SIT On Liquor Irregularities : వైసీపీ హయాంలో మద్యం అమ్మకాలపై సిట్ ఏర్పాటు-నగదు లావాదేవీలు, హోలోగ్రామ్ వ్యవహారంపై విచారణ-ap govt formed sit on ysrcp govt time liquor saled no digital payments allowed ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Sit On Liquor Irregularities : వైసీపీ హయాంలో మద్యం అమ్మకాలపై సిట్ ఏర్పాటు-నగదు లావాదేవీలు, హోలోగ్రామ్ వ్యవహారంపై విచారణ

SIT On Liquor Irregularities : వైసీపీ హయాంలో మద్యం అమ్మకాలపై సిట్ ఏర్పాటు-నగదు లావాదేవీలు, హోలోగ్రామ్ వ్యవహారంపై విచారణ

SIT On Liquor Irregularities : గత ప్రభుత్వ హయాంలో మద్యం విక్రయాల్లో భారీగా అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు నేతృత్వంలో 7గురి సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది.

వైసీపీ హయాంలో మద్యం అమ్మకాలపై సిట్ ఏర్పాటు-నగదు లావాదేవీలు, హోలోగ్రామ్ వ్యవహారంపై విచారణ

SIT On Liquor Irregularities : వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం అక్రమాలు జరిగాయని కూటమి పార్టీలు ఎన్నికల సమయంలో తీవ్ర ఆరోపణలు చేశాయి. తాము అధికారంలోకి వస్తే మద్యంపై జే ట్యాక్ విచారణ చేస్తామని స్పష్టం చేశాయి. తాజాగా కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం అమ్మకాలపై విచారణ జరపాలని నిర్ణయించింది. 2019 అక్టోబరు నుంచి 2024 మార్చి వరకు జరిగిన మద్యం అక్రమాలపై ప్రత్యేక దర్యాప్తు సంస్థ(సిట్) ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

15 రోజులకోకసారి నివేదిక

విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ రాజశేఖర్‌ బాబు నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో సిట్‌ను ప్రభుత్వం నియమించింది. మద్యం అమ్మకాలకు సంబంధించి అవరమైన పూర్తి వివరాలు సిట్ అధికారులకు ఇవ్వాలని ఎక్సైజ్‌ శాఖకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సిట్ బృందం సీఐడీ చీఫ్‌ ద్వారా ప్రతి 15రోజులకోసారి తమకు నివేదిక సమర్పించాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. సిట్‌లో సభ్యులుగా ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్‌ ఎస్పీ సుబ్బరాయుడు, అదనపు ఎస్పీ కొల్లి శ్రీనివాస్‌, సీఐడీ ఏఎస్పీ శ్రీహరిబాబు, డోన్‌ డీఎస్పీ శ్రీనివాస్‌, సీఐ శివాజీను నియమించింది.

సీఐడీ డీఐజీ ఆధ్వర్యంలో సిట్‌ పనిచేయనుంది. సిట్‌ బృందానికి పూర్తి దర్యాప్తు అధికారాలు కల్పించినట్లు ప్రభుత్వం తెలిపింది. 2019 అక్టోబరు నుంచి 2024 మార్చి వరకు రాష్ట్రంలో మద్యం విక్రయాల్లో సుమారు రూ.90 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. డిజిటల్ చెల్లింపులకు అనుమతిలేకపోవడం, నగదు లావాదేవీలతో పాటు హోలో గ్రామ్‌ల వ్యవహారంలో భారీగా అక్రమాలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి.

కల్లుగీత కార్మికుల మద్యం షాపుల దరఖాస్తు గడువు పెంపు

రాష్ట్రంలో కల్లు గీత కార్మికులకు కేటాయించిన మద్యం షాపుల దరఖాస్తులకు గడువు పొడిగించారు. ఈ నెల 8వ తేదీ వరకు గడువు పెంచినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ నెల 9న దరఖాస్తుల పరిశీలించనున్నారు. 10వ తేదీన మద్యం షాపుల కేటాయింపు సంబంధించి డ్రా తీస్తారు. అదే రోజు గీతకార్మికులకు షాపుల కేటాయిస్తారు.

వైసీపీ సర్కార్ హయాంలో ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మద్యం దుకాణాలు నడిచేవి. కాంట్రాక్ట్ ఉద్యోగులతో ప్రభుత్వమే మద్యం విక్రయాలు నిర్వహించేదేది. అయితే కూటమి అధికారంలో రావడంతో మద్యం అమ్మకాలపై నూతన ఎక్సైజ్ పాలసీ తీసుకొచ్చింది. మద్యం షాపులను ప్రైవేట్ పరం చేసింది. ప్రైవేట్ వ్యక్తులు మద్యం షాపులను నిర్వహించేలా చేసింది.