Housing In CRDA: రాజధానిలో పేదలకు ఇళ్లపై గెజిట్ నోటిఫికేషన్
Housing In CRDA: అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు తేనెతుట్టెను ఏపీ ప్రభుత్వం మరోమారు కదిల్చింది. రైతుల నుంచి రాజధాని కోసం సమీకరించిన భూముల్లో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించడానికి మరోసారి సిద్ధమైంది. రాజధానిలో ఇళ్ల స్థలాల కేటాయింపుకు అనువుగా కొత్త జోన్ ఏర్పాటుకు గెజిట్ జారీ చేశారు.
Housing In CRDA: అమరావతిలో పేదలకు ఇళ్ళ స్థలాలు కేటాయించడానికి ఏపీ సర్కారు సిద్ధమైంది. 900 ఎకరాలతో ఆర్5 జోన్ ఏర్పాటుకు గెజిట్ నోటిఫికేషన్ జారి చేశారు. రాజధాని కోసం భఊములు సమీకరించిన ప్రాంతంలో రైతుల అభ్యంతరాలు, గ్రామసభల తీర్మానాలను పట్టించుకోకుండా ప్రభుత్వం కొత్త జోన్ ఏర్పాటు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై విచారణ జరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం భూములు సమీకరించిన అమరావతిలో మరోసారి అలజడి ప్రారంభమైంది. రైతులు వ్యతిరేకిస్తున్నా రాజధానిలో ఆర్ 5 జోన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది.
మంగళగిరి మండలంలోని కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు, తుళ్లూరు మండలంలోని మందడం, ఐనవోలు గ్రామాల పరిధిలో దాదాపు 900 ఎకరాలను ఆర్-5 జోన్ పరిధిలోకి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆర్-5 జోన్ ఏర్పాటుపై 2022 అక్టోబరులోనే ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ప్రభుత్వ నిర్ణయం సరికాదని, జీవోను వ్యతిరేకిస్తూ అప్పట్లో రాజధాని రైతులు కోర్టుకు వెళ్లారు. కనీసం రైతుల అభిప్రాయాలు తీసుకోలేదని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు ఆదేశాలతో అధికారులు రాజధాని గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించారు.
కొత్త జోన్ ఏర్పాటుపై ప్రభుత్వ నిర్ణయాన్ని రాజధాని రైతులు వ్యతిరేకించారు. రైతుల అభిప్రాయాన్ని పట్టించుకోకుండా ప్రభుత్వం ఆర్-5 జోన్ ఏర్పాటుపై గెజిట్ విడుదల చేసింది. పేద వర్గాల ఇళ్ల కోసం భూములు కేటాయిస్తున్నట్టు గెజిట్‌లో పేర్కొంది. ప్రభుత్వ నిర్ణయాన్ని మరోసారి కోర్టులో సవాలు చేసేందుకు రాజధాని రైతులు సిద్ధమయ్యారు.
ఆర్ 5 జోన్ ఏర్పాటు దేనికోసం…?
అమరావతి మాస్టర్ ప్లాన్ ప్రకారం రాజధానిలో ఇప్పటి వరకు 4 నివాస జోన్లు ఉండేవి. మాస్టర్ ప్లాన్ ప్రకారం రాజధానిలో ఇంతవరకు రెసిడెన్షియల్ జోన్ 1లో ప్రస్తుత గ్రామాలు ఉన్నాయి. ఆర్-2లో తక్కువ సాంద్రతలో ఇళ్ళు , ఆర్-3 లో తక్కువ నుంచి మధ్యస్థాయి సాంద్రత కలిగిన ఇళ్లు, ఆర్-4లో హైడెన్సిటీ జోన్ పేర్లతో 4 రకాల నివాస జోన్లు ఉండేవి. రాజధానిలోని కృష్ణాయపాలెం, వెంకటపాలెం, నిడమర్రు, కురగల్లు, మందడం, ఐనవోలు గ్రామాల పరిధిలోని 967.25 ఎకరాలను నివాస ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించింది. అందులోని 900.97 ఎకరాలను ఆర్-5 జోన్‌గా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది.
ప్రభుత్వ నిర్ణయాన్ని అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు వ్యతిరేకిస్తున్నారు.రాజధాని నిర్మాణం కోసం ఇచ్చిన భూముల్లో ఇతరులకు నివాస స్థలాలు కేటాయించడాన్ని తప్పు పడుతున్నారు. రాజధాని మాస్టర్‌ప్లాన్‌లో మార్పులు చేయడం సరికాదంటున్నారు. రాజధాని గ్రామాల ప్రజలు, అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతులు వ్యతిరేకించినా, గ్రామసభల్లో తీర్మానాలు చేసినా గెజిట్ జారీ చేయడాన్ని తప్పు పడుతున్నారు.
ఎక్కడివారికైనా అమరావతిలో ఇళ్లు…
రాష్ట్రంలోని ఏ ప్రాంతానికి చెందిన పేదలకైనా రాజధానిలో ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు వీలు కల్పిస్తూ ప్రత్యేకంగా ఆర్5 జోన్ ఏర్పాటుచేసింది. ఈ మేరకు మంగళవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. విజయవాడ, పెదకాకాని, దుగ్గిరాల వంటి రాజధానికి వెలుపలి ప్రాంతాలకు చెందిన 50 వేల మందికిపైగా పేదలకు అమరావతిలో సెంటు చొప్పున ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం గతంలో జీవో విడుదల చేసింది.
ప్రభుత్వ నిర్ణయాన్ని రాజధాని రైతులు హైకోర్టులో సవాలు చేయగా... కోర్టు ఆ జీవోను కొట్టేసింది. దాంతో మాస్టర్‌ప్లాన్‌లో మార్పులు చేసి, ఆర్5 జోన్ ఏర్పాటుకు వీలుగా సీఆర్‌డీఏ చట్టంలో రాష్ట్రప్రభుత్వం కొన్ని నెలల క్రితం సవరణలు చేసింది. దాన్ని సవాలుచేస్తూ రాజధాని రైతులు వేసిన కేసు హైకోర్టులో విచారణలో ఉంది. అక్కడ కేసు పెండింగ్‌లో ఉండగానే... రాష్ట్రప్రభుత్వం ఏకపక్షంగా మాస్టర్‌ప్లాన్‌లో సవరణలు చేయడంపై రాజధాని రైతులు మండిపడుతున్నారు. రాజధాని మాస్టర్‌ప్లాన్‌లో వివిధ జోన్లలో ఉన్న భూముల నుంచి 900.97 ఎకరాల్ని మినహాయించి... ఆర్5 జోన్‌గా ఏర్పాటు చేస్తున్నట్టు గెజిట్ నోటిఫికేషన్‌లో ప్రభుత్వం పేర్కొంది.
ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ వేసిన రైతులు
మాస్టర్‌ప్లాన్‌లో మార్పులు చేసేందుకు వీలుగా సీఆర్‌డీఏ చట్టాన్ని సవరిస్తూ 2022 అక్టోబరు 18న ప్రభుత్వం జీవో విడుదల చేసింది. రాజధాని పరిధిలోని స్థానిక సంస్థల నుంచి గానీ, ఎన్నికైన పాలకమండళ్లు గానీ లేకపోతే ప్రత్యేకాధికారులు లేదా పర్సన్ ఇన్‌ఛార్జుల నుంచి వచ్చిన ప్రతిపాదనల ఆధారంగా, లేదా ప్రభుత్వం తనంత తానుగా రాజధాని మాస్టర్‌ప్లాన్, జోనల్ డెవలప్‌మెంట్ ప్లాన్లలో మార్పులు చేసేందుకు వీలు కల్పిస్తూ సీఆర్‌డీఏ చట్టాన్ని సవరించింది.
ప్రత్యేకాధికారులతో తీర్మానాలు చేయించి... మాస్టర్‌ప్లాన్‌లో సవరణలు ప్రతిపాదిస్తూ గత అక్టోబరులో ముసాయిదా ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలోని ఏ ప్రాంతానికి చెందిన పేదలకైనా రాజధానిలో ఇళ్లస్థలాలు కేటాయించేందుకు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గృహనిర్మాణ పథకాల కింద రాజధానిలో ఇళ్లస్థలాలు మంజూరు చేసేందుకు వీలుకల్పిస్తూ మాస్టర్‌ప్లాన్‌లో సవరణలు ప్రతిపాదించింది. దానికి అభ్యంతరం చెబుతూ... రైతులు హైకోర్టును ఆశ్రయించారు. రైతులు స్టే కోరినప్పుడు... కోర్టుకు తెలియజేయకుండా గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వబోమని, ఆ ప్రక్రియ సుదీర్ఘంగా ఉంటుందని తెలిపింది. కానీ దానికి విరుద్ధంగా కేసు విచారణ పెండింగ్‌లో ఉండగానే ప్రభుత్వం మంగళవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
న్యాయపోరాటం చేస్తామంటున్న రైతులు
సీఆర్డీఏ రాజధానికి భూములిచ్చిన రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని రాజధాని రైతులు ఆరోపిస్తున్నారు. గెజిట్ జారీపై హైకోర్టులో పిటిషన్ వేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. రాజధాని రైతు పరిరక్షణ సమితి గతంలో వేసిన కేసులో... మాస్టర్ ప్లాన్‌లో ఏకపక్ష సవరణలు చెల్లవని హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిందని, దానికి విరుద్ధంగా ప్రణాళికలో లేని కొత్త జోన్‌ను ఏర్పాటుచేయడం కోర్టుతీర్పును ధిక్కరించడమేనని రైతులు చెబుతున్నారు.
కొత్త జోన్‌కు కేటాయించిన భూముల వివరాలు..
కృష్ణాయపాలెం: యూ1 జోన్‌లోని ఏడు సర్వే నంబర్లలో 10.18 ఎకరాలు. సి5 జోన్‌లోని 26 సర్వే నంబర్లలో 62.45 ఎకరాలు
నిడమర్రు: కాలుష్యరహిత పరిశ్రమల జోన్‌లోని ఏడు ప్రాంతాల్లో 196.2, 87.82, 12.13, 54.35, 95.09, 82.18, 142.56 ఎకరాల చొప్పున కేటాయింపు.
కురగల్లు: టౌన్‌సెంటర్ జోన్, ఎడ్యుకేషన్ జోన్లలోని మూడు ప్రాంతాల్లో 12.44, 12.96, 12.91 ఎకరాలు
మందడం: బిజినెస్ పార్క్ జోన్, టౌన్‌సెంటర్ జోన్, నైబర్‌హుడ్ జోన్, ఎడ్యుకేషన్ జోన్లలోని నాలుగు చోట్ల 10, 17.02, 9.11, 10.32 ఎకరాల చొప్పున ఇచ్చారు.
ఐనవోలు: బిజినెస్ పార్క్ సెంటర్ జోన్, ఎడ్యుకేషన్ జోన్లలోని రెండు ప్రాంతాల్లో 1.48, 51.67 ఎకరాల చొప్పున కేటాయించారు.