AP Teachers Transfers : ఏపీలో టీచర్ల బదిలీలు షురూ, అధికారిక జీవో విడుదల-ap government released teachers transfers govt order may 22 to 31 online applications ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
Telugu News  /  Andhra Pradesh  /  Ap Government Released Teachers Transfers Govt Order May 22 To 31 Online Applications

AP Teachers Transfers : ఏపీలో టీచర్ల బదిలీలు షురూ, అధికారిక జీవో విడుదల

టీచర్ల బదిలీలు
టీచర్ల బదిలీలు (pixabay)

AP Teachers Transfers : ఏపీలో టీచర్ల బదిలీలపై ప్రభుత్వం అధికారిక జీవో విడుదల చేసింది. ఈ నెల 22 నుంచి 31 వరకు ఉపాధ్యాయుల బదిలీలు జరగనున్నాయి.

AP Teachers Transfers : ఆంధ్రప్రదేశ్ లో ఉపాధ్యాయుల బదిలీలకు ఇటీవల ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బదిలీలపై తాజాగా ఏపీ సర్కార్ జీవో విడుదల చేసింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల బదిలీలపై నిషేధాన్ని సడలించింది. టీచర్ల అభ్యర్థన, పాలనాపరమైన కారణాలతో బదిలీలకు అవకాశం కల్పించింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ నెల 22 నుంచి 31 మధ్య టీచర్ల బదిలీలు జరగనున్నాయి. రెండేళ్ల సర్వీస్‌ పూర్తి చేసుకున్న వాళ్లకు రిక్వెస్ట్‌పై బదిలీకి అవకాశం కల్పించనున్నారు. ఐదేళ్లు ఒకే చోట పనిచేసిన ఉద్యోగుల బదిలీ మాత్రం తప్పనిసరి చేశారు. 2023 ఏప్రిల్‌ నాటికి 5 ఏళ్లు పూర్తి చేసుకున్న వాళ్లందరూ బదిలీలకు అర్హులుగా ప్రభుత్వం నిర్ణయించింది. అయితే సంక్షేమశాఖ పరిధిలో పనిచేసే విద్యాసంస్థల ఉద్యోగులను బదిలీల నుంచి మినహాయింపు ఇచ్చింది.

ట్రెండింగ్ వార్తలు

బదిలీలపై అధికారిక జీవో విడుదల

అదే విధంగా 675 ఎంఈవో-2 పోస్టులపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 350 మంది గ్రేడ్‌ -2 ప్రధానోపాధ్యాయులు, 9269 మంది ఎస్జీటీలకు పదోన్నతులు కల్పిస్తామని వెల్లడించింది. 1746 మంది పీజీ ఉపాధ్యాయుల పునర్విభజన ప్రక్రియ ప్రారంభించింది. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోగా ఉపాధ్యాయుల బదిలీలు పూర్తి చేస్తామని తెలిపింది. ఉద్యోగ సంఘాలు కోర్టులకు వెళ్లి బదిలీల ప్రక్రియను అడ్డుకోవద్దని మంత్రి బొత్స కోరారు. వాణిజ్య పన్నులు, రిజిస్ట్రేషన్ శాఖ, ఎక్సైజ్ శాఖ, రవాణా, వ్యవసాయ శాఖల్లో పనిచేసే ఉద్యోగుల బదిలీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఏడాది జూన్ 1 నుంచి ఉద్యోగుల బదిలీలపై మళ్లీ నిషేధం వర్తించనుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో టీచర్ల బదిలీలకు సంబంధించి అధికారిక జీవోను సోమవారం జారీ చేసింది.

ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరణ

పాఠశాల విద్యాశాఖ కమిషనర్ బదిలీల ప్రక్రియ చేపట్టనున్నారని జీవోలో పేర్కొంది. టీచర్ల బదిలీలకు ఆన్ లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపింది. అదేవిధంగా వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. దరఖాస్తు ప్రక్రియ, సర్టిఫికెట్ల వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్లకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ షెడ్యూ్ల్ ప్రకటిస్తారని పేర్కొంది. డైట్(DIET) తో ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలిపింది.

జూన్ 1 నుంచి మళ్లీ నిషేధం

2022 జూన్‌లో చివరిగా ఉద్యోగుల బదిలీ చేపట్టింది ఏపీ ప్రభుత్వం. ఉద్యోగుల బదిలీలకు కొంత కాలం పాటు నిషేధాన్ని సడలించారు. అప్పట్లో ఐదేళ్ల పై బడిన ఉద్యోగులకు బదిలీ అవకాశం కల్పించింది. వ్యక్తిగత వినతులు, పరిపాలనా సౌలభ్యం కోసం బదిలీలు చేశారు. 2021 డిసెంబర్ లో ఉద్యోగుల పరస్పర బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం బదిలీలపై పూర్తి నిషేధం తొలగించి పూర్తి స్థాయి బదిలీలకు అవకాశం కల్పించడంతో ఉద్యోగులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. బదిలీలపై జూన్ ఒకటో తేదీ నుంచి మళ్లీ నిషేధం అమల్లోకి వస్తుందని ప్రభుత్వం తెలిపింది.

WhatsApp channel