ఏపీలో ఒకే రోజు పలు కీలక పథకాలు ప్రారంభించనున్నారు. జూన్ 12న తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించనున్నట్లు టీడీపీ పొలిట్ బ్యూరో ప్రకటించింది.
ప్రతినెలా అమలు చేసే సంక్షేమ పథకాల వివరాలతో సంక్షేమ క్యాలెండర్ విడుదల చేయాలని టీడీపీ పొలిట్ బ్యూరో నిర్ణయించింది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి జూన్ 12 నాటికి ఏడాది కానుంది. ఈ సందర్భంగా జూన్ 12న తల్లికి వందనం కింద చదువుతున్న విద్యార్థులందరికీ రూ.15 వేలు ఖాతాల్లో జమ చేయనున్నారు.
అలాగే జూన్ 12న అన్నదాత సుఖీభవ పథకం (మూడు విడతల్లో రూ.20 వేలు) ప్రారంభించనుంది. అదే రోజున లక్ష మంది ఒంటరి మహిళలు, వితంతువులకు కొత్త పింఛన్లు అందించనున్నారు.
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన నిర్వహించారు. మహానాడు నిర్వహణే ప్రధాన అజెండాగా చర్చ జరిగింది. పహల్గాం దాడి అమరులకు టీడీపీ పొలిట్ బ్యూరో నివాళులు అర్పించింది.
పొలిట్ బ్యూరో సమావేశం అనంతరం టీడీపీ సీనియర్ నేత, మంత్రి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు. ఈ నెల 27, 28, 29న మహానాడుని కడపలో ఘనంగా నిర్వహించనున్నామని చెప్పారు. ప్రతిష్టాత్మక పద్మభూషణ్ పురస్కారం అందుకున్న ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అభినందిస్తూ టీడీపీ పొలిట్‌బ్యూరో తీర్మానం చేసిందని చెప్పారు.
"దీపం 2 పథకం ద్వారా ఇచ్చే మూడు గ్యాస్ సిలిండర్లకు ముందుగా లబ్ధిదారులకు డబ్బులు ఇచ్చేయాలని నిర్ణయించాం. అలాగే జూన్ 12 నుంచి కొత్తగా లక్ష వితంతు పెన్షన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం.
జూన్ 12న పిల్లల స్కూల్స్ తెరిచే ముందే, తల్లికి వందనం ఇస్తున్నాం. అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తాం. త్వరలోనే, ఏ నెలలో ఏ పథకం ప్రభుత్వం ఇస్తుందో తెలియ చేస్తూ, సంక్షేమ పథకాల క్యాలెండర్‌ని ముఖ్యమంత్రి రిలీజ్ చేస్తారు" - మంత్రి అచ్చెన్నాయుడు
రాబోయే రెండు నెలల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. అలాగే దీపం పథకం మూడు సిలిండర్ల డబ్బులు ఒకేసారి వేయాలని నిర్ణయించామన్నారు. 2014-19 మధ్య నిలిచిపోయిన పెండింగ్ బిల్లులు చెల్లిస్తామన్నారు.
తిరంగా ర్యాలీలు
ఉగ్రదాడిలో అమరులైన వారికి సంఘీభావంగా ఈనెల 16, 17, 18 తేదీల్లో తిరంగా ర్యాలీలు నిర్వహించాలని టీడీపీ పొలిట్ బ్యూరో నిర్ణయించిందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. టీడీపీ, జనసేన, బీజేపీతో కలిసి అన్ని నియోజకవర్గాల్లో ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. ఆపరేషన్ సిందూర్ విజయవంతంగా నిర్వహించిన ప్రధాని మోదీ, త్రివిధ దళాలను పొలిట్ బ్యూరో అభినందిస్తూ తీర్మానం చేసిందని చెప్పారు.
సంబంధిత కథనం