Whatsapp AP: వాట్సాప్‌లోనే ఏపీ ప్రభుత్వ సేవలు.. 95523 00009తో మెటా పౌర సేవలు, ప్రారంభించిన నారా లోకేష్-ap government services on whatsapp meta civil services with 95523 00009 launched by nara lokesh ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Whatsapp Ap: వాట్సాప్‌లోనే ఏపీ ప్రభుత్వ సేవలు.. 95523 00009తో మెటా పౌర సేవలు, ప్రారంభించిన నారా లోకేష్

Whatsapp AP: వాట్సాప్‌లోనే ఏపీ ప్రభుత్వ సేవలు.. 95523 00009తో మెటా పౌర సేవలు, ప్రారంభించిన నారా లోకేష్

Bolleddu Sarath Chandra HT Telugu
Jan 30, 2025 12:51 PM IST

Whatsapp AP: ఏపీలో వాట్సాప్‌ ద్వారా పౌరసేవల్ని అందించేందుకు “మన మిత్ర ప్రజల చేతిలో ప్రభుత్వం” పేరుతో పౌర సేవల్ని మంత్రి నారా లోకేష్‌ లాంఛనంగా ప్రారంభించారు.మెటా భాగస్వామ్యంతో ప్రజలకు వివిధ రకాల పౌర సేవలు ఇకపై వాట్సాప్‌లోనే అందిస్తారు.ప్రభుత్వ సర్టిఫికెట్లకు ఇబ్బంది పడకుండా మొబైల్‌లోనే అందిస్తారు.

ఏపీలో వాట్సాప్‌లో మనమిత్ర  పౌర సేవలు ప్రారంభించిన మంత్రి నాారా లోకేష్‌
ఏపీలో వాట్సాప్‌లో మనమిత్ర పౌర సేవలు ప్రారంభించిన మంత్రి నాారా లోకేష్‌

Whatsapp AP: బటన్‌ నొక్కితే పౌర సేవలు అందిస్తానని యువగళం పాదయాత్రలో ప్రజలకు హామీ ఇచ్చానని దానిని నెరవేర్చేందుకు వాట్సాప్‌లోనే పౌర సేవల్ని అందించేందుకు మెటాతో వాట్సాప్‌ సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్‌ చెప్పారు.

yearly horoscope entry point

మనమిత్ర పేరుతో వాట్సాప్‌ గవర్నెన్స్‌ను లాంఛనంగా మంత్రి నారా లోకేష్‌ ప్రారంభించారు. ప్రపంచంలోనే ఎక్కడా ఇన్ని రకాల పౌరసేవల్ని వాట్సాప్‌ ఎక్కడ అందించలేదని, దీనిపై మెటాతో పలు మార్లు చర్చలు జరిపామని, అక్టోబర్ 23, 24న ఒప్పందం చేసుకుని డిసెంబర్‌ నెలకల్లా సేవల్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నా, నెల రోజులు ఆలస్యంగా వాట్సాప్ సేవల్ని ప్రారంభిస్తున్నట్టు లోకేష్‌ చెప్పారు.

మొదటి విడతలో 161 సేవలు, రెండో విడతలో 360రకాల సేవల్ని వాట్సాప్‌లోనే అందిస్తామని చెప్పారు. సర్టిఫికెట్ల మీద క్యూ ఆర్‌ కోడ్‌లతో జారీ చేస్తామని, వాటిని స్కాన్‌ చేస్తే వాటి వివరాలు ఏపీ ప్రభుత్వ వెబ్‌సైట్‌లో ప్రత్యక్షం అవుతాయని, నకిలీ పత్రాలను సృష్టించే అవకాశం ఉండదని లోకేష్‌ వివరించారు. రెవిన్యూ, మునిసిపల్, ఎండోమెంట్ సేవల్ని వాట్సాప్‌లో అందిస్తామన్నారు. టీటీడీ మినహా అన్ని దేవాలయాల సేవల్ని వాట్సాప్‌లో అందిస్తామన్నారు.

ఆర్టీసీ సేవలు కావాలంటే ఏఐ బోట్‌ సేవలు కూడా అందుబాటులోకి తీసుకు వస్తామన్నారు. పాదయాత్రలో ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలకు ఎదురయ్యే చెడు అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ,ప్రజలకు సౌకర్యవంతంగా ప్రభుత్వ సేవలను అందుకునేలా వాట్సాప్‌ సాయంతో సర్టిఫికెట్లను అందించే ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్టు లోకేష్‌ చెప్పారు.

తొలివిడతలో 161 రకాల సేవల్ని వాట్సాప్‌ ద్వారా అందించేందుకు ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. భవిష్యత్తులో అన్ని రకాల ప్రభుత్వ సేవల్ని వాట్సాప్‌లోనే అందించేందుకు ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు.

చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో వేగవంతంగా పౌరసేవల్ని అందిస్తోందని, మన మిత్ర యాప్‌ ద్వారా పౌర సేవల్ని సమర్ధవంతంగా అందించేందుకు శ్రీకారం చుట్టినట్టు వివరించారు. దేశమొత్తం ఆంధ్రప్రదేశ్‌ ఏం చేస్తుందోనని ఆసక్తి చూస్తోందని, పౌర సేవల్ని వారికి మెరుగైన విధానాల్లో అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు నారా లోకేష్‌ చెప్పారు.

అన్ని ప్రభుత్వ శాఖల సేవలను మెటాతో అనుసంధానించినట్టు చెప్పారు. 15రోజులుగా పరీక్షలు నిర్వహించారని, మరింత మెరుగు పరచనున్నామని, ఆర్నెల్లలో అన్ని రకాల సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులో వస్తాయని చెప్పారు. పాదయాత్రలో చెప్పిన విధంగా సేవలు అందుబాటులోకి తెచ్చినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో మెటా ప్రతినిధులు సంధ్య, రవి, దివ్య పాల్గొన్నారు..

వాట్సాప్ కాల్ చేయదు…

  • వాట్సాప్‌లో అందించే పౌర సేవలకు సంబంధించి మెటా నుంచి  ఎలాంటి ఫోన్‌ కాల్స్ రావని మంత్రి నారా లోకేష్‌ స్పష్టం చేశారు.
  • ఆధార్ కార్డుతో లింక్ చేసిన మొబైల్ నంబర్ ఆధారంగా సేవలు అందుతాయి
  • వాట్సాప్‌ ద్వారా అందించే సేవల్లో పౌరులకు సంబంధించిన సమాచారాన్ని మెటా స్టోర్ చేయదు.
  • మెటా డేటా సర్వర్లను రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో, సంరక్షణలో ఆంధ్రప్రదేశ్‌ భూభాగంలోనే ఏర్పాటు చేస్తారు.
  • వ్యక్తిగత గోప్యతకు పూర్తి ప్రాధాన్యత ఇస్తారు. 
  • చట్టపరమైన అంశాలతో ముడిపడిన సేవల్ని తర్వాతి దశలో వాట్సాప్‌ మనమిత్రలో జత చేస్తారు
  • పేర్ల మార్పులు వంటి సేవల విషయంలో చట్టపరంగా ఉన్న అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది.
  • కొన్ని రకాల సేవలను  నిర్ధిష్ట కాలపరిమితిలో అందిస్తారు.
  • మానవ ప్రమేయం లేకుండా   వాట్సాప్‌ ద్వారా పౌర సేవల్ని అందిస్తారు.
  • వాట్సాప్‌ పౌర సేవల ద్వారా ఉద్యోగ భద్రతకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. గతంలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాల్లో దరఖాస్తు చేసే విధానం యథాతథంగా కొనసాగుతుంది. 
  • వాట్సాప్‌లో పౌర సేవలపై ఫిర్యాదు చేసే అవకాశం లేదు. ఖచ్చితంగా  పౌరసేవలు అందించే లక్ష్యంతోనే కంప్లైంట్ చేసే ఆప్షన్‌ పెట్టలేదని మంత్రి నారా లోకేష్‌ చెప్పారు. 

Whats_app_banner