AP Vinayaka Mandapam : వినాయక మండపం ఏర్పాటుకు సింగిల్ విండో విధానం, ఎన్వోసీ కోసం ఇలా దరఖాస్తు చేసుకోండి
AP Vinayaka Mandapam : ఏపీలో వినాయక మండపాలు ఏర్పాటుకు ప్రభుత్వం సింగిల్ విండో క్లియరెన్స్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ విధానంలో మండపాల ఏర్పాటుకు ఎన్వోసీ అందిస్తున్నారు. ganeshutsav.net వెబ్‌సైట్ లో గణేష్ మండపం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
AP Vinayaka Mandapam : రాష్ట్రంలో వినాయక మండపాల ఏర్పాటుకు సింగిల్ విండో క్లియరెన్స్ విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే పోలీస్ శాఖ కూడా ప్రకటనలో పేర్కొంది.
రాష్ట్ర ప్రభుత్వం వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయక మండపాలు ఏర్పాటు చేసేందుకు ప్రజల కోసం ప్రత్యేకంగా ఒక సింగిల్ విండో క్లియరెన్స్ విధానం తీసుకుని వచ్చింది. ఇంతకు ముందు వినాయక మండపం ఏర్పాటు కోసం ప్రజలు అగ్నిమాపక శాఖ, పురపాలక శాఖ, విద్యుత్ శాఖ, పోలీసుశాఖల నుంచి నిరభ్యంతర (ఎన్ఓసీ) పత్రం తీసుకోవాల్సి ఉండేది. దీనికోసం ప్రజలు ఆయా శాఖల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ప్రజల వెసులుబాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం సింగిల్ విండో క్లియరెన్స్ విధానం రూపొందించింది.
వాట్సాప్ లో హాయ్ అని పెట్టాలి
ఇందులో భాగంగా ప్రజలు 7995095800 మొబైల్ నంబర్‌కు వాట్సాప్ ద్వారా హాయ్ (Hi) అని సందేశం పంపిస్తే చాలు, నిరభ్యంతర ఎన్ఓసీ పత్రం కోసం అనుసరించాల్సిన ప్రక్రియ మొత్తం వాట్సాప్ ద్వారా ప్రజలకు తెలియజేస్తారు. ఆ తరువాత ప్రజలు ganeshutsav.net అనే వెబ్‌సైట్ లో గణేష్ మండపం ఏర్పాటు చేసే కమిటీ సభ్యుల వివరాలు, మండపం ఏర్పాటు చేసే ప్రదేశం, ఏ పోలీసు స్టేషన్ పరిధిలోకి వస్తుంది, విగ్రహం ఎత్తు, మండపం ఎత్తు, విగ్రహ ప్రతిష్ఠ ఏ రోజు జరుగుతుంది, నిమజ్జనం ఎక్కడ ఏ సమయంలో చేస్తారు, ఏ వాహనం ద్వారా నిమజ్జనం చేస్తారు, వంటి వివరాలను నమోదు చేసి దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు సంబంధిత పోలీసు స్టేషన్ ఎస్‌హెచ్ఓ (SHO)కి వెళ్తుంది. ఎస్‌హెచ్ఓ ఆధ్వర్యంలో పురపాలక శాఖ, అగ్ని మాపక శాఖ, విద్యుత్ శాఖల సిబ్బంది ఒక బృందంగా ఏర్పడి మండపం ఏర్పాటు చేసే ప్రదేశాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించి సానుకూలంగా ఉంటే క్యూఆర్ (QR) కోడ్‌తో కూడిన నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) జారీ చేస్తారు.
అనుమతికి అవసరం అయిన రుసుము వివరాలు తెలియచేస్తారు. ప్రజలు వారికి దగ్గరలో ఉన్న మీసేవ కేంద్రలో తగిన రుసుమును చెల్లించి, ఆ రసీదును వెబ్‌సైట్‌లో అప్లోడ్ చేసిన తరువాత ఎస్‌హెచ్ఓ వాటిని పరిశీలించి వెంటనే నిరభ్యంతర (ఎన్ఓసీ) పత్రం జారీ చేస్తారు. ఈ నిరభ్యంతర పత్రాన్ని (ఎన్ఓసీ) ప్రింట్ తీసి గణేష్ మండపంలో ఉంచాలి. పోలీసులు వచ్చినప్పుడు క్యూర్ (QR) కోడ్‌ని స్కాన్ చేసి తనిఖీ చేస్తారు.
జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం