వైజాగ్ వేదికగా 5 లక్షల మందితో 'యోగా డే'..! జూన్ 21న ఏపీ సర్కార్ ఏం చేయబోతుందంటే...?-ap govt aims for guinness world record with yoga event in vizag ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  వైజాగ్ వేదికగా 5 లక్షల మందితో 'యోగా డే'..! జూన్ 21న ఏపీ సర్కార్ ఏం చేయబోతుందంటే...?

వైజాగ్ వేదికగా 5 లక్షల మందితో 'యోగా డే'..! జూన్ 21న ఏపీ సర్కార్ ఏం చేయబోతుందంటే...?

జూన్ 21వ తేదీన ప్రధాని మోదీ ఆధ్వర్యంలో విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించనున్నారు. ఇందుకు ఏపీ ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. అక్కడ ఒకేరోజు 5 లక్షల మంది యోగా చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లక్ష్యంగా ఈవెంట్ చేపట్టనున్నారు.

చింతపల్లి బీచ్ లో యోగాంధ్ర కార్యక్రమం (ఫొటో)

‘యోగాంధ్ర’ కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజును భారీ స్థాయిలో యోగా కార్యక్రమాలను చేపట్టనుంది. విశాఖలో నిర్వహించే కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరుకానున్నాయి. ఒక్క విశాఖలోనే ఒకే రోజు 5 లక్షల మంది యోగా చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

గిన్నిస్ రికార్డ్ లక్ష్యంగా…!

మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా 2 కోట్ల మంది లక్ష కేంద్రాల్లో యోగా సాధన చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించాలనే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం ఉంది. 25 లక్షల మందికి యోగా సర్టిఫికెట్లు అందజేయాలని భావిస్తోంది. ఇదే విషయాన్ని తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. యోగా మన జీవితంలో భాగం కావాలని… ఆయుష్ ద్వారా యోగాను ప్రతి ఒక్క ఇంటికి చేర్చేందుకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. లక్ష కేంద్రాల్లో యోగా సాధన చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు.

విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు…

యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా యోగా అవగాహన కార్యక్రమాలు పెద్ద ఎత్తున కొనసాగిస్తున్నారు. విశాఖపట్నంలోని ఆర్‌కె బీచ్ నుండి భీమిలి బీచ్ వరకు జ‌రిగే యోగా ప్రదర్శనలో భారీ ఎత్తున ప్రజలు భాగస్వాములవుతారని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రధాన కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

యోగాంధ్ర కార్యక్రమంలో 2 కోట్ల మందిని భాగస్వాములను చేయాలని ప్ర‌భుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం పేర్ల నమోదు కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం చేపట్టింది. ఇప్పటికే కోటిపైగా రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21 నాటికి 2 కోట్ల లక్ష్యాన్ని చేరుకుంటామని అధికారులు ధీమాను వ్య‌క్తం చేస్తున్నారు.

రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇలా….

యోగాంధ్ర కార్యక్రమంలో భాగమయ్యేందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇందుకోసం ముందుగా https://yogandhra.ap.gov.in/#/home/yoga-registration వెబ్ సైట్ లోకి వెళ్లాలి. ఇక్కడ ఫామ్ అందుబాటులో ఉంటుంది. మీ వివరాలను నమోదు చేయాలి. జూన్ 21న నిర్వహించే యోగా కార్యక్రమంలో ఎక్కడ పాల్గొంటారనేది సెలెక్ట్ చేయాలి. ఓటీపీ ప్రాసెస్ తర్వాత… రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం