Birdflu Terror: బర్డ్ ఫ్లూపై ఏపీ సర్కార్ అలర్ట్, వైరస్ విస్తరించకుండా చర్యలు, లక్షల్లో కోళ్లు మృతి
Birdflu Terror: ఏపీలో మూడు జిల్లాలకు బర్డ్ ఫ్లూ విస్తరించడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే లక్షల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడటంతో మిగిలిన జిల్లాలకు వ్యాప్తి చెందకుండా చర్యలు ముమ్మరం చేశారు. అన్ని జిల్లాల్లో చేపట్టాల్సిన చర్యలపై సీఎస్ సమీక్షించారు.

Birdflu Terror: ఏపీలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఎన్టీఆర్ జిల్లాలో బర్డ్ ఫ్లూతో భారీగా కోళ్లు చనిపోతుండటంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో రెండు మూడు జిల్లాల్లో కోళ్ళకు వ్యాపించిన బర్డ్ ఫ్లూ వ్యాధిని నివారించేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోదని దీనిపై ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ స్పష్టం చేశారు.
గురువారం రాష్ట్ర సచివాలయం నుండి ఆయన రాష్ట్ర పశుసంవర్ధక,వైద్య ఆరోగ్య శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులతో కలిసి జిల్లా కలెక్టర్లతో పరిస్థితిని సమీక్షించారు.వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, చనిపోయిన కోళ్ళను సక్రమంగా పూడ్చిపెట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్లు, పశు సంవర్ధక శాఖల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
బర్డ్ ప్లూ వ్యాప్తి నియంత్రణ కోసం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా మార్గ దర్శకాలను జారీ చేసిందని వాటిని కలక్టర్లకు పంపామని, స్టాండర్డ్ ప్రోటోకాల్ మార్గదర్శకాలను తుచా తప్పకుండా పాటించాలన్నారు. ఆ మార్గదర్శకాల ప్రకారం వ్యాధి సోకిన ప్రాంతానికి ఒక కిలోమీటరు పరిధిని రెడ్ జోన్ గా ప్రకటించి అక్కడ రాకపోకలను, దాణా రవాణాను నియంత్రించాలని స్పష్టం చేశారు. పౌల్ట్రీలకు తొమ్మిది కిలోమీటర్ల పరిధిలో ముందస్తు జాగ్రత్తలను చేపట్టాలని ఈవిషయంలో పశుసంవర్ధక శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని సిఎస్ ఆదేశించారు.
ప్రసార మాధ్యమాల్లో తప్పుడు వార్తలు ప్రసారం చేసినా వాటిని నమ్మి ఆందోళన చెందవద్దని,అదే సమయంలో అలాంటి వార్తలు,వదంతులు ప్రసారం చేసే వారి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలక్టర్లకు సిఎస్ విజయానంద్ స్పష్టం చేశారు. బర్డ్ ప్లూ సోకిన ఏలూరు జిల్లా బాదంపూడి, పశ్చిమగోదావరి జిల్లా వేల్పూరు,కానూరు మరియు ఎన్టిఆర్ జిల్లా గంపలగూడెం ప్రాంతాల్లోని ఐదు ఫ్రౌల్ట్రీల్లో చేపట్టిన చర్యలను కలక్టర్లను అడిగి తెల్సుకున్నారు.కోళ్ళ ఫారాల యజమానులకు కూడా దీనిపై పూర్తి అవగాహన కల్పించాలని చెప్పారు.
వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి యం.టి కృష్ణ బాబు మాట్లాడుతూ ఏవియన్ ఇన్ఫ్లూఎంజా వైరస్ రాష్ట్రంలో మనుషులకు సోకినట్టు ఇప్పటి వరకూ రిపోర్టు కాలేదని స్పష్టం చేశారు. అత్యంత అరుదుగా ఇది మనుషులకు సోకే అవకాశం ఉందని గత ఐదేళ్ళలో ఈ వైరస్ దేశంలో మహారాష్ట్ర,హర్యానా,పశ్చిమ బెంగాల్ వంటి 5 రాష్ట్రాల్లో కేవలం నాలుగు కేసులు మాత్రమే నమోదయ్యాయని తెలిపారు.
ఢిల్లీ నుండి కేంద్ర పశుసంవర్ధకశాఖ కమీషనర్ డా.అమిత్ మిత్రా మట్లాడుతూ వర్చువల్ గా పాల్గొని మాట్లాడుతూ ప్రతి జిల్లా,మండలంలో ఏర్పాటు చేసే కోళ్ళ ఫారాలను తప్పనిసరిగా రిజిష్టర్ చేయించాలని చెప్పారు. వ్యాధి సోకిన కిలోమీటరు పరిధిలో రెడ్ జోన్ గా ప్రకటించి అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.ప్రతి 15 రోజులకు ఒకసారి శాంపిల్స్ నివేదికలు సమర్పించాలని చెప్పారు.