశించింది.