AP Police : ఏపీ పోలీసు రిక్రూట్‌మెంట్ రూల్స్ సవరణ, ఇకపై 65 శాతం ఎస్ఐ పోస్టులు ప్రత్యక్షంగానే భర్తీ-ap government orders direct recruitment for 65 percent of si posts ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Police : ఏపీ పోలీసు రిక్రూట్‌మెంట్ రూల్స్ సవరణ, ఇకపై 65 శాతం ఎస్ఐ పోస్టులు ప్రత్యక్షంగానే భర్తీ

AP Police : ఏపీ పోలీసు రిక్రూట్‌మెంట్ రూల్స్ సవరణ, ఇకపై 65 శాతం ఎస్ఐ పోస్టులు ప్రత్యక్షంగానే భర్తీ

HT Telugu Desk HT Telugu
Updated Feb 18, 2025 07:39 PM IST

AP Police Recruitment Rules : ఏపీ పోలీసు రిక్రూట్‌మెంట్ నిబంధ‌న‌లను ప్రభుత్వం సవరించింది. 65 శాతం ఎస్ఐ పోస్టులను ప్రత్యక్ష నియామ‌కాల ద్వారానే భ‌ర్తీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది.

ఏపీ పోలీసు రిక్యూట్‌మెంట్ రూల్స్ సవరణ, ఇకపై 65 శాతం ఎస్ఐ పోస్టులు ప్రత్యక్షంగానే భర్తీ
ఏపీ పోలీసు రిక్యూట్‌మెంట్ రూల్స్ సవరణ, ఇకపై 65 శాతం ఎస్ఐ పోస్టులు ప్రత్యక్షంగానే భర్తీ

AP Police Recruitment Rules : రాష్ట్రంలోని పోలీస్ రిక్రూట్‌మెంట్ నిబంధ‌న‌లను ప్రభుత్వం స‌వ‌రించింది. 65 శాతం స‌బ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్ఐ) పోస్టుల‌ను ప్రత్యక్ష నియామ‌కాల ద్వారానే భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ మేర‌కు రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి కుమార్‌ విశ్వజీత్ గెజిట్ నోటిఫికేష‌న్ విడుద‌ల చేశారు.

సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (సివిల్‌) పోస్టులను 65 శాతం ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించారు. గతంలో ఇది 55 శాతం మాత్రమే ఉండేది. ఏఎస్సై, హెడ్‌ కానిస్టేబుల్‌లకు పదోన్నతి కల్పించడం ద్వారా 30 శాతం, రిజర్వ్‌ సబ్‌ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్ నుంచి బదిలీ ద్వారా 5 శాతం పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించారు. అభ్యర్థులకు మార్కులు సమానంగా వస్తే సీనియర్లకు ప్రాధాన్యం ఇవ్వాల‌ని పేర్కొన్నారు.

ఒకే ర్యాంకులో ఉంటే పుట్టిన తేదీ ఆధారంగా పెద్ద వారికి ప్రాధాన్యం ఇవ్వాల‌ని నిర్ణయించారు. ఇంకా భర్తీ కానీ పోస్టులను డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌లోని స్టైపెండరీ కేడెట్‌ ట్రైనీ ఎస్‌ఐలతో భర్తీ చేయాల‌ని నిర్ణయించారు. ఎంపిక విధానం, మార్గదర్శకాలపై పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఛైర్మన్‌దే తుది నిర్ణయం చేశారు. ఏవైనా ఉల్లంఘనలు ఉంటే చైర్మన్‌ నిర్ణయమే అంతిమం అవుతుంది.

ఆంధ్రప్రదేశ్ జిల్లా పోలీస్ చట్టం-1859 (1859 కేంద్ర చట్టం నెంబ‌ర్ XXIV) లోని సెక్షన్లు 8, 10 ద్వారా ఇవ్వబడిన అధికారాలను, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 309 ద్వారా సంక్రమించిన అధికారాలను ఉప‌యోగించుకుని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ (సివిల్) సబ్-ఆర్డినేట్ సర్వీస్ రూల్స్,-1999కు సవరణను చేసిన‌ట్లు గెజిట్ నోటిఫికేష‌న్‌లో పేర్కొన్నారు.

రిజ‌ర్వేష‌న్లు ఇలా

డైరెక్ట్‌ రిక్రూటీ ఖాళీల్లో ప్రత్యేక కేటగిరీలకు కొన్ని రిజర్వేషన్లు కల్పించారు. పోలీస్ ఎగ్జిక్యూటివ్ -5 శాతం, పోలీస్ మినిస్టీరియల్ -1 శాతం, ప్రతిభావంతులైన క్రీడాకారులు -2 శాతం, పోలీస్ సిబ్బంది పిల్లలు -2, మరణించిన/అశక్తులైన పోలీసు సిబ్బంది పిల్లలు -2 శాతం, నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్‌సీసీ) -3 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించ‌నున్నారు.

1. రిజర్వ్ సబ్-ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (ఏఆర్‌/ ఎస్ఏఆర్‌సీసీపీఎల్‌/ ఏపీఎస్‌పీ) నుంచి బదిలీ ద్వారా నియామకం కోసం ఉద్దేశించిన సబ్-ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (సివిల్) ఖాళీలలో 5 శాతం వారి సంబంధిత జోన్‌కు చెందిన స్థానిక అభ్యర్థులతో మాత్రమే భర్తీ చేస్తారు.

2. రిజర్వ్ సబ్-ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (ఏఆర్‌/ ఎస్ఏఆర్‌సీసీపీఎల్‌/ ఏపీఎస్‌పీ) సబ్-ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (సివిల్)గా బదిలీ ద్వారా నియామకానికి అర్హులు. వారు ఎంపికలు జరిగిన సంవత్సరం జులై 1 నాటికి 40 సంవత్సరాల వయస్సును పూర్తి చేసుకుండా ఉండాలి. ఏఆర్‌/ ఎస్ఏఆర్‌సీసీపీఎల్‌/ ఏపీఎస్‌పీలో స్పష్టమైన, ప్రశంసనీయమైన సేవా రికార్డుతో 5 సంవత్సరాల కంటే తక్కువ కాకుండా స‌ర్వీస్‌ చేసి, నక్సలైట్, మావోయిస్టు, ఉగ్రవాద కార్యకలాపాల నియంత్రణకు సంబంధించి విధి నిర్వహణకు ముందు ప్రశంసనీయమైన పనిని చేసి ఉండాలి.

అలాగే సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (సివిల్)కి సూచించిన విద్యార్హతను కలిగి ఉండాలి. దీనిని బదిలీ ద్వారా నియామకం ద్వారా భర్తీ చేయడానికి ఎంపిక పదవిగా పరిగణిస్తారు.

3. బదిలీ ద్వారా నియామకానికి ఎంపికను మంగళగిరిలోని రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ చేస్తారు. రిజర్వ్ సబ్-ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (ఏఆర్‌/ ఎస్ఏఆర్‌సీసీపీఎల్‌/ ఏపీఎస్‌పీ) నుండి బదిలీ ద్వారా నియామకం కోసం సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (సివిల్) ఖాళీలను గ‌త సంవత్సరం జూలై 1 నుండి ఎంపికలు జరిగిన సంవత్సరం జూన్ 30 మధ్య ఏర్పడిన ఖాళీల సంఖ్య ఆధారంగా లెక్కిస్తారు.

4. ఇంకా, గ్రే హౌండ్స్, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ), ఆక్టోపస్, సీఐ సెల్ (కౌంటర్ ఇంటెలిజెన్స్), డిస్ట్రిక్ట్ స్పెషల్ పార్టీ, ఏఎన్ఎస్‌ (యాంటీ నక్సలైట్ స్క్వాడ్), ఏపీఎస్‌పీకి చెంది యాంటీ-నక్సలైట్/మావోయిస్ట్/టెర్రరిస్ట్ ప్రభావిత పోలీస్ స్టేషన్లలో ఒక సంవత్సరానికి పైగా రిజర్వ్ సబ్-ఇన్‌స్పెక్టర్లుగా పని చేసి ఉండాలి.

నక్సలైట్ వ్యతిరేక/మావోయిస్ట్/ఉగ్రవాద కార్యకలాపాలకు గాను శౌర్య పతకం పొందిన వారిని నక్సలైట్, మావోయిస్టు, ఉగ్రవాద కార్యకలాపాల నియంత్రణకు సంబంధించి విధి నిర్వహణకు మంచి ప్రశంసనీయమైన పని చేసిన వర్గం కింద పరిగణిస్తారు. అటువంటి రిజర్వ్ సబ్-ఇన్‌స్పెక్టర్ల ఆఫ్ పోలీస్‌కు ప్రమాణాలు అభ్యర్థి పొందిన మొత్తం మార్కుల ఆధారంగా లెక్కించాలి.

5. గ్రే హౌండ్స్, ఎస్ఐబీ, ఆక్టోపస్, సీఐ సెల్, డిస్ట్రిక్ట్ స్పెషల్ పార్టీ, ఏఎన్ఎస్‌, తీవ్రవాద ప్రభావిత పోలీస్ స్టేషన్లలో యాంటీ నక్సలైట్/మావోయిస్ట్/టెర్రరిస్ట్ పనిలో ఎంపికలు జరిగిన సంవత్సరం జూలై 1 నాటికి గడిపిన సర్వీస్ ఆధారంగా ఉంటుంది.

(i) 1-3 సంవత్సరాలు (3 మినహాయించి) - 5 మార్కులు

(ii) 3-5 సంవత్సరాలు (3 ఏళ్ల స‌హా 5 ఏళ్లు మినహాయించి) - 10 మార్కులు

(iii) 5 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ - 15 మార్కులు

6. గ్రే హౌండ్స్, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్, ఆక్టోపస్, సీఐ సెల్, డిస్ట్రిక్ట్ స్పెషల్ పార్టీ/ఏఎన్ఎస్‌, తీవ్రవాద ప్రభావిత పోలీస్ స్టేషన్లలో ప‌ని చేసిన మొత్తం పని కాలాన్ని లెక్కించడానికి బ్రోకెన్ పీరియడ్ కలుపుతారు. శౌర్య పతకాలు పొందిన వారికి మార్కులు ఇలా ఉంటాయి.

(1) ప్రతి పతకానికి అశోక్ చక్ర - 25 మార్కులు

(ii) ప్రతి పతకానికి కీర్తి చక్ర - 20 మార్కులు

(iii) ప్రతి పతకానికి పీపీఎంజీ/ పీఎంజీ - 15 మార్కులు

(iv) ప్రతి పతకానికి ముఖ్యమంత్రి శౌర్య పతకం - 10 మార్కులు

7. ప్రతి జోన్‌లో ఉత్పన్నమయ్యే ఖాళీలను ఆ జోన్‌కు చెందిన రిజర్వ్ సబ్-ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (ఏఆర్‌/ ఎస్ఏఆర్‌సీసీపీఎల్‌/ ఏపీఎస్‌పీ)తో భర్తీ చేస్తారు.

8. అర్హత కలిగిన స్థానిక అభ్యర్థుల కొరత కారణంగా ఆ తర్వాత ఖాళీగా ఉన్న ఖాళీలను స్థానికులు, డిప్యుటేషన్ సంస్థలలో పనిచేస్తున్న ఇతర ఆర్ఎస్ఐఎస్ (ఏఆర్‌/ ఎస్ఏఆర్‌సీసీపీఎల్‌/ ఏపీఎస్‌పీ)తో భర్తీ చేస్తారు. ఇవి స్థానిక‌త‌, సీనియారిటీ అనే షరతులకు లోబడి ఉంటాయి. ఆర్ఎస్ఐఎస్ (ఏఆర్‌/ ఎస్ఏఆర్‌సీసీపీఎల్‌/ ఏపీఎస్‌పీ)కి ప్రమాణాలు ఎంపికలు జరిగిన సంవత్సరం జూలై 1 నాటికి అభ్యర్థి పొందిన మొత్తం మార్కులపై ఆధారపడి ఉంటాయి. దీనిని ఈ క్రింది విధంగా లెక్కించాలి:

i. సర్వీస్ కాలం: ఆర్ఎస్ఐఎస్ (ఏఆర్‌/ ఎస్ఏఆర్‌సీసీపీఎల్‌/ ఏపీఎస్‌పీ)గా ప్రతి సంవత్సరం ఫిజిక‌ల్ స‌ర్వీస్‌కు 1 మార్కు ఉంటుంది.

ii. మెరిట్

ఎ) ఎంపిక చేసిన సంవత్సరానికి ముందు 5 సంవత్సరాల ఏసీఆర్ఎస్‌ కోసం మార్కులు ఇస్తారు. ఒక సంవత్సరంలో ఒకటి కంటే ఎక్కువ ఏసీఆర్‌లు ఉంటే, ఎక్కువ కాలం పాటు ఏసీఆర్‌ను గణన కోసం పరిగణిస్తారు. (ఒక సంవత్సరంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ ఏసీఆర్ఎస్‌ సమాన కాలాలకు అందుబాటులో ఉంటే, మెరుగైన గ్రేడింగ్ ఏసీఆర్‌ను పరిగణిస్తారు).

గ‌త‌ 5 సంవత్సరాలలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఏసీఆర్ఎస్‌లు అందుబాటులో లేకపోతే, గ‌త‌ సంవత్సరాలలో సమాన సంఖ్యలో ఏసీఆర్ఎస్‌ గణన కోసం పరిగణిస్తారు. అత్యుత్తమ ఏసీఆర్‌ గ్రేడ్‌కు 5 మార్కులు ఇస్తారు. వెరీ గుడ్ ఎసీఆర్‌ గ్రేడ్‌కు 4 మార్కులు ఇస్తారు. గుడ్ ఏసీఆర్‌ గ్రేడ్‌కు 3 మార్కులు ఇస్తారు. సంతృప్తికరమైన ఏసీఆర్‌ గ్రేడ్‌కు 2 మార్కులు ఇస్తారు.

బి) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శౌర్య పత‌కం, అన్ని ఇతర రకాల శౌర్య పతకాలకు ప్రతిదానికీ 10 మార్కులు ఉంటాయి.

సి) ఆంధ్రప్రదేశ్ పోలీస్ సేవా పత‌కం, ఆంధ్రప్రదేశ్ పోలీస్ కటిన సేవా పత‌కం, ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఉత్తమ సేవా ప‌త‌కం, ఆంధ్రప్రదేశ్ పోలీస్ మహోన్నత సేవా పత‌కం, అన్ని ఇతర రకాల పతకాలకు ఒక్కొక్కదానికి 5 మార్కులు ఇస్తారు.

డి) ప్రతి డీజీపీ ప్రశంసకు 2 మార్కులు ఇస్తారు.

iii. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది అభ్యర్థులకు లభించే మార్కులు ఒకేలా ఉంటే, ఆర్‌ఎస్‌ఐ (ఏఆర్/ఎస్ఏఆర్‌సీపీఎల్/ ఏపీఎస్‌పీ) ర్యాంక్‌లో సర్వీస్ కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. ఎక్కువ సర్వీస్ అందించిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తారు. సర్వీస్ కాలం కూడా ఒకేలా ఉంటే, అప్పుడు అభ్యర్థి పుట్టిన తేదీలను పరిగణనలోకి తీసుకుని, వయసులో పెద్దవారికి ప్రాధాన్యత ఇస్తారు.

iv. ఈ ప్రమాణాలను నెరవేర్చి అర్హత కలిగిన స్థానిక అభ్యర్థుల కొరత కారణంగా ఉంటే, భర్తీ కాని ఖాళీలను స్టైపెండియరీ క్యాడెట్ ట్రైనీ సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (సివిల్) డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కోసం ఉద్దేశించిన ఖాళీల్లో క‌లుపుతారు.

3. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ ఎంపిక ప్రమాణాలకు సంబంధించిన మార్గదర్శకాలను సిద్ధం చేస్తారు. బదిలీ ద్వారా నియామకం కోసం ఎంపిక ప్రక్రియను ఖరారు చేయడంలో ప్రశంసనీయమైన పని భాగంగా ఉంటుంది. ఎంపికలో ఏదైనా త‌ప్పులు తలెత్తితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్‌దే తుది నిర్ణయంగా పేర్కొన్నారు.

రిపోర్టింగ్ : జ‌గ‌దీశ్వర‌రావు జ‌రజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

Whats_app_banner

సంబంధిత కథనం