AP DSC Free Coaching : డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్, 3 నెలల పాటు ఉచిత కోచింగ్
AP DSC Free Coaching : గిరిజన అభ్యర్థులకు ఉచితంగా డీఎస్సీ కోచింగ్ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ కసరత్తు చేస్తుంది. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించగా...2150 మంది అప్లై చేసుకున్నారు. 6 ఐటీడీఏల్లో శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.
AP DSC Free Coaching : ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 16,347 టీచర్ల పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గిరిజన అభ్యర్థులకు ఉచిత డీఎస్సీ శిక్షణకు గిరిజన సంక్షేమశాఖ చర్యలు చేపట్టింది. ఇటీవల గిరిజన సంక్షేమ శాఖ సమీక్షలో... గిరిజన అభ్యర్థులకు ఉచితంగా డీఎస్సీ శిక్షణ ఇవ్వాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. దీంతో ఉచిత శిక్షణకు జిల్లాల వారీగా దరఖాస్తులను ఆహ్వానించగా 2,150 మంది అప్లై చేసుకున్నారని అధికారులు తెలిపారు. గిరిజన ప్రాంతాల నుంచి ఎక్కువ దరఖాస్తులు వచ్చాయని, గిరిజనేతర ప్రాంతాల నుంచి తక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయన్నారు.
రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న 6 ఐటీడీఏల్లో ప్రతి చోటా ఒక డీఎస్సీ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. గిరిజనేతర ప్రాంతాల్లో రెండు లేదా మూడు చోట్ల శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసే ఆలోచన చేస్తున్నారు. ఒక్కో కేంద్రంలో 100 నుంచి 150 మంది అభ్యర్థులకు శిక్షణ ఇవ్వనున్నారు. త్వరలోనే ఉచిత శిక్షణ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు గిరిజన సంక్షేమశాఖ అధికారులు తెలిపారు. గిరిజన అభ్యర్థులకు 3 నెలలపాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. భోజనం, వసతి ఖర్చులను ప్రభుత్వం భరించనున్నట్లు తెలిపారు. అలాగే ఉచితంగా మెటీరియల్‌ను అందించనున్నారు. ఇందు కోసం ఒక్కో అభ్యర్థిపై రూ.25 వేల వరకు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. తొలి విడతలో 1000 మందికి ఉచిత శిక్షణ ఇచ్చేందు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ డీఎస్సీ ఫలితాలు ఆలస్యం!
తెలంగాణ డీఎస్సీ ఫైనల్ ‘కీ’పై అభ్యర్థుల నుంచి భారీగా అభ్యంతరాలు వచ్చాయి. చాలా మంది అభ్యర్థులు పుస్తకాలు తీసుకొని ఎస్‌సీఈఆర్‌టీ ఆఫీస్‌కు వచ్చారు. తమ అభ్యంతరాలను అధికారులకు వివరించారు. ఈ నెల 6వ తేదీ రాత్రి డీఎస్సీ తుది ‘కీ’ని విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు. దీనిపై అభ్యంతరాలు ఉంటే స్వీకరిస్తామని చెప్పారు. దీంతో అభ్యర్థులు తమ అభ్యంతరాలను చెప్పేందుకు ఎస్‌సీఈఆర్‌టీ కార్యాలయానికి క్యూ కట్టారు. మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టుల కోసం 2.45 లక్షల మంది పోటీపడ్డారు.
పలు ప్రశ్నలపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో.. అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. అభ్యర్థుల అభ్యంతరాలపై నిపుణుల కమిటీ నిర్ణయం తీసుకుంటుందని అధికారులు చెబుతున్నారు. తుది ‘కీ’పై అభ్యంతరాలు రావడంతో.. డీఎస్సీ, టెట్ మార్కులను కలిపి ఇచ్చే జనరల్ ర్యాంకు జాబితా వెల్లడి ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. తుది కీ వెల్లడించినప్పుడు.. వారం రోజుల్లో జనరల్ ర్యాంకు జాబితా వెల్లడిస్తామని అధికారులు చెప్పారు. కానీ.. అభ్యంతరాల కారణంగా ఆలస్యమవుతుందని భావిస్తున్నారు.
ఇప్పటికే తెలంగాణ డీఎస్సీ పరీక్షల ఫైనల్ కీ లు వచ్చేశాయి. అభ్యర్థులు విద్యాశాఖ అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి కీ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. https://tgdsc.aptonline.in/tgdsc/FinalKey లింక్ పై క్లిక్ చేసి ఫైనల్ కీని పొందవచ్చు. తుది ఫలితాలు విడుదల కావాల్సి ఉంది.
సంబంధిత కథనం