Game Changer Ticket Rates Hike : హీరో రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ టికెట్ రేట్లు పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రాత్రి ఒంటి గంట బెనిఫిట్ షో టికెట్ ధర రూ.600లుగా నిర్ణయించింది. జనవరి 11 నుంచి జనవరి 23 వరకు ఐదు షోలు, రేట్లు పెంపునకు అనుమతినిచ్చింది. మల్టీప్లెక్స్ లలో టికెట్ కు అదనంగా రూ.175 పెంచుకోవచ్చని తెలిపింది. సింగిల్ స్క్రీన్స్ లో టికెట్ కు అదనంగా రూ.135 పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
పొలిటికల్ థ్రిల్లర్ గేమ్ ఛేంజర్ సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో టికెట్ల రేట్ల పెంపు, బెనిఫిట్ షోలకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జనవరి 10న ఆరు షోలకు అనుమతి ఇచ్చింది. ఉదయం 4 గంటలకు ప్రత్యేక షో నిర్వహించేందుకు అనుమతి ఇచ్చారు. జనవరి 11 తేదీ నుంచి 23 తేదీ వరకూ పెంచిన ధరలతో ఐదు షోలకే అనుమతి ఇచ్చారు.
టికెట్ల ధరల పెంపుపై ఏపీ ప్రభుత్వం ఆచితూచి నిర్ణయం తీసుకుంది. ఇటీవల పుష్ప 2 విడుదల సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలను దృష్టిలో పెట్టుకుని గేమ్ ఛేంజర్ విషయంలో కాస్త తక్కువగానే ధరలు పెంచింది ఏపీ ప్రభుత్వం. తెలుగు రాష్ట్రాలు పుష్ప 2 బెనిఫిట్ షోలకు రూ.800..జీఎస్టీతో కలిపి రూ.1000 వరకు పెంచారు. మల్టీఫ్లెక్స్ లలో రూ.1200 వరకు పెంచారు. అయితే గేమ్ ఛేంజర్ విషయంలో జీఎస్టీతో కలిపి రూ.600(బెనిఫిట్ షో) ధరలు నిర్ణయించింది. మిగిలిన షోలకు మల్టీఫ్లెక్స్ లలో రూ.175(జీఎస్టీతో కలిపి), సింగిల్ స్క్రీన్ లో రూ.135(జీఎస్టీతో కలిపి) నిర్ణయించింది ఏపీ ప్రభుత్వం.
పుష్ప 2 విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలతో...ఇకపై బెనిఫిట్ షోలు, టికెట్ల ధరల పెంపు ఉండదని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. ఇటీవల సినీ ప్రముఖుల భేటీలోనూ బెనిఫిట్ షోలు ఉండవని సీఎం స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో గేమ్ ఛేంజర్ టికెట్ల ధరల పెంపు ఉండకపోవచ్చని సమాచారం.
రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న గేమ్ ఛేంజర్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ కాబోతుంది. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీపై పాన్ ఇండియన్ లెవెల్‌లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఆర్ఆర్ఆర్ బ్లాక్‌బస్టర్ తర్వాత రామ్‌చరణ్ హీరోగా నటిస్తోన్న మూవీ ఇది. మరోవైపు శంకర్ దర్శకత్వంలో వస్తోన్న ఫస్ట్ తెలుగు సినిమా కూడా ఇదే కావడం గమనార్హం. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో భారీగా గేమ్ ఛేంజర్‌ను మేకర్స్ ప్రమోట్ చేస్తోన్నారు.
సంబంధిత కథనం