AP Schools : ఏపీలో ఇకపై రెండు ర‌కాల ప్రాథ‌మిక పాఠ‌శాల‌లు, స్కూల్ టైమింగ్స్ లో మార్పు-ap govt orders to establish to types to primary schools pilot project starts in nellore ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Schools : ఏపీలో ఇకపై రెండు ర‌కాల ప్రాథ‌మిక పాఠ‌శాల‌లు, స్కూల్ టైమింగ్స్ లో మార్పు

AP Schools : ఏపీలో ఇకపై రెండు ర‌కాల ప్రాథ‌మిక పాఠ‌శాల‌లు, స్కూల్ టైమింగ్స్ లో మార్పు

HT Telugu Desk HT Telugu

AP Schools : ఏపీలో ఇకపై రెండు రకాల ప్రాథమిక పాఠశాలలు నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదే విధంగా స్కూళ్ల టైమింగ్స్ మార్పుపై కూడా నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసేందుకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ఏపీలో ఇకపై రెండు ర‌కాల ప్రాథ‌మిక పాఠ‌శాల‌లు, స్కూల్ టైమింగ్స్ లో మార్పు

ఏపీ ప్రభుత్వం పాఠశాల విద్యకు సంబంధించి కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇక నుంచి రెండు ర‌కాల ప్రాథ‌మిక పాఠ‌శాలలు న‌డ‌పాల‌ని నిర్ణయించింది. అలాగే స్కూల్ టైమింగ్స్ మార్పుపై కూడా నిర్ణయిం తీసుకుంది. దీనికి సంబంధించి ఇప్పటికే నెల్లూరు జిల్లాలో పైల‌ట్ ప్రాజెక్టుగా అమ‌లు చేసేందుకు అధికారులు ఉత్తర్వులు ఇచ్చారు.

రెండు ర‌కాలుగా ప్రాథమిక పాఠశాలలు

1. బేసిక్ ప్రైమరీ స్కూల్

2. మోడల్ ప్రైమరీ స్కూల్

1. బేసిక్ ప్రైమరీ స్కూల్

బేసిక్ ప్రైమరీ స్కూల్స్‌లో పీపీ-1, పీపీ-2తో బాటు 1, 2 తరగతులు ఉంటాయి. సోషల్ బ్యారియర్స్, నేచురల్ బ్యారియర్స్ ఉన్న చోట పీపీ-1, పీపీ-2తో బాటు 1 నుండి 5 తరగతులు కూడా నిర్వహించబడతాయి. 20 లోపు విద్యార్ధులకు ఒక ఎస్‌జీటీ, 21 నుండి 60 లోపు విద్యార్థులకు ఇద్దరు ఎస్‌జీటీలు, ఆపై ప్రతి 30 మందికి ఒక ఎస్‌జీటీ ఉపాధ్యాయులు ఉంటారు.

2. మోడల్ ప్రైమరీ స్కూల్

ప్రతి రెవెన్యూ గ్రామ పంచాయితీలో ఒక మోడల్ ప్రైమరీ స్కూల్ ఏర్పాటు చేస్తారు. విద్యార్థుల సంఖ్య 100, అంతకంటే ఎక్కువ ఉంటే ప్రతి తరగతికి ఒక టీచర్‌ను కేటాయిస్తారు. 120 రోల్ దాటిన ప్రతి స్కూల్‌కు ఒక ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయుడిని కేటాయిస్తారు. వచ్చే విద్యా సంవత్సరం నుండి మోడల్ ప్రైమరీ స్కూల్స్‌ను పునః ప్రారంభిస్తారు. ముందుగా 70, 80 మంది విద్యార్థులు ఉన్నప్పటికీ ఆ ప్రైమరీ స్కూల్‌ను మోడల్ ప్రైమరీ స్కూల్‌గా గుర్తిస్తారు. ఐదు తరగతులకు ఐదుగురు టీచర్లను ఇస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా రానున్న 2, 3 ఏళ్ళలో 9 వేల నుండి 10 వేల పాఠశాలలను మోడల్ ప్రైమరీ స్కూల్స్‌గా మార్చడానికి ప్ర‌భుత్వం ఆలోచ‌న చేస్తుంది.

1. ప్రాథమికోన్నత పాఠశాలలు

6,7,8 తరగతుల విద్యార్థులు 60 కంటే తక్కువ ఉంటే ఆ పాఠశాలను ప్రాథమిక పాఠశాలగా తగ్గించాలని, 60 కంటే ఎక్కువ ఉంటే దానిని ఉన్నత పాఠశాలగా అప్‌గ్రేడ్‌ చేయాలని ప్రభుత్వ ఆలోచన చేస్తోంది. 6,7,8 తరగతుల విద్యార్థుల సంఖ్య 30 లోపు ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలను ప్రాథమిక పాఠశాలలుగా త‌గ్గిస్తారు. విద్యార్ధుల సంఖ్య 31 నుండి 59 లోపు ఉండి గిరిజన ప్రాంతాలు, తండాలు, కాలనీలలో ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలలకు సమీప హైస్కూల్ 5 కిలో మీట‌ర్ల పైబడి దూరం ఉన్నట్లయితే వాటిని అప్ప‌ర్ ప్రైమ‌రీ (యూపీ) స్కూల్స్‌గా కొనసాగిస్తారు.

2. ఉన్నత పాఠశాలలు : 75 మంది, అంతకంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న ప్రతి హైస్కూల్‌కు గ్రేడ్ II ప్ర‌ధానోపాధ్యాయు, పీఈటీ పోస్టులు తప్పనిసరిగా కేటాయిస్తారు. వ‌ర్క్‌ 36 పీరియడ్లకు మించి లేకుండా చూస్తారు. వీట‌న్నింటికి సంబంధించి నవంబర్ 30 నాటికి డ్రాఫ్ట్ ప్రతిపాదనలను పూర్తి చేస్తారు.

స్కూల్ టైమింగ్స్‌లో మార్పులు..నెల్లూరులో ప్రారంభ‌మైన పైల‌ట్ ప్రాజెక్టు

రాష్ట్రంలో పాఠ‌శాల‌ల్లో టైమింగ్స్ మార‌నున్నాయి. అందుకు రాష్ట్ర కొత్త టైమింగ్స్ తీసుకొచ్చింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అమ‌లు చేసే ముందు, పైల‌ట్ ప్రాజెక్టుగా నెల్లూరు జిల్లాలో అమ‌లు చేసేందుకు ఉత్త‌ర్వులు శ‌నివారం ఇచ్చారు. విద్యా సంవత్సరంలో 2024-25లో పాఠశాల సమయాలను మార్చాలని ప్రతిపాదించిన‌ట్లు ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు. పాత పని వేళ‌లు, వెయిటేజీలతో పాటు, ప్రతి పీరియడ్ సమయాన్ని మాత్రమే పెంచాలని ఉత్త‌ర్వుల్లో స్ప‌ష్టం చేశారు. తద్వారా ప్రతి ఉపాధ్యాయుడు సిలబస్‌ను కవర్ చేయడానికి, అలాగే బోధనా అభ్యాస ప్రక్రియకు తగినంత సమయం ఇవ్వనున్నారు.

ప్రతిపాదిత టైమింగ్స్

  • ఉద‌యం 9.00 గంట‌ల‌కు మొద‌టి బెల్
  • ఉద‌యం 9.05 గంట‌ల‌కు రెండో బెల్
  • ఉద‌యం 9.05 నుంచి 9.25 వ‌ర‌కు 20 నిమిషాలు స్కూల్ అసెంబ్లీ (ప్రైయిర్‌)
  • ఉద‌యం 9.25 నుంచి 10.15 వ‌ర‌కు 50 నిమిషాలు మొద‌టి పీరియ‌డ్
  • ఉద‌యం 10.15 నుంచి 11.00 వ‌ర‌కు 45 నిమిషాలు రెండో పీరియ‌డ్‌
  • ఉద‌యం 11.00 నుంచి 11.15 వ‌ర‌కు 15 నిమిషాలు షార్ట్ బ్రేక్ (ఇంట‌ర్‌వెల్‌)
  • ఉద‌యం 11.15 నుంచి మ‌ధ్యాహ్నం 12.00 వ‌ర‌కు 45 నిమిషాలు మూడో పీరియ‌డ్‌
  • మ‌ధ్యాహ్నం 12.00 నుంచి 12.45 వ‌ర‌కు 45 నిమిషాలు నాలుగో పీరియ‌డ్‌
  • మ‌ధ్యాహ్నం 12.45 నుంచి 1.45 వ‌ర‌కు 60 నిమిషాలు లంచ్ బ్రేక్
  • మ‌ధ్యాహ్నం 1.45 నుంచి 2.30 వ‌ర‌కు 45 నిమిషాలు ఐదో పీరియ‌డ్
  • మధ్యాహ్నం 2.30 నుంచి 3.15 వ‌ర‌కు 45 నిమిషాలు ఆరో పీరియ‌డ్
  • మ‌ధ్యాహ్నం 3.15 నుంచి 3.30 వ‌ర‌కు 15 నిమిషాలు షార్ట్ బ్రేక్ (ఇంట‌ర్‌వెల్‌)
  • మ‌ధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 4.15 వ‌ర‌కు 45 నిమిషాలు ఏడో పీరియ‌డ్‌
  • సాయంత్రం 4.15 నుంచి 5.00 వ‌ర‌కు 45 నిమిషాలు ఎనిమిదో పీరియ‌డ్

న‌వంబ‌ర్ 25 నుంచి 30 వ‌ర‌కు పైల‌ట్ ప్రాజెక్టు

ఈ పైలట్ ప్రాజెక్ట్‌ను నెల్లూరు జిల్లాలో ప్రతి మండలంలో ఒక ఉన్నత పాఠశాలలో న‌వంబ‌ర్ 25 నుండి న‌వంబ‌ర్ 30 వరకు అమలు చేయాలని నిర్ణయించారు. అందువల్ల డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్లందరూ ప్రతి మండలం నుండి ఒక హైస్కూల్ / హైస్కూల్ ప్లస్‌ని గుర్తించి, పాఠశాలల జాబితాను న‌వంబ‌ర్ 20న సంతకం చేసి సమర్పించాలని ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు.

న‌వంబ‌ర్ 30న ఫీడ్‌బ్యాక్ పంపాలి

డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్లు గుర్తించి పాఠశాలల సంబంధిత ప్రధానోపాధ్యాయులకు తెలియజేయాలని, న‌వంబ‌ర్ 25 నుండి న‌వంబ‌ర్ 30 వ‌ర‌కు పైన పేర్కొన్న పాఠ‌శాల సమయ వేళ‌ల‌ను అమలు చేసేలా చూడాలని సూచించారు. దీనికి సంబంధించిన‌ ఫీడ్‌బ్యాక్ నివేదికను న‌వంబ‌ర్ 30న తప్పకుండా సమర్పించాలని పేర్కొన్నారు.

రిపోర్టింగ్ : జ‌గ‌దీశ్వర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు