BC EWS Subsidy Loans : బీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు గుడ్ న్యూస్- త్వరలో సబ్సిడీపై స్వయం ఉపాధి లోన్లకు దరఖాస్తులు
BC EWS Subsidy Loans : బీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాల్లోని పేదలకు సబ్సిడీపై రుణాలు అందిచేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. లబ్దిదారుల వాటా లేకుండానే స్వయం ఉపాధి రుణాలు అందించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు అధికారులు మార్గదర్శకాలు రూపొందించారు.
BC EWS Subsidy Loans : బీసీలు, ఈడబ్ల్యూఎస్ బలహీనవర్గాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా వర్గాల్లోని పేదలకు స్వయం ఉపాధి రుణాలు మంజూరు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 2024-25 సంవత్సరానికి రాయితీపై రుణాలు అందించేందుకు బీసీ వర్గాలకు రూ.896 కోట్లు, ఈడబ్ల్యూఎస్ రూ.384 కోట్లు బడ్జెట్ లో కేటాయించారు. ఇప్పటికే ఈ పథకం అమలుకు అధికారులు మార్గదర్శకాలు రూపొందించారు. వారం రోజుల్లో అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు.

ఈ ఏడాది స్వయం ఉపాధి రాయితీ రుణాల పథకం కింద 1.30 లక్షల మంది బీసీలు, 59 వేల మంది ఈడబ్ల్యూఎస్ వర్గాలకు రుణాలు అందించనున్నారు. అయితే లబ్దిదారుల వాటా లేకుండానే రాయితీపై రుణాలు మంజూరు చేయనున్నారు. గతంలో లబ్దిదారులు కొంత వాటా పెట్టుకుంటే, ప్రభుత్వం రాయితీపై రుణాలు అందించేది. తాజా మార్గదర్శకాల ప్రకారం లబ్దిదారుల వాటా లేకుండానే యూనిట్ ఏర్పాటుచేసుకోవచ్చు. ప్రభుత్వ రాయితీ పోను, మిగతా మొత్తాన్ని బ్యాంకుల నుంచి లోన్రూపంలో ప్రభుత్వం అందించనుంది. ఈ పథకాన్ని పటిష్టంగా అమలుచేసేందుకు స్వయం ఉపాధి యూనిట్లకు జియోట్యాగింగ్ చేస్తారు. దరఖాస్తు అనంతరం పరిశీలనకు జిల్లా స్థాయిలో అధికారులు తనిఖీ చేయనున్నారు.
త్వరలో దరఖాస్తులు
బీసీ, ఈడబ్ల్యూఎస్ స్వయం ఉపాధి రుణాల మంజూరుకు త్వరలో దరఖాస్తులు ఆహ్వానించనున్నారు. ఆన్ లైన్ అప్లికేషన్ల స్వీకరణకు ఆన్‌లైన్ బెనిఫిషియరీ మానిటరింగ్ అండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఓబీఎంఎంఎస్) అనే వెబ్ పోర్టల్ ను డిజైన్ చేశారు. అర్హులు ఆన్‌లైన్‌లో స్వయంగా దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది సహయంతో...లబ్ధిదారులను ఎంపీడీవో/మునిసిపల్ కమిషనర్లు ఎంపిక చేయనున్నారు. దరఖాస్తుల పరిశీలన అనర్హులని తెలిస్తే..వారి స్థానంలో మరొకరికి అవకాశం కల్పిస్తారు.
దరఖాస్తులు, డాక్యుమెంటేషన్ కోసం బ్యాంకుల చుట్టూ తిరగకుండా ఎంపీడీవో/మునిసిపల్ కమిషనర్ కార్యాలయాల్లో ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నారు. యూనిట్ ఏర్పాటుకు సంబంధించిన పత్రాలు బ్యాంకుకు సబ్మిట్ చేసిన వెంటనే లబ్ధిదారుల సబ్సిడీ మొత్తాన్ని ప్రభుత్వం బ్యాంకులకు జమ చేస్తుంది. అనంతరం రాయితీ, బ్యాంకు లోన్ మొత్తం లబ్దిదారుడి ఖాతాలు జమ చేస్తారు. యూనిట్లు మంజూరైన అనంతరం నియోజకవర్గస్థాయిలో కార్యక్రమాలు నిర్వహించి లబ్దిదారులకు అందిస్తారు. లబ్దిదారులు రుణాలు తిరిగి చెల్లింపును గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిలో ఒకరికి పర్యవేక్షిస్తుంటారు.
దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న 21 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న వారు స్వయం ఉపాధి రాయితీ రుణాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. మినీ డెయిరీ యూనిట్లు, గొర్రెలు, మేకల పెంపకం, మేదర, కుమ్మరి, శాలివాహన కుటుంబాలు, వడ్రంగి పనివారికి రుణాలు, జనరిక్ మందుల షాపులు ఏర్పాటుకు రుణాలు అందిస్తారు.
సంబంధిత కథనం