Amaravati ORR : అమరావతి ఔటర్ రింగ్ రోడ్‌పై మరో అప్‌డేట్.. 70 కాదు.. 150 మీటర్ల వెడల్పు ఉండాల్సిందే!
Amaravati ORR : అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణంపై మరో కీలక అప్‌డేట్ వచ్చింది. దీని వెడల్పు 70 మీటర్లు ఉంటుందని.. అందుకు అనుగుణంగా భూసేకరణ చేపట్టడానికి కేంద్రం అనుమతించింది. కానీ.. 70 మీటర్లు సరిపోదని.. భవిష్యత్ అవసరాల కోసం 150 ఉండాలని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.
అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి 150 మీటర్ల వెడల్పుతో భూసేకరణ జరిగేలా అనుమతించాలని.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ 70 మీటర్ల వెడల్పుతో భూసేకరణకు అనుమతించింది. కానీ భవిష్యత్ అవసరాలకు అది సరిపోదని.. గతంలో తాము కోరినట్లు 150 మీటర్లు ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ విజ్ఞప్తి చేసింది. దీనిపై కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందోనన్న ఆసక్తి నెలకొంది.
ఖర్చులన్నీ కలిపి..
అమరావతి రింగ్ రోడ్డు.. కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, గుంటూరు, పల్నాడు జిల్లాల పరిధిలో 189.4 కిలోమీటర్ల మేర ఉండనుంది. ఆరు వరుసల యాక్సెస్ కంట్రోల్ ఓఆర్‌ఆర్ ఎలైన్‌మెంట్‌కు.. అప్రూవల్ కమిటీ డిసెంబరు 20న ప్రాథమిక ఆమోదం తెలిపింది. 70 మీటర్ల వెడల్పుతో.. 1,702 ఎకరాల మేర భూసేకరణకు మోర్త్ అనుమతించింది. నిర్మాణ వ్యయం, భూసేకరణ, ఇతర అనుమతులకు అయ్యే ఖర్చులు అన్నింటినీ కలిపి ప్రాజెక్టు వ్యయం రూ.16 వేల 310 కోట్లుగా అంచనా వేసింది.
ప్రభుత్వానికి దస్త్రం..
అయితే.. ఓఆర్‌ఆర్ ఎలైన్‌మెంట్ అప్రూవల్ కమిటీ ప్రాథమిక ఆమోదం తెలిపే సమయంలో.. ఐదు చోట్ల స్వల్ప మార్పులు చేయాలని సూచించింది. దీంతో ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఐదు చోట్ల స్వల్ప మార్పులు చేశారు. దీనికి సంబంధించిన దస్త్రాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు. ఆ దస్త్రాన్ని పరిశీలించిన ఏపీ ప్రభుత్వం.. ఇటీవల సంతృప్తి వ్యక్తం చేసింది.
150 మీటర్ల వెడల్పుతో..
అదే సమయంలో అమరావతి రింగ్ రోడ్డు 150 మీటర్ల వెడల్పుతో ఉండాల్సిందేనని.. ఆ మేరకు భూసేకరణకు అనుమతించాలని కోరుతూ.. దస్త్రాన్ని మోర్త్‌కు పంపింది. ఓఆర్‌ఆర్ ప్రాజెక్టు ప్రతిపాదన ఎలైన్‌మెంట్ అప్రూవల్ కమిటీకి వెళ్లే సమయంలోనే.. 150 మీటర్ల వెడల్పుతో భూమిని సేకరించాలని ఆ మేరకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.
కారణాలు ఏంటి..
భవిష్యత్‌లో 6 వరుసల ఓఆర్‌ఆర్‌ను.. 8 వరుసలుగా విస్తరించడానికి, ఓఆర్‌ఆర్ వెంబడి రైల్వేలైన్ వేసి, సబర్బన్ రైళ్లు నడిపేందుకు భూమి అవసరమవుతుందని ఆ ప్రతిపాదనలో రాష్ట్ర ప్రభుత్వం వివరించింది. కానీ మోర్త్ ఎలైన్‌మెంట్ అప్రూవల్ కమిటీ ఇందుకు సమ్మతించలేదు. జాతీయ రహదారుల ప్రాజెక్టు కోసం సేకరించిన భూములను... దాని కోసమే వినియోగించాలని ఎన్‌హెచ్ చట్టం-1956 చెబుతోందని.. రైల్వే లైన్ కోసం తాము భూమి సేకరించడం కుదరదనే స్పష్టం చేసింది.
సానుకూల నిర్ణయం రాకపోతే..
ఒకవేళ అమరావతి రింగ్ రోడ్డు వెంట రైల్వే లైన్ నిర్మించాలనే ఆలోచన ఉంటే.. అందుకోసం రైల్వే శాఖను సంప్రదించాలని మోర్త్ స్పష్టం చేసింది. అయితే.. ప్రస్తుతం మరోసారి విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో.. కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఒకవేళ అనుకూలంగా నిర్ణయం రాకపోతే.. రైల్వే శాఖను సంప్రదించే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది.