AP Govt Alert: కోవిడ్‌ నేపథ్యంలో ఏపీలో అలర్ట్.. గ్రామాల్లోనే ర్యాపిడ్ టెస్ట్‌లు-ap government on alert as covid cases are increasing ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Govt Alert: కోవిడ్‌ నేపథ్యంలో ఏపీలో అలర్ట్.. గ్రామాల్లోనే ర్యాపిడ్ టెస్ట్‌లు

AP Govt Alert: కోవిడ్‌ నేపథ్యంలో ఏపీలో అలర్ట్.. గ్రామాల్లోనే ర్యాపిడ్ టెస్ట్‌లు

Sarath chandra.B HT Telugu
Dec 20, 2023 11:02 AM IST

AP Govt Alert: దేశంలో కోవిడ్ కొత్త కేసులు వెలుగు చూస్తున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్ర వ్యాప్తంగా విలేజ్ హెల్త్ క్లినిక్ లలో ర్యాపిడ్ టెస్ట్ కిట్లను సిద్ధం చేయాలని వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సియస్ ఎం.టి.కృష్ణ బాబు ఆదేశించారు.

ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు
ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు

AP Govt Alert: కోవిడ్ కేసులు వెలుగు చూస్తున్న నేపథ్యంలో శబరిమలై యాత్రకు వెళ్లే భక్తులు తగినంత ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ సూచించింది. పలు రాష్ట్రాల్లో కొత్త కేసులు వెలుగు చూస్తుండటంతో మార్గదర్శకాలు జారీ చేసింది. ఎటువంటి వ్యాధి లక్షణాలు కన్పించినా దగ్గరలోని విలేజ్ హెల్త్ క్లినిక్ లో పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.

yearly horoscope entry point

కేరళతో పాటు పలు రాష్ట్రాలలో తాజాగా కోవిడ్ కేసులు వెలుగు చూసిన నేపథ్యంలో రాష్ట్రంలో పరిస్థితిని ఎదుర్కొనేందుకు అవసరమైన సన్నద్ధతపై వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి క్రిష్ణబాబు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

సమీక్షలో పాల్గొన్న అధికారులు రాష్ట్రంలో వ్యాధి ప్రభావం స్వల్పమేనని, పొరుగు రాష్ట్రాలలో కొన్ని కేసులు నమోదయి ఆస్పత్రులలో చేరినట్లు తెలుస్తోందని వివరించారు. దీనిపై స్పందించిన క్రిష్ణబాబు రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులలో ఏర్పాటు చేసిన RTPCR ల్యాబ్ లను క్రియాశీలకం చేయాలని రోజుకు కనీసం వెయ్యి పరీక్షలు నిర్వహించేలా సిద్ధం కావాలని సూచించారు.

రాష్ట్ర వ్యాప్తంగా విలేజ్ హెల్త్ క్లినిక్ లకు ర్యాపిడ్ టెస్ట్ కిట్లను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఫ్లూ జ్వరం లేదా శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న రోగులకు RTPCR టెస్ట్ లను తప్పనిసరి చేయాలన్నారు. దీనితో పాటు గ్లౌజులు, మాస్క్ లు, శానిటైజర్లు వంటి రక్షణ పరికరాలను అన్ని ఆస్పత్రులలో సిద్ధంగా వుంచుకోవాలని సూచించారు.

శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వారికి అవసరమైన ఆక్సిజన్ సరఫరా కోసం LMO, PSA, ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల వంటి వాటిని, డి టైప్ సిలిండర్లను సిద్ధంగా వుంచాలన్నారు. జ్వరం, దగ్గు వంటి ఎటువంటి స్వల్ప లక్షణాలు కన్పించినా సంబంధిత వ్యక్తులు స్వీయ ఏకాంతాన్ని (self isolation)ను పాటించాలని, సంబంధిత లక్షణాలు పూర్తిగా తగ్గేవరకూ ఒంటరి జీవితాన్ని గడపాలని సూచించారు.

రానున్న పండుగ సీజన్లలో అన్ని ప్రాంతాలలో ప్రజల రద్దీ పెరుగనున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలు పాటించాలని సూచించారు. శబరిమలై యాత్రకు వెళ్లే భక్తులు తగినంత ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, వారిలో ఎటువంటి వ్యాధి లక్షణాలు కన్పించినా వారు తక్షణణం దగ్గరలోని విలేజ్ క్లనిక్ లో పరీక్షలు చేయించుకుని ఆరోగ్య పరిస్థితిని నిర్ధారించుకోవాలని సూచించారు.

రాష్ట్రంలో ప్రస్తుతం ఏ విధంగానూ ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదని, తాము ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు వీలుగా నిరంతరం అప్రమత్తతతో వ్యవహరిస్తున్నామని, ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకరించాలని ఆయన కోరారు. మన రాష్ట్రంలో కోవిడ్ కేసులు తాజాగా ఇప్పటి వరకూ ఒక్కటి కూడా నమోదు కాలేదని, అయితే కేరళ వంటి రాష్ట్రాలలో కేసులు వెలుగు చూస్తున్న నేపథ్యంలో మనం అత్యంత జాగ్రత్తగా వుండాల్సిన అవసరం వుందని వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు చెప్పారు.

ఏపీలో ఎటువంటి కేసులూ నమోదు కాలేదని, అందువల్ల భయపడాల్సిన అవసరం లేదని, కానీ జాగ్రత్తగా వుండాల్సిన అవసరం వుందని అన్నారు. వ్యాధి వ్యాప్తి నిరోధానికి అవసరమైన సామాజిక దూరం పాటించటం, మాస్కుల వినియోగాన్ని పెంచటం వంటి చర్యలు తీసుకోవాల్సిందిగా తాము ప్రజలకు సూచిస్తున్నామన్నారు.

శస్త్ర చికిత్సలు చేయించుకున్న వారు, వారికి సహాయకులుగా వచ్చిన వారిని తమ సిబ్బంది నిశితంగా గమనిస్తున్నారని, వారికి వ్యాధి లక్షణాలు కన్పిస్తే అవసరమైన వైద్య చికిత్స అందించేందుకు సిద్ధంగా వున్నారన్నారు. ఎవరైనా వ్యక్తులు కూడా తమలో వ్యాధి లక్షణాలు గుర్తిస్తే స్వీయ ఏకాంతాన్ని (self isolation)ను అనుసరిస్తే అందరికీ మేలు చేసిన వారవుతారని ఆయన సూచించారు.

గ్రామ సచివాలయ స్థాయిలో వున్న విలేజ్ క్లినిక్ లు అన్నింటికీ యాంటిజెన్ టెస్ట్ కిట్లు ఇప్పటికే అందచేశామని ఆయన చెప్పారు. అక్కడ ఏదైనా పాజిటివ్ గా నిర్ధారణ అయితే దానిని ఆర్టీపీసీఆర్ టెస్ట్ కు పంపటానికి వీలుగా రాష్ట్రంలోని 11 వైద్య కళాశాలల్లో టెస్ట్ లకు అవసరమైన సౌకర్యాలను సిద్ధంగా వుంచామని చెప్పారు.

అక్కడ కూడా పాజిటివ్ నిర్ధారణ అయితే విజయవాడలో జినోమ్ సీక్వెన్సింగ్ కు పంపి వేరియంట్ ను గుర్తించి దాని వ్యాప్తి నిరోధానికి అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అయితే కేరళ, తమిళనాడు తరహాలో మన రాష్ట్రంలో ఇప్పటి వరకూ ఇటువంటి సమస్య తలెత్తలేదని, అయితే మనం ముందు జాగ్రత్త పాటించటం అత్యవసరమని ఆయన స్పష్టం చేశారు.

Whats_app_banner