AP New Pensions : పెన్షన్ల పంపిణీపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం, కొత్తగా 5402 మందికి స్పౌజ్ పింఛన్లు మంజూరు
AP New Pensions : ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల ప్రక్రియలో కొత్తగా 5402 మందికి పింఛన్లు మంజూరు అయ్యాని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపింది. వీరికి డిసెంబర్ 31న కొత్త పింఛన్లు అందించనున్నామన్నారు. భర్త మరణించిన వారికి స్పౌజ్ కేటగిరీలో పెన్షన్లు అందిస్తున్నామన్నారు.
AP New Pensions : ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్పౌజ్ కేటగిరి కింద కొత్తగా 5402 మందికి పింఛన్లు మంజూరు చేసినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రకటించారు. ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చే లక్ష్యంతో పింఛన్ల పంపిణీ సరళీకృతం చేశామన్నారు. ఆరేడు నెలలకు ఒకసారి కొత్త పింఛన్ల మంజూరు ప్రక్రియకు స్వస్తి పలికామన్నారు. పింఛను తీసుకుంటున్న భర్త మరణిస్తే వెంటనే భార్యకు ఏ నెలకు ఆ నెలే పింఛను ఇచ్చే విధానాన్ని అమల్లోకి తెచ్చామన్నారు. దీన్నే స్పౌజ్ కేటగిరీగా గుర్తిస్తూ పింఛన్ మంజూరు చేస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. 2024 నవంబర్ 1 నుంచి డిసెంబర్ 15 వరకు స్పౌజ్ కేటగిరీ కింద 5402 మంది కొత్త పింఛన్లకు ఎంపికయ్యారన్నారు. వివిధ కారణాలతో 2 లేదా 3 నెలలు పింఛన్ తీసుకోని వారు 50 వేల మంది వరకు ఉన్నారని మంత్రి శ్రీనివాస్ తెలిపారు. వారికి కూడా డిసెంబర్ 31న ఒకేసారి 2 లేదా 3 నెలల పింఛన్ పంపిణీ చేస్తున్నట్లు ప్రకటించారు.
కొత్తగా 5402 మందికి
సీఎం చంద్రబాబు నవంబర్ 1న శ్రీకాకుళం జిల్లా పర్యటన సందర్బంగా స్పౌజ్ కేటగిరీ కింద ఎప్పటికప్పుడు వితంతువులకు పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. ఈ మేరకు ఈ నెల నుంచే స్పౌజ్ కేటగిరి విధానం అమల్లోకి వస్తుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రకటించారు. ఇందులో భాగంగా 5,402 మందికి కొత్తగా ఫించన్లు మంజూరు చేశామన్నారు. వీరికి డిసెంబర్ 31న రూ.4 వేల చొప్పున పింఛన్లు అందిస్తామన్నారు. దీంతో పాటు గత మూడు నెలల్లో వివిధ కారణాలతో పింఛన్లు తీసుకోని 50 వేల మందికి పాత బకాయిలతో కలిపి పింఛన్ అందించనున్నామని చెప్పారు.
డిసెంబర్ 31నే పెన్షన్ల పంపిణీ
నూతన సంవత్సర ప్రారంభం కానున్న నేపథ్యంలో జనవరి 1న కాకుండా ముందు రోజే పెన్షన్ల పంపిణీకి అనుమతించాలని కొన్ని రోజులుగా గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.ఉద్యోగుల వినతిపై సానుకూలంగా స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 31న పెన్షన్ల పంపిణీకి ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీపై స్పష్టత ఇస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగుల ప్రతిపాదన మేరకు డిసెంబర్ 31న పెన్షన్ల పంపిణీకి ఏర్పాట్లు చేసుకోవాలని గ్రామ, వార్డు సచివాలయాలకు ఆదేశాలు అందాయి. రాష్ట్రంలో 63.75 లక్షల మందికి జనవరి నెలలో రూ.2,717.31 కోట్లను డిసెంబర్ 30వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనుంది.
ప్రభుత్వ నిర్ణయంతో డిసెంబర్ 31వ తేదీ తెల్లవారుజామునే ఏపీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ చేపడతారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్లి పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. గత జులై నుంచి ఏపీలో పెన్షన్ల పంపిణీ గ్రామ, వార్డుసచివాలయ సిబ్బందితోనే చేపడుతున్నారు.
సంబంధిత కథనం