Text Books : ప్రభుత్వ పాఠ్య పుస్తకాలు వాడాల్సిందే….-ap government supplies text books to private school students ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Text Books : ప్రభుత్వ పాఠ్య పుస్తకాలు వాడాల్సిందే….

Text Books : ప్రభుత్వ పాఠ్య పుస్తకాలు వాడాల్సిందే….

HT Telugu Desk HT Telugu
Aug 21, 2022 07:23 AM IST

ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వం ముద్రించిన పాఠ్య పుస్తకాలను వినియోగించాల్సిందేనని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. పాఠ్య పుస్తకాలు ముద్రించినా ప్రైవేట్ స్కూళ్లు వాటిని తీసుకెళ్లకపోవడంపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తక్షణం ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ప్రభుత్వం ముద్రించిన పాఠ్య పుస్తకాలను విద్యార్ధులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించింది.రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ప్రభుత్వం ముద్రించిన పాఠ్యపుస్తకాలనే వినియోగించాలని ఆదేశించింది.

<p>ప్రభుత్వ పాఠ్య పుస్తకాలనే వాడాలని ఏపీ ప్రభుత్వ ఆదేశం</p>
ప్రభుత్వ పాఠ్య పుస్తకాలనే వాడాలని ఏపీ ప్రభుత్వ ఆదేశం (Hindustan Times)

నిన్న మొన్నటి వరకు ప్రైవేట్ పాఠశాలల విద్యార్ధులకు టెక్స్ట్ బుక్స్‌ అందుబాటులో లేవని ఆందోళన వ్యక్తం చేసిన యాజమాన్యాలు ఇప్పుడు పుస్తకాలు అందుబాటులోకి వచ్చినా పుస్తకాలను తీసుకోకపోవడంపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రైవేట్ పాఠశాలల్లో చదువుకునే విద్యార్ధులకు టెక్స్ట్ బుక్స్‌ కొరత వేధిస్తోందంటూ పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమైంది. జులైలో విద్యార్ధులకు తరగతులు మొదలైన తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధులకు మాత్రమే టెక్స్ట్‌ బుక్స్‌ అందుబాటులోకి వచ్చాయి. అదే సమయంలో ప్రైవేట్ వ్యక్తులు టెక్స్ట్‌ బుక్స్‌ ముద్రించడం, విక్రయాలపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు సొంతంగా పుస్తకాలను ముద్రించడంపై నిషేధం విధించింది. దీంతో విద్యా సంవత్సరం మొదలైన తర్వాత ప్రైవేట్ స్కూల్ విద్యార్ధులకు ఇబ్బందులు తలెత్తాయి. దీనిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించింది. ఆన్‌లైన్‌లో ఇండెంట్లు పెట్టి టెక్స్ట్‌ బుక్స్‌ ఆర్డర్లు పెట్టాలని ప్రభుత్వ పాఠశాలలకు సూచించింది. తక్కువ వ్యవధిలోనే రాష్ట్రంలో ఉన్న విద్యార్ధుల సంఖ్యకు తగ్గట్లుగా పుస్తకాలను ముద్రించారు.

yearly horoscope entry point

ప్రైవేట్ పాఠశాలల విద్యార్ధుల కోసం టెక్స్ట్‌ బుక్స్‌ కొద్ది రోజుల క్రితమే అందుబాటులోకి వచ్చాయి. ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుకునే విద్యార్ధులకు రూ.500ఖర్చులో పాఠ్యపుస్తకాల సెట్‌ల ధరలను నిర్ణయించారు. ఈ నిర్ణయం ప్రైవేట్ స్కూళ్లకు మింగుడు పడటం లేదు. పాఠశాలల్లో టెక్స్ట్‌ బుక్స్‌, నోటు పుస్తకాలు, యూనిఫాంలను సైతం నిర్వాహకులే విక్రయించే పరిస్థితి చాలా చోట్ల ఉంది. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వం ముద్రించిన పాఠ్య పుస్తకాలను మాత్రమే వినియోగించాలని, నిర్ణయించిన ధరల కంటే ఎక్కువ వసూలు చేయరాదని స్పష్టం చేయడంతో ప్రైవేట్ విద్యా సంస్థలు నష్టపోతున్నామని భావిస్తున్నాయి. దీంతో ప్రభుత్వం ముద్రించిన పుస్తకాలను విద్యార్ధులకు అందించడంలో తాత్సారం చేస్తున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వం తల్లిదండ్రులపై ఫీజులు, పుస్తకాల రూపంలో పడుతున్న భారాన్ని తగ్గించేందుకు పాఠ్య పుస్తకాలను తక్కువ ధరకు అందిస్తున్నా పాఠశాలలు మాత్రం వాటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపడం లేదు. దీంతో జిల్లాల వారీగా విద్యా శాఖ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలతో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రభుత్వ ఆదేశాలను పాటించాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. గత ఏడాది ప్రైవేట్ స్కూల్స్‌ ఇచ్చిన ఇండెంట్ల ప్రకారం పాఠ్య పుస్తకాలను ముద్రించి ఇచ్చారు. చాలా పాఠశాలలు సకాలంలో ఇండెంట్లు ఇవ్వకపోవడంతో గత నెలలో వేగంగా పుస్తకాలను ముద్రించి అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రభుత్వం నిర్ణయించిన సిలబస్‌ మేరకే పాఠ్యపుస్తకాలను వినియోగించాలని, విద్యార్దులపై అదనపు భారం మోపొద్దని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.

మరోవైపు పాఠ్య పుస్తకాలను కొనుగోలు చేయడంలో ప్రైవేట్ స్కూల్స్‌ తాత్సారం చేస్తుండటంతో పుస్తకాలను కొనుగోలు చేసి విద్యార్ధులకు అందించని పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరిస్తున్నారు. విద్యార్ధులకు తగ్గట్లుగా టెక్స్ట్‌ బుక్స్‌ ముద్రించి అందుబాటులో ఉంచినా ప్రైవేట్ స్కూల్స్‌ ఆసక్తి చూపకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆన్‌లైన్ పుస్తకాల కోసం ఇండెంట్లు పెట్టిన పాఠశాలలు డిడిలు చెల్లించి పుస్తకాలు తీసుకెళ్లాలని సూచిస్తున్నారు. ప్రైవేట్ విద్యా సంస్థలు మాత్రం తమ లాభాలకు ప్రభుత్వం గండి కొట్టిందనే అక్కసుతో పుస్తకాలను తీసుకెళ్లడానికి ఆసక్తి చూపడం లేదు.

Whats_app_banner