AP Govt Schemes : వెనుక‌బ‌డిన వ‌ర్గాలకు దన్నుగా కూటమి ప్రభుత్వం.. స్వయం ఉపాధి పథకాలకు దరఖాస్తుల ఆహ్వానం-ap government to grant subsidized loans for self employment ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Govt Schemes : వెనుక‌బ‌డిన వ‌ర్గాలకు దన్నుగా కూటమి ప్రభుత్వం.. స్వయం ఉపాధి పథకాలకు దరఖాస్తుల ఆహ్వానం

AP Govt Schemes : వెనుక‌బ‌డిన వ‌ర్గాలకు దన్నుగా కూటమి ప్రభుత్వం.. స్వయం ఉపాధి పథకాలకు దరఖాస్తుల ఆహ్వానం

HT Telugu Desk HT Telugu
Jan 30, 2025 05:58 PM IST

AP Govt Schemes : స్వయం ఉపాధి అవకాశాలు పెంచేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా.. వెనుక‌బ‌డిన వ‌ర్గాల నుంచి ఉపాధి పథకాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులకు రాయితీపై రుణాలు ఇవ్వనుంది. దీనికి సంబంధించిన ముఖ్యమైన తేదీలు, వివరాలు ఇలా ఉన్నాయి.

ఏపీ ప్రభుత్వ పథకాలు
ఏపీ ప్రభుత్వ పథకాలు

వెనుక‌బ‌డి కులాలు (బీసీ), ఆర్థికంగా వెనుక‌బ‌డిన వ‌ర్గం (ఈడ‌బ్ల్యూఎస్‌) వర్గాల‌కు ఏపీ ప్ర‌భుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. బీసీ, ఈబీసీ, క‌మ్మ‌, కాపు, రెడ్డి, ఆర్యవైశ్య‌, క్ష‌త్రియ‌, బ్రాహ్మ‌ణ, బ‌లిజ‌, తెల‌గ‌, ఒంట‌రి వ‌ర్గాల‌కు సంబంధించిన ల‌బ్ధిదారుల‌కు.. స‌బ్సిడీ రుణాలు మంజూరు చేయ‌నుంది. బీసీ కార్పొరేష‌న్ ద్వారా ఈ రుణాలను ఇవ్వనుంది. అర్హులైన వారి నుంచి ద‌ర‌ఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ముఖ్య తేదీలు..

జ‌న‌వ‌రి 30 నుంచి ఫిబ్ర‌వ‌రి 7వ తేదీ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ద‌ర‌ఖాస్తు దాఖలు ప్ర‌క్రియ ముగిసిన త‌రువాత.. ఫిబ్ర‌వ‌రి 8 తేదీ నుంచి ఫిబ్ర‌వ‌రి 11 తేదీ వ‌ర‌కు ఇంట‌ర్వ్యూలు నిర్వ‌హిస్తారు. ఫిబ్ర‌వ‌రి 19వ తేదీలోపు అర్హులైన వారి బ్యాంక్ అకౌంట్‌లో ప్ర‌భుత్వ స‌బ్సిడీ రుణాలు జ‌మ అవుతాయి.

ద‌ర‌ఖాస్తు ఇలా..

అర్హులైన అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఒక‌వేళ డైరెక్ట్‌గా ద‌ర‌ఖాస్తు చేసుకోలేని వారు సంబంధిత గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల్లో డిజిట‌ల్ అసిస్టెంట్ స‌హ‌కారంతో అప్లై చేసుకోవచ్చు.

కార్పొరేష‌న్లు..

మొత్తం ఏడు కార్పొరేష‌న్లుకు సంబంధించి ఈ స‌బ్సిడీ రుణాలు మంజూరు చేస్తారు. బీసీ కార్పొరేష‌న్‌, ఈబీసీ కార్పొరేష‌న్‌, క‌మ్మ కార్పొరేష‌న్‌, కాపు కార్పొరేష‌న్‌, రెడ్డి కార్పొరేష‌న్‌, ఆర్య‌వైశ్య కార్పొరేష‌న్‌, క్ష‌త్రియ కార్పొరేష‌న్‌, బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్‌ ద్వారా స‌బ్సిడీ రుణాలు ఇస్తారు.

అర్హ‌త‌లు..

1. ఆయా కులాల‌కు చెందిన వారై ఉండాలి.

2.వయస్సు 21 నుంచి 60 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.

3. ప‌ట్ట‌ణ ప్రాంత ఆదాయం రూ.1,30,000, గ్రామీణ ప్రాంత ఆదాయం రూ.81,000 కంటే త‌క్కువ ఉండాలి.

4. తెల్ల రేష‌న్ కార్డులో ఒక్క‌రు మాత్ర‌మే అర్హులు.

అవ‌స‌ర‌మైన ప‌త్రాలు..

1. తెల్ల రేష‌న్ కార్డు

2. కుల ధ్రువీక‌ర‌ణ ప‌త్రం

3. ఆధార్ కార్డు

4. వ‌య‌స్సు ధ్రువీక‌ర‌ణ ప‌త్రం

5. బ్యాంకు పాస్‌బుక్‌

6. పాస్‌పోర్టు సైజ్ ఫోటో

ఉపాధి యూనిట్లు..

వ్య‌వ‌సాయ అనుబంధ రంగాల యూనిట్లు, ప‌రిశ్ర‌మ‌లు, చిన్న త‌ర‌హా వ్యాపారం, సేవ‌లు, ర‌వాణా విభాగం వాటికి స‌బ్సిడీ రుణాలు మంజూరు చేస్తారు. ఈ ఏడాదికి స్వ‌యం ఉపాధి స‌బ్సిడీ రుణాల ప‌థ‌కం కింద బీసీల‌కు 1,30,000 మందికి, ఈడబ్ల్యూఎస్ వ‌ర్గాల‌కు 59 వేల మందికి రుణాలు మ‌ంజూరు చేస్తారు. బీసీ వ‌ర్గాల‌కు రూ.896 కోట్లు, ఈడ‌బ్ల్యూఎస్ వ‌ర్గాల‌కు రూ.384 కోట్ల బ‌డ్జెట్‌ను కేటాయించింది.

(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)

Whats_app_banner