Aadhaar Updates: ఆధార్‌ సవరణ అంటే బతుకు ఆగమాగం.. ప్రాంతీయ కేంద్రం ఏర్పాటును పట్టించుకోని ఏపీ ప్రభుత్వం-ap governments inaction on regional aadhaar centers causing hardship for residents ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Aadhaar Updates: ఆధార్‌ సవరణ అంటే బతుకు ఆగమాగం.. ప్రాంతీయ కేంద్రం ఏర్పాటును పట్టించుకోని ఏపీ ప్రభుత్వం

Aadhaar Updates: ఆధార్‌ సవరణ అంటే బతుకు ఆగమాగం.. ప్రాంతీయ కేంద్రం ఏర్పాటును పట్టించుకోని ఏపీ ప్రభుత్వం

Bolleddu Sarath Chandra HT Telugu
Jan 23, 2025 09:34 AM IST

Aadhaar Updates: లేదు లేదంటూనే ఆధార్‌ కార్డును ప్రతి ఒక్కరి జీవితంలో ఆనివార్యం చేసిన కేంద్ర ప్రభుత్వం సవరణల విషయంలో చుక్కలు చూపిస్తోంది. ప్రైవేట్ సంస్థలకు ఆధార్ బాధ్యతల్ని అప్పగించి నరకం చూపిస్తోంది. ఏపీలో ప్రాంతీయ కేంద్రం లేకపోవడంతో వేలాది మంది ఆధార్ సవరణల కోసం అల్లాడి పోతున్నారు.

ఆధార్‌ సవరణలకు తలనొప్పులు, ఏపీలో ప్రాంతీయ కేంద్రం లేకపోవడమే అసలు సమస్య
ఆధార్‌ సవరణలకు తలనొప్పులు, ఏపీలో ప్రాంతీయ కేంద్రం లేకపోవడమే అసలు సమస్య

Aadhaar Updates: ఆధార్‌ కార్డుల సవరణలు చేయాలంటే ఏపీలో ప్రజలకు తలకు మించిన భారంగా పరిణమిస్తోంది. ఆధార్ కేంద్రాలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం వాటిపై అజమాయిషీ రాష్ట్ర ప్రభుత్వానికి లేకపోవడం ఒక ఎత్తైతే ఏపీలో కనీసం ఆధార్ ప్రాంతీయ కేంద్రం కూడా లేకపోవడం తీవ్ర ఇక్కట్లకు గురి చేస్తోంది. ఆధార్‌ కార్డులో సవరణల్ని విశిష్ట గుర్తింపు నమోదు ప్రాధికార సంస్థ సంక్లిష్టం చేసి ప్రజల బతుకుల్ని దుర్భరం చేసేసింది. ఈ సమస్యపై రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించక పోవడంతో ఆధార్‌ సవరణల కోసం నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది.

ప్రాంతీయ కేంద్రం ఏర్పాటును పట్టించుకోని ప్రజా ప్రతినిధులు

ఆధార్‌ కార్డులకు సంబంధించిన ప్రాంతీయ కార్యాలయం ఏపీలో లేదు. ఏపీ, తెలంగాణ, ఒడిశా, చత్తీస్‌ఘడ్‌, అండమాన్‌, నికోబార్‌ రాష్ట్రాలకు ప్రాంతీయ కార్యాలయం హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. ఆధార్‌ కార్డులకు సంబంధించిన ప్రజలు ఆధార్‌ కార్డుల్లో ఏ సమస్య వచ్చినా హైదరాబాద్ వెళ్లాల్సి ఉంటుంది. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఎవరికి ఏ సమస్య వచ్చినా హైదరాబాద్ వెళ్లాల్సిందే.

హైదరాబాద్‌ కేంద్రంలో రోజుకు 100 టోకెన్లు మాత్రమే జారీ చేస్తారు. ఐదు రాష్ట్రాల నుంచి ఎవరు వెళ్లినా ఆ రోజు టోకెన్ రాకపోతే అక్కడ పడిగాపులు పడాల్సిందే. ఏపీలో ఆధార్‌ ఆధీకృత కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రజల నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు వస్తున్నా సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఆధార్‌ కార్డుల్లో అక్షరం తేడా ఉన్నా సాంకేతికంగా సీడింగ్‌ అవ్వడం లేదు. ఇప్పటికే విద్యార్థులు, ఉద్యోగులు ఆధార్ సవరణల కోసం హైదరాబాద్‌ వెళ్లాల్సి వస్తోంది. ఇదంతా వ్యయ ప్రయాసాలతో కూడిన వ్యవహారం కావడం, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోపోవడం సమస్యలకు కారణం అవుతోంది.

తప్పనిసరి కాదంటూనే…!

దేశంలోని పౌరులందరికి విశిష్ట గుర్తింపు సంఖ్యను కేటాయించడం మొదలై దాదాపు పదిహేనేళ్లవుతోంది. ఈ క్రమంలో ఆధార్‌ కార్డుల్ని జారీ చేసిన తర్వాత ఇప్పటి వరకు వాటిలో తప్పొప్పుల్ని సవరించుకోని వారు, ఆధార్‌లో వివరాలను అప్డేట్‌ చేసుకోని వారు కూడా దేశంలో కోట్ల సంఖ్యలో ఉన్నారు. ఆధార్‌ కార్డు జారీ చేసే సమయంలో ఎలాంటి వివరాలను నమోదు చేసుకోవాలని ప్రభుత్వం అవగాహన కల్పించలేదు. ప్రాథమికంగా అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా అందులో వివరాలను నమోదు చేశారు. ఈ నేపథ్యంలో పెళ్లైన మహిళలు, గృహిణులు తమ భర్తల ఇంటి పేర్లతో ఆధార్‌ కార్డుల్లో నమోదు చేసుకున్నారు. అలాంటి వారందరికి ఇప్పుడు చిక్కులు తప్పడం లేదు.

ఆడపిల్లల పాలిట శాపంగా మారిన ఆధార్‌

ఆధార్‌ విశిష్ట సంఖ్య ఇప్పుడు దేశంలో అన్నింటికి ఆధారమై పోయింది. పుట్టినప్పటి నుంచి చివరి మజిలీ వరకు అన్ని వివరాలు ఆధార్‌‌తో ముడిపెట్టేశారు. ఈ క్రమంలో చదువుకుని ఉద్యోగాలు చేసే మహిళలకు చిక్కులు తప్పడం ఆధార్‌ కార్డుల జారీ చేసే సమయంలో నమోదు చేసిన వివరాలకు, వారి సర్టిఫికెట్లలో ఉన్న పేర్లకు మార్పులు ఉంటే వాటిని సవరించుకోవడానికి తిప్పలు తప్పడం లేదు.

విజయవాడకు చెందిన 78 ఏళ్ల రిటైర్డ్‌ టీచర్ ఒకరు 2013లో ఆధార్‌ కార్డులో తన భర్త ఇంటి పేరుతో ఆధార్‌ కార్డును నమోదు చేసుకున్నారు. రెండేళ్ల క్రితం పాన్‌ కార్డులను ఆధార్‌‌తో అనుసంధానించుకునే క్రమంలో ఆమె సర్వీస్ రికార్డుల ఆధారంగా పుట్టింటి పేరుతో పాన్ ఉండటంతో ఆధార్‌ సీడింగ్ కాలేదు. 2024 నుంచి ఆధార్‌ - పాన్‌ లింకింగ్‌ తప్పనిసరి చేయడంతో బ్యాంకు అకౌంట్ల నిర్వహణలో చిక్కులు తలెత్తాయి. ఆధార్‌ కార్డు సవరణ కోసం ఏడాది కాలంగా ప్రయత్నిస్తున్నా పేరు మార్పు కాలేదని, తన విద్యార్హత పత్రాలు, సర్వీస్ సర్టిఫికెట్, పెన్షన్ పత్రాలు, పాన్ కార్డులో వివరాలు స్పష్టంగా ఉన్న మెట్టినింటి పేరుతో ఉన్న ఆధార్‌ కార్డును సరిచేయలేదని 78ఏళ్ల వృద్ధురాలు వాపోయారు. ఆధార్‌ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేసినా స్పందన లేదని చెప్పారు.

తప్పు ఎవరిది… శిక్ష ఎవరికి?

ఆధార్ కార్డులను జారీ చేసిన సమయంలో అందులో ఎలాంటి వివరాలను నమోదు చేయాలనే దానిపై అవగాహన కల్పించకుండానే క్యాంపుల్ని పెట్టి హడావుడిగా కార్డులను జారీ చేశారు. పుష్కరం క్రితం జారీ చేసిన కార్డులను కేవలం గుర్తింపు కోసమే వాడతామని అప్పట్లో యూపీఏ ప్రభుత్వం మభ్యపెట్టింది. ఆ తర్వాత ఆధార్ కార్డులను ప్రతి ప్రభుత్వ కార్యక్రమానికి అనుసంధానించారు.

పుట్టినప్పటి నుంచి పోయే వరకు అన్నింటికి ఆధార్‌ను ఆధారం చేసిన ప్రభుత్వం వాటి సవరణల విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఆధార్‌ కార్డులను 2012-13లో జారీ చేసే సమయంలో మహిళల వివరాలను నమోదు చేసేటపుడు కుటుంబ వివరాల ఆధారంగా ఆధార్‌ కార్డులో పేర్లను నమోదు చేశారు. ఇందుకు రేషన్‌ కార్డు, ఓటరు కార్డు వంటి వాటిని ప్రామాణికంగా తీసుకున్నారు.చదువుకున్న మహిళల, ఉద్యోగినులకు ఏ పేరును కొనసాగించాలనే దానిపై స్పష్టత కొరవడింది. దీంతో పెద్ద సంఖ్యలో మహిళలు భర్త ఇంటి పేరును ఆధార్‌ కార్డుల్లో నమోదు చేసుకున్నారు. అవే వారి పాలిట శాపంగా మారాయి.

సవరణలు సులువు కాదు…

చదువుకుని ఉద్యోగాలు చేస్తున్న గృహిణులు సైతం పలు కారణాలతో ఆధార్‌ కార్డుల్లో భర్త ఇంటిపేరును నమోదు చేసుకున్నారు. పెళ్లికి ముందే చదువు పూర్తి చేసుకుని ఉద్యోగాలు చేస్తూ పాన్‌ కార్డుల ద్వారా పన్నులు చెల్లిస్తున్న మహిళల్లో కూడా కొందరు ఆధార్‌ కార్డుల్లో అత్తింటి పేర్లను నమోదు చేసుకోవడమో, మార్చుకోడమో జరిగింది. ఇలాంటి వారికి పాన్‌ కార్డును ఆధార్‌ కార్డుతో లింక్ చేయడంలో సమస్యలు ఎదురయ్యాయి. ఆధార్‌, పాన్‌ కార్డుల్లో ఒకే రకమైన పేర్లు ఉంటేనే లింకింగ్ జరిగింది. వేర్వేరు పేర్లు ఉన్న వారిలో చాలామంది ఇప్పటికి ఆధార్‌ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు.

ఆధార్‌ కార్డుల్లో పేర్ల మార్పు వ్యవహారం ఇప్పుడు మరింత సంక్లిష్టంగా మారింది. ప్రభుత్వం నిర్దేశిత పత్రాలతో పేర్ల మార్పులు, సవరణలు అనుమతిస్తున్నా రెండు రకాల పేర్ల విషయంలో పేచీలు తప్పడం లేదు. ఆధార్‌ కార్డులో అత్తింటి పేరుతో ఉన్న పేరును కొనసాగించాలో, పుట్టింటి పేర్లతో ఉన్న పాన్‌ కార్డుల పేర్లను కొనసాగించాలనే గందరగోళం నెలకొంది. దీనిపై ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి స్పష్టత UIDAI కూడా ఇవ్వలేదు. దీనిపై ‍కేంద్ర ప్రభుత్వం, ఆర్ధిక శాఖ ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో వృద్ధులు, మహిళా పెన్షనర్లకు ఇక్కట్లు తప్పడం లేదు.

Whats_app_banner

సంబంధిత కథనం