AP Govt : ఎస్జీటీ ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితా విడుద‌ల.. అభ్యంత‌రాలుంటే ఈ పని చేయండి!-ap government releases sgt teacher seniority list ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Govt : ఎస్జీటీ ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితా విడుద‌ల.. అభ్యంత‌రాలుంటే ఈ పని చేయండి!

AP Govt : ఎస్జీటీ ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితా విడుద‌ల.. అభ్యంత‌రాలుంటే ఈ పని చేయండి!

HT Telugu Desk HT Telugu

AP Govt : ఎస్జీటీ ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాను విడుద‌ల చేశారు. దీనిపై అభ్యంత‌రాలుంటే 11వ తేదీలోపు జిల్లాల్లో త‌గిన ధ్రువీక‌ర‌ణ ప‌త్రాల‌తో తెలప‌వ‌చ్చ‌ని ప్రభుత్వం స్పష్టం చేసింది. స్కూల్ అసిస్టెంట్ల సీనియారిటీ తుది జాబితాను కూడా విడుద‌ల చేశారు. జిల్లా స్థాయిలోనే జాబితాల‌ను డీఈవోలు విడుద‌ల చేశారు.

ఎస్జీటీ ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితా విడుద‌ల (istockphoto)

వేస‌వి సెల‌వుల్లో ఉపాధ్యాయుల బ‌దిలీలు, ప‌దోన్న‌త‌లు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈలోపు జిల్లాల వారీగా ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితా త‌యారు చేయాల‌ని.. పాఠ‌శాల విద్యా శాఖ అన్ని జిల్లాల అధికారుల‌ను ఇప్ప‌టికే ఆదేశించింది. అందులో భాగంగానే అన్ని జిల్లాల విద్యా శాఖ అధికారులు స్కూల్ అసిస్టెంట్ల ఉపాధ్యాయ సీనియారిటీ జాబితా త‌యారు చేశారు. వాటిని జిల్లా స్థాయిల్లోనే విడుద‌ల చేశారు. తాజాగా ఎస్జీటీ సీనియారిటీ జాబితాను విడుద‌ల చేశారు.

టీఐఎస్ ద్వారా..

టీచ‌ర్ ఇన్ఫ‌ర్మేష‌న్ సిస్ట‌మ్ (టీఐఎస్‌) ద్వారా ఉపాధ్యాయులు వ్య‌క్తిగ‌త‌, స‌ర్వీసుకు సంబంధించిన స‌మ‌గ్ర వివ‌రాల ఆధారంగా జాబితాను త‌యారు చేశారు. ప్ర‌భుత్వ, జిల్లా, మండ‌ల ప‌రిష‌త్‌, పురపాల‌క‌, న‌గ‌ర‌పాల‌క పాఠ‌శాల్లో ప‌నిచేసే ప్ర‌ధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల సాధార‌ణ సీనియారిటీ జాబితాను త‌యారు చేశారు. వీటిని జిల్లా విద్యా శాఖ అధికారి (డీఈవో), రీజ‌న‌ల్‌ జాయింట్ డైరెక్ట‌ర్ (ఆర్‌జేడీ) కార్యాల‌య వెబ్‌సైట్‌ల‌తో పాటు, నోటీసు బోర్డుల‌లో అందుబాటులో ఉంచారు.

అభ్యంతరాలుంటే..

ఈ జాబితాపై ఏవైనా అభ్యంత‌రాలుంటే ఈనెల 11 తేదీలోపు డీఈవో, ఆర్‌జేడీ కార్యాల‌యంలో లిఖిత‌పూర్వ‌కంగా అంద‌జేయాల్సి ఉంటుంది. అభ్యంత‌రం తెలిపే ఉపాధ్యాయుడి పూర్తి పేరు, హోదా, సీనియారిటీ జాబితాలో త‌ప్పిదం ఎక్క‌డ ఉందో స్ప‌ష్టంగా పేర్కొన‌డంతో పాటు.. సంబంధిత ఆధారాలు జ‌త చేయాల్సి ఉంటుంది. గ‌డువు ముగిశాక వ‌చ్చే అభ్యంత‌రాలు ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోరు. గ‌డువులోపు వ‌చ్చిన అభ్యంత‌రాల‌ను ఫిర్యాదుల క‌మిటీ ప‌రిశీలించి తుది నిర్ణ‌యం తీసుకుంటారు.

గతంలో తప్పులు..

స్కూల్ అసిస్టెంట్ల సీనియ‌రిటీ జాబితాలో త‌ప్పులు త‌డ‌క‌ల‌గా ఉండ‌టంతో.. రెండుసార్లు త‌యారు చేయాల్సి వ‌చ్చింది. తొలిత ఫిబ్ర‌వ‌రి 20న అన్ని జిల్లాల్లో సీనియారిటీ జాబితాను విడుద‌ల చేశారు. ఆయా జాబితాల్లో త‌ప్పులు త‌డ‌క‌లుగా ఉండ‌టంతో ఉపాధ్యాయులు, సంఘాలు ఆందోళన వ్య‌క్తంచేశాయి. దీంతో రాష్ట్ర స్థాయిలో విద్యా శాఖ క‌మిషన‌ర్ ఉపాధ్యాయ సంఘాల‌తో స‌మావేశం అయ్యారు. ఈ స‌మావేశంలో సీనియారిటీ జాబితాల్లో త‌ప్పుల‌ను స‌రిదిద్దాల‌ని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేశాయి. త‌ప్పుల‌ను స‌రిదిద్ది మ‌ళ్లీ జాబితాను విడుద‌ల చేయాల‌ని రాష్ట్ర విద్యా శాఖ క‌మిష‌న‌ర్ అన్ని జిల్లాల‌ విద్యా శాఖ అధికారి (డీఈవో), రీజ‌న‌ల్‌ జాయింట్ డైరెక్ట‌ర్ (ఆర్‌జేడీ) ఆదేశాలు ఇచ్చారు.

మార్చి 20న రెండోసారి..

విద్యా శాఖ అధికారులు మ‌ళ్లీ సీనియారిటీ జాబితాను త‌యారు చేసి.. మార్చి 20న రెండోసారి విడుద‌ల చేశారు. అందులోనూ త‌ప్పులు ఉండ‌టంతో మ‌ళ్లీ త‌యారు చేయాల్సి వ‌చ్చింది. స్కూల్ అసిస్టెంట్ల సీనియారిటీ తుది జాబితాను కూడా, ఎస్టీటీల జాబితాతోనే విడుద‌ల చేశారు. 1989 సంవ‌త్స‌రం డీఎస్సీ నుంచి 2018 సంవ‌త్స‌రం డీఎస్సీ వ‌ర‌కు కేడ‌ర్ వారీగా సీనియారిటీ జాబితాల‌ను సిద్ధం చేశారు. ఉపాధ్యాయుల నుంచి వారి విద్యార్హ‌త‌, డీఎస్సీ పోటీ ప‌రీక్ష‌లో ల‌భించిన మార్కులు త‌దిత‌ర వివ‌రాల ఆధారంగా ఈ జాబితాను రూపొందించారు.

పదోన్నతులు పెండింగ్..

రాష్ట్రంలో 44 వేల ప్ర‌భుత్వ పాఠ‌శాలల్లో 1.80 ల‌క్ష‌ల మంది ఉపాధ్యాయులు విధుల్లో ఉన్నారు. వీరికి బ‌దిలీలు, ప‌దోన్న‌త‌లు గ‌త కొంత కాలంగా ఆగిపోయాయి. వాటిని ఈ వేస‌వి సెల‌వుల్లోనే చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. అందులో భాగంగానే ఈ జాబితాల‌ను త‌యారు చేసి విద్యా శాఖ విడుద‌ల చేసింది.

(రిపోర్టింగ్- జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

సంబంధిత కథనం