Marine Fishing Ban : రాష్ట్రంలో మత్స్యకారుల వేటపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు వేటను నిషేదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. మరోవైపు పరిహారం కోసం మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు. మత్స్య సంపద అభివృద్ధికి ప్రభుత్వం వేట నిషేధం విధిస్తోంది. ఈ సమయంలో మరబోట్లు, మెకనైజ్డ్ బోట్లు మోటరు బోట్లతో సముద్రంలోకి వెళ్లడం నిషేధం. ఎవరైనా ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది.
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ బి.రాజ్‌శేఖర్ జీవో నెంబర్ 129ని విడుదల చేశారు.కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తూర్పు తీరంలోని ప్రాదేశిక జలాలకు ఆవల ఇండియన్ ఎక్స్‌క్లూజివ్ ఎకనామిక్ జోన్ (ఈఈజెడ్)లోని వేట నిషేధం విధించారు. తూర్పు తీరంలోని పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు, అండమాన్ & నికోబార్ దీవులుల్లో ఏప్రిల్ 15 నుండి జూన్ 14 వరకు మొత్తం 61 రోజులు వేట నిషేధం విధించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
అలాగే పశ్చిమ తీరంలో గుజరాత్, డామన్ & డయ్యూ, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, లక్షద్వీప్ దీవుల్లో జూన్ 1 నుండి జులై 31 వరకు 61 రోజులు వేట నిషేధం విధించినట్లు పేర్కొన్నారు. మత్స్య వనరుల పరిరక్షణ, సముద్ర భద్రతా కారణాల దృష్ట్యా నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. సాంప్రదాయ మోటారు లేని యూనిట్లకు ప్రాదేశిక జలాలకు ఆవల ఇండియన్ ఈఈజెడ్‌లో విధించిన ఈ ఏకరీతి ఫిషింగ్ నిషేధం నుండి మినహాయింపు ఇవ్వబడుతుంది.
అయితే కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన విధంగా మత్స్య వనరుల పరిరక్షణ, సముద్ర భద్రతా కారణాల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ మెరైన్ ఫిషింగ్ (నియంత్రణ) చట్టం-1994 ప్రకారం వేట నిషేధాన్ని అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 15 నుండి జూన్ 14 వరకు 61 రోజుల పాటు సముద్ర ఫిషింగ్ సీజన్ ముగింపును అమలు చేస్తోందని తెలిపారు.
వివిధ మెకనైజ్డ్ ఫిషింగ్ వెస్సెల్స్, అవుట్‌బోర్డ్, ఇన్‌బోర్డ్ ఇంజిన్ (మోటరైజ్డ్ ఫిషింగ్ బోట్లు) అమర్చిన ఫిషింగ్ క్రాఫ్ట్‌ల ద్వారా చేపల వేటను నిషేధించడానికి ఉత్తర్వులు జారీ చేయాలని ఏపీ ఫిషరీస్ కమిషనర్ ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. అందులో భాగంగానే ఏప్రిల్ 15 నుండి జూన్ 14 వరకు 61 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ మొత్తం తీరం వెంబడి ఉన్న ప్రాదేశిక జలాల్లో వేట నిషేధం విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. అయితే మోటరైజ్డ్ కాని సాంప్రదాయ ఫిషింగ్ క్రాఫ్ట్‌లను ఈ నిషేధం నుంచి మినహాయించినట్లు పేర్కొన్నారు.
మత్స్యకారులు వేట నిషేధ పరిహారం కోసం డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో 974 కిలో మీటర్ల పొడవైన సముద్ర తీరం వెంబడి 1.50 లక్షల మత్స్యకార కుటుంబాలు ఉన్నాయి. సుమారు ఆరు లక్షల మంది మత్స్యకారులు సముద్ర తీరంలో జీవిస్తున్నారు. మెకనైజ్డ్ బోట్లు సముద్రంలో తిరిగితే చేపలు గుడ్లు పెట్టే సమయంలో నష్టం జరుగుతుందనే ఉద్దేశ్యంతో ప్రతి ఏడాది 61 రోజుల పాటు వేటను నిషేధిస్తారు. ఆ సమయంలో మత్స్యకారులకు మరో జీవనాధారం ఉండదు. కాబట్టి ప్రభుత్వం పరిహారం ఇస్తుంది.
2019కి ముందు ఏటా రూ.4 వేలు చొప్పున పరిహారం చెల్లించేవారు. అయితే 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏటా ఇచ్చిన పరిహారం రూ.10 వేలకు పెంచారు. అయితే 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో మత్స్యకారులకు ఏటా ఇచ్చే పరిహారాన్ని రూ.20 వేలకు పెంచారు. అయితే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ఇంకా అమలు కాలేదని మత్స్యకారులు అంటున్నారు. వెంటనే వేట నిషేధ పరిహారం ఇవ్వాలని మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం