AP Contract Lecturers: కాంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్దీకరణకు ఏపీ ప్రభుత్వం విముఖత, ఆందోళన బాటలో లెక్చరర్లు
AP Contract Lecturers: డిగ్రీ, జూనియర్, పాలిటెక్నిక్ కాలేజీల్లో పని చేసే కాంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్దీకరణపై ప్రభుత్వం విముఖత చూపుతుండటంతో లెక్చరర్లు పోరాటానికి సిద్ధం అవుతున్నారు. తమ సర్వీసులను క్రమబద్దీకరించాలని డిమాండ్ చేస్తున్నారు.
AP Contract Lecturers: రాష్ట్రంలో డిగ్రీ, జూనియర్, పాలిటెక్నికల్ కాలేజీల్లో పని చేసే కాంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్దీకరణపై రాష్ట్ర ప్రభుత్వం విముఖత వ్యక్తం చేస్తోంది. దీంతో కాంట్రాక్ట్ లెక్చరర్లు పోరాటానికి సిద్ధం అవుతున్నారు. తాము ఏమీ అన్యాయం చేశామని అంటున్నారు. ఇప్పటికే ఈ విద్యా సంవత్సరంలో పది మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు మానసిక సంఘర్షణతో ప్రాణాలు విడిచారని చెబుతున్నారు.
రాష్ట్రంలో 4,656 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు క్రమబద్దీకరణ కోసం ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో 22 డిగ్రీ కాలేజీల్లో 635 మంది కాంట్రాక్ట్ లెక్చరర్స్, 439 జూనియర్ కాలేజీల్లో 3,618 మంది కాంట్రాక్ట్ లెక్చరర్స్, 87 పాలిటెక్నిక్ కాలేజీల్లో 403 మంది కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఉన్నారు.
2000 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ (ఏపి, తెలంగాణ ప్రాంతం)లో దాదాపు 7,656 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు జీవో నెంబర్ 42, 43 ప్రాతిపదికన నియామకం అయ్యారు. అయితే నియామకం అయిన రెండేళ్ల తరువాత నుంచి అంటే, 2002 నుంచి అనేక పోరాటాలు, ఉద్యమాలు చేస్తూ వస్తున్నారు. వివిధ డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ, విభజిత ఆంధ్రప్రదేశ్‌లో పోరాడుతూ వచ్చారు.
అయితే 2021లో తెలంగాణలో కాంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్దీకరణ అక్కడి ప్రభుత్వం చేసింది. దీంతో వారు గత రెండేళ్లుగా రెగ్యులర్ ఉద్యోగులుగానే కొనసాగుతున్నారు. కానీ అదే జీవో మీద నియామకం అయిన ఆంధ్రప్రదేశ్‌లోని కాంట్రాక్ట్ లెక్చరర్లు మాత్రం అలానే ఉండిపోయారు. 2023 అక్టోబర్‌లో గత ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణకు చట్టం చేసింది. దీని ప్రకారం జీవో ఎంఎస్ 114 ను తీసుకొచ్చి మార్గదర్శకాలను జారీ చేసింది. 2014 జూన్‌కు ముందు నియామకం అయిన 10,117 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరణకు అర్హులుగా గుర్తించింది.
ఈ క్రమంలో మెడికల్ అండ్ హెల్త్, ఫారెస్ట్, ట్రైబుల్ వెల్ఫేర్, పశువైద్యం తదితర డిపార్ట్‌మెంట్‌ల్లో పని చేసే దాదాపు నాలుగు నుంచి ఐదు వేల మంది ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసింది. దీంతో గతేడాది ఏప్రిల్ నుంచి వారంతా రెగ్యులర్ ఉద్యోగులుగానే కొనసాగుతున్నారు.
మిగిలిన వారి క్రమబద్దీకరణలో చిన్న చిన్న సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వాటిని క్లియర్ చేయడంలో డిపార్ట్‌మెంట్లు తాత్సారం చేశాయి. ఈలోపు ఎన్నికల కోడ్ రావడంతో ప్రక్రియ మధ్యలోనే నిలిచిపోయింది. కాంట్రాక్ట్ లెక్చరర్లతో పాటు మరి కొన్ని డిపార్ట్‌మెంట్ల కాంట్రాక్ట్ ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.
అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కాంట్రాక్ట్ లెక్చరర్ల సమస్యలపై ప్రధానంగా క్రమబద్దీకరణపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్‌లను కలిసి విన్నవించారు. అయితే ఎటువంటి స్పష్టమైన వైఖరిని వారు చెప్పలేదు.
మంత్రి నారా లోకేష్ గత ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని అమలు చేయాలన్న రూల్ ఏమీ లేదని స్పష్టం చేశారని కాంట్రాక్ట్ లెక్చరర్లు చెబుతున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ తమ ఎన్నికల మేనిఫెస్టోలో లేదని, అందుకే అమలు చేయలేమని మంత్రి నారా లోకేష్ తేల్చి చెప్పినట్టు కాంట్రాక్టు లెక్చరర్లు చెబుతున్నారు.
ఈ విద్యా సంవత్సరంలోనే పది మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు ప్రాణాలు విడిచారని కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి బీజే గాంధీ తెలిపారు. 20ఏళ్లకు పైగా కాంట్రాక్ట్ లెక్చరర్లగా పని చేసేవారు ఉన్నారని, అయినప్పటికీ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని అన్నారు.
ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచిందని, అయితే కాంట్రాక్ట్ లెక్చరర్లకు, ఉద్యోగులకు మాత్రం 60 ఏళ్లేనని పేర్కొంది. తమ పట్ల ఈ వివక్ష ఎందుకని ప్రశ్నించారు. ప్రభుత్వం వైఖరికి వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధం అవుతున్నామని, ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ అయిన వెంటనే పోరాటంలోకి వెళ్తామన్నారు. ఇతర కాంట్రాక్ట్ ఉద్యోగ సంఘాలను కలుపుకుని ఆందోళనకు సిద్ధం అవుతున్నామని తెలిపారు. ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ ఓటు ద్వారా నిరసన తెలుపుతున్నామన్నారు.
(జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)