Ministers Committee : ధరల నియంత్రణ, మార్కెట్ ఇంటర్వెన్షన్లపై మంత్రుల కమిటీ అధ్యయనం, ఏపీ సర్కార్ కీలక నిర్ణయం-ap govt market intervention price control vegetable necessities formed ministers committee ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ministers Committee : ధరల నియంత్రణ, మార్కెట్ ఇంటర్వెన్షన్లపై మంత్రుల కమిటీ అధ్యయనం, ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

Ministers Committee : ధరల నియంత్రణ, మార్కెట్ ఇంటర్వెన్షన్లపై మంత్రుల కమిటీ అధ్యయనం, ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

Bandaru Satyaprasad HT Telugu
Oct 26, 2024 10:16 PM IST

Ministers Committee On Price Control : నిత్యావసరాలు, కూరగాయల ధరల నియంత్రణ, మార్కెట్ ఇంటర్వెన్షన్లపై తగిన సిఫార్సులు చేయాలని ఏపీ ప్రభుత్వం మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఉత్పత్తి, డిమాండ్, సప్లై, ఎగుమతి, దిగుమతులను అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక అందించనుంది.

ధరల నియంత్రణ, మార్కెట్ ఇంటర్వెన్షన్లపై మంత్రుల కమిటీ అధ్యయనం, ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
ధరల నియంత్రణ, మార్కెట్ ఇంటర్వెన్షన్లపై మంత్రుల కమిటీ అధ్యయనం, ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

నిత్యావసరాలు, కూరగాయల ధరల నియంత్రణపై ఏపీ సర్కార్ దృష్టిపెట్టింది. ధరల నియంత్రణ, మార్కెట్ ఇంటర్వెన్షన్లపై మంత్రుల కమిటీని నియమించింది. నిత్యావసరాలు, కూరగాయల ధరలు ఆకస్మికంగా ఎందుకు పెరుగుతున్నాయన్న అంశంపై మంత్రుల కమిటీ అధ్యయనం చేయనుంది. పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నేతృత్వంలో మంత్రుల కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీలో మంత్రులు అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్, పయ్యావుల కేశవ్ సభ్యులుగా ఉంటారు. పౌరసరఫరాల శాఖ ఎక్స్ఆఫీషియో కార్యదర్శి కమిటీ కన్వీనర్‌గా ఉంటారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

ధరల నియంత్రణ నిధి

మంత్రుల కమిటీ నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై ప్రభుత్వానికి సిఫార్సులు చేయనుంది. వినియోగదారులకు అందుబాటులో నిత్యావసరాలు, కూరగాయల ధరలు ఉండేలా తీసుకోవాల్సిన చర్యలపై కమిటీ అధ్యయనం చేయనుంది. ఉత్పత్తి, డిమాండ్, సప్లై, పంటల తీరు, ఎగుమతులు, దిగుమతులు, ధరలకు సంబంధిత అంశాలపై అధ్యయనం చేయాలని కమిటీని ప్రభుత్వం ఆదేశించింది. ధరలు పెరిగినప్పుడు మార్కెట్ ఇంటర్వెన్షన్ , వేగంగా నిర్ణయాలు తీసుకునేందుకు ఓ డేటాబేస్ ఏర్పాటుపై మంత్రుల కమిటీ సిఫార్సులు చేయనుంది. అలాగే ధరలను నియంత్రణలోకి తెచ్చేందుకు అవసరమైన యంత్రాంగాన్ని ఏర్పాటుచేసేందుకు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. అలాగే శాశ్వత ప్రాతిపదికన ధరల నియంత్రణ నిధిని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వానికి మంత్రుల కమిటీ సూచనలు చేయనుంది.

ఆధునిక టెక్నాలజీ వినియోగం

నిత్యావసరాల ధరల నియంత్రణ, మార్కెట్ ఇంటర్వెన్షన్లపై అధికారుల కమిటీ సిఫార్సులను మంత్రుల కమిటీ అధ్యయనం చేయనుంది. అలాగే నిత్యావసరాలు, ఆహార పంటల ఉత్పత్తి, సప్లై, నిల్వలకు సంబంధించిన దీర్ఘకాలిక, స్వల్పకాలిక ప్రణాళికల అమలుపైనా సిఫార్సులు చేయాలని కోరింది. ఆధునిక టెక్నాలజీతో నిల్వలు, ఏడాది పొడవునా ధరలు నియంత్రించేందుకు తగిన ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించింది. మంత్రుల కమిటీ రైతులు, మిల్లర్లు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ,డీలర్లు, ఎగుమతి, దిగుమతిదార్లతో భేటీ కానుంది. సమగ్ర అధ్యయనం తర్వాత మంత్రుల కమిటీ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది.

ఇటీవల సీఎం చంద్రబాబు సమీక్ష

ఇటీవల నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. ధరల నియంత్రణ, మార్కెట్ ఇంటర్వెన్షన్ పై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలపై నిత్యావసరాల భారం పడకుండా చూడాలన్నారు. డిమాండ్, సప్లై మధ్య వ్యత్యాసానికి గల కారణాలను విశ్లేషించి తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. నిత్యావసరాల ధరలు పెరిగితే తగ్గించే ప్రయత్నం చేయడం, సబ్సిడీలో అందించడం కంటే, నిరంతర పర్యవేక్షణతో ధరల పెరుగుదలను ముందుగానే గ్రహించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. పౌరసరఫరాల శాఖ, వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖలు సమన్వయంతో పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. ప్రజలపై నిత్యావసరాల భారం తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

రైతు బజార్లలో సబ్సిడీకి నిత్యావసరాలు, పామాయిల్, సన్ ఫ్లవర్ ఆయిల్, కందిపప్పు, టమాటా, ఉల్లిపాయలు రైతు బజార్లలో కౌంటర్లు ఏర్పాటు చేసి మార్కెట్ ధర కంటే తక్కువకు అమ్మకాలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పెద్ద ఎత్తున గిడ్డంగులను అందుబాటులోకి తెస్తే రైతులకు, వినియోగదారులకు న్యాయం చేయవచ్చన్నారు. బ్లాక్ మార్కెటింగ్ కు పాల్పడితే కఠిన చర్యలుంటాయన్నారు.

Whats_app_banner