ఉపాధ్యాయులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న బదిలీల ప్రక్రియపై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించిన పలు వివరాలను వెల్లడించింది. స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఒకే పాఠశాలలో ఐదేళ్లు సర్వీస్ పూర్తయితే తప్పనిసరిగా బదిలీ కావాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
ఇక టీచర్ల విషయానికొస్తే…. ఒకే స్కూల్ లో 8 ఏళ్లు సర్వీస్ పూర్తయితే బదిలీకి అవకాశం ఉంటుందని విద్యాశాఖ పేర్కొంది.సర్వీస్ పాయింట్లను ఏడాదికి 0.5గా కేటాయించనున్నట్లు పేర్కొంది. కేటగిరి -1కి ఒక పాయింట్, కేటగిరి-2కి రెండు పాయింట్లు ఇవ్వనున్నారు. ఇక కేటగిరి-3కి మూడు పాయింట్లు, కేటగిరి-4కి ఐదు పాయింట్లు కేటాయించనున్నట్లు విద్యాశాఖ వివరించింది.
ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ మొత్తం జూన్ మొదటి వారంలోపు పూర్తి చేసే అవకాశం ఉంది. ముందుగా ప్రాధానోపాధ్యాయులు, టీచర్ల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తారు. వీటిని వెరిఫై చేసిన తర్వాత... ప్రొవిజినల్ లిస్ట్ ను రూపొందిస్తారు. వీటిపై అభ్యంతరాలను కూడా స్వీకరిస్తారు. వీటిని పరిశీలించిన తర్వతా.... ఫైనల్ సీనియార్టీ జాబితాను విడుదల చేస్తారు.
తుది జాబితా విడుదల తర్వాత... వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పిస్తారు.వీటి ఆధారంగా బదిలీ ఉత్తర్వులు జారీ అవుతాయి. ప్రమోషన్లు పొందే వారికి కూడా ఉత్తర్వులు అందజేస్తారు. ఈ ప్రక్రియ మొత్తం కూడా జూన్ 6వ తేదీలోపు పూర్తి చేసే దిశగా విద్యాశాఖ కార్యాచరణను సిద్ధం చేసింది.
ఏపీలో టీచర్ల సర్దుబాటు, బదిలీల అంశంపై చాలా రోజులుగా కసరత్తు జరుగుతోంది. సీనియార్టీ జాబితాల విషయంల వివాదం నెలకొనటంతో… కూటమి ప్రభుత్వం పారదర్శకంగా ఈ ప్రక్రియను నిర్వహించాలని స్పష్టమైన ఆదేశాలిచ్చింది. దీంతో ఈ ప్రక్రియ మళ్లీ మొదటికొచ్చింది. ఈ నేపథ్యంలోనే… వేసవి సెలవులు పూర్తయ్యే నాటికి మొత్తం ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించింది.
టీచర్ల బదిలీలు, సర్దుబాటుతో పాటు పలు అంశాలకు సంబంధించి ఉపాధ్యాయ సంఘాల నాయకులతో మంగళవారం పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్, డైరెక్టర్ విజయరామరాజు చర్చలు జరిపారు. ఇందులో పలు అంశాలపై సఖ్యత కుదిరింది. ఎస్జీటీ టీచర్లకు మాన్యువల్ పద్ధతిలో బదిలీలు నిర్వహించేందుకు సర్కార్ నుంచి హామీ లభించింది. దరఖాస్తుల వరకు ఆన్‌లైన్‌లో స్వీకరించనున్నారు. కానీ కౌన్సెలింగ్ మాత్రం మాన్యువల్‌గా ఆయా జిల్లాల్లో నిర్వహించేందుకు సుముఖత వ్యక్తమైంది. ఉమ్మడి సర్వీసు నిబంధనల సమస్య పరిష్కారానికి త్వరలోనే కమిటీని ఏర్పాటు చేసేందుకు కూడా విద్యాశాఖ సిద్ధమైంది.