ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మే 16 నుంచి జూన్ 2వ తేదీ వరకు ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని సడలిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు, పోస్టింగ్‌లకు సంబంధించిన మార్గదర్శకాలను ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి జారీ చేశారు.
ఏపీలో జూన్ 3వ తేదీ నుంచి ఉద్యోగుల బదిలీలపై మళ్లీ నిషేధం అమల్లోకి వస్తుందని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మే 16 నుంచి జూన్ 2లోగా బదిలీ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. తాజా బదిలీల నుంచి ఉపాధ్యాయులు, పోలీసులు, ఎక్సైజ్ సిబ్బందిని మినహాయించారు.
నోటిఫైడ్ ఏజెన్సీ ప్రాంతాల్లోని ఖాళీలను మార్గదర్శకాలు జారీచేసిన ప్రభుత్వం, ఏజెన్సీ ప్రాంతాల్లోని ఖాళీల భర్తీ చేయడానికి ప్రాధాన్యం ఇవ్వాలని మార్గ దర్శకాల్లో సూచించింది. ఐటీడీఏల్లో ఉద్యోగుల బదిలీలు పూర్తైన తర్వాత నాన్-ఐటీడీఏ పోస్టులు నింపాలి. ఐటీడీఏ ప్రాంతాలతోపాటు మారుమూల, వెనకబడిన ప్రాంతాల్లోని ఎక్కువ ఖాళీలున్న ప్రాంతాలకు బదిలీల్లో ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది.
గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలకు సంబంధించిన రాష్ట్ర, జిల్లా, డివిజన్/మండల స్థాయి నేతలకు మూడు టర్మ్‌లకు మినహాయింపు ఉంటుంది. ఆఫీస్ బేరర్లకు మూడు విడతలు పూర్తయ్యే వరకు లేదా ఒకే స్టేషన్లో 9 ఏళు పూర్తయ్యే వరకు కానీ బదిలీ చేయకూడదు. తాలూకా, జిల్లా స్థాయిలో గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల ఆఫీస్ బేరర్ల జాబితా సంబంధిత కలెక్టర్ ద్వారా హెచ్‌ఓడిలకు పంపాల్సి ఉంటుంది. రాష్ట్ర సంఘం జాబితాను జీఏడీ ద్వారా మాత్రమే రాష్ట్రస్థాయి హెచ్‌ఓడీలకు పంపాల్సి ఉంటుంది.
సంబంధిత కథనం