AP Govt Central Data System : ప్రభుత్వ విభాగాల డిజిటలైజేషన్ - తెరపైకి కేంద్రీకృత డేటా వ్యవస్థ..!-ap government is working towards creating a centralised data system through digital integration of all departments ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Govt Central Data System : ప్రభుత్వ విభాగాల డిజిటలైజేషన్ - తెరపైకి కేంద్రీకృత డేటా వ్యవస్థ..!

AP Govt Central Data System : ప్రభుత్వ విభాగాల డిజిటలైజేషన్ - తెరపైకి కేంద్రీకృత డేటా వ్యవస్థ..!

Maheshwaram Mahendra Chary HT Telugu
Published Feb 09, 2025 10:59 AM IST

డిజిటల్ సేవలపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. కేంద్రీకృత డేటా సిస్టమ్ ద్వారా పౌరులకు అత్యుత్తమమైన సేవలను అందించాలని యోచిస్తోంది. మొబైల్ లోనే ముఖ్యమైన డాక్యుమెంట్లను పొందేలా చర్యలు తీసుకుంటోంది. మరిన్ని ప్రభుత్వ సేవలను డిజిటలైజ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు డేటా వ్యవస్థను ఏర్పాటు చేయనుంది.

ఏపీలో కేంద్రీకృత డేటా వ్యవస్థ
ఏపీలో కేంద్రీకృత డేటా వ్యవస్థ (image source apit.ap.gov.in)

పౌరులకు ప్రభుత్వ సేవలు అందించే విషయంలో ఏపీ ప్రభుత్వం వేగంగా ముందుకెళ్లే పనిలో పడింది. ఇప్పటికే వాట్సాప్ ద్వారా పౌర సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందుకు అనుబంధంగా మరిన్ని సేవలను అందించాలని యోచిస్తోంది. మొబైల్ ఫోన్లలోనే ముఖ్యమైన పత్రాలను పొందేలా సరికొత్త వ్యవస్థ తీసుకురావాలని నిర్ణయించింది.

ప్రతి పౌరుడికి డిజిలాకర్‌…!

ముఖ్యమైన ధ్రువపత్రాలు మొబైల్‌ ఫోన్‌లోనే జారీ చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. ఇందుకోసం ప్రతి పౌరుడికి డిజిలాకర్‌ సదుపాయం కల్పించాలని యోచిస్తోంది. ఇందుకోసం అన్ని విభాగాలను ఒకే వేదికపై తీసుకువచ్చేలా కేంద్రీకృత డేటా వ్యవస్థను రూపొందించేలా కసరత్తు మొదలుపెట్టింది.

విద్యార్హతలు, కుల, ఆదాయ, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలతో సహా అన్ని డాక్యుమెంట్లను మొబైల్ ఫోన్ లోనే అందుబాటులో ఉంచుతామని రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి భాస్కర్‌ కాటమనేని ఓ ప్రకటనలో తెలిపారు.

"సమీప భవిష్యత్తులో పౌరులు తమకు సంబంధించిన ఎలాంటి డాక్యుమెంట్లను భౌతికంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. బదులుగా, వారి డాక్యుమెంట్లన్నీ వారి మొబైల్ ఫోన్లలో డిజిటల్ రూపంలో లభిస్తాయి" అని కాటమనేని చెప్పారు.

శాఖల సమాచారం ఏకీకృతం…!

రాష్ట్ర ఐటీ శాఖ పరిధిలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్)… ప్రభుత్వంలోని అన్ని శాఖల డేటాను ఏకీకృతం చేయడానికి పెద్ద "డేటా లేక్" ను ఏర్పాటు చేస్తోందని కాటమనేని భాస్కర్ చెప్పారు. “ప్రస్తుతం ప్రభుత్వంలో కేంద్రీకృత డేటా వ్యవస్థ లేదు. అనేక శాఖల వద్ద డేటా ఉన్నప్పటికీ… అది ఇంకా ఏకీకృతం కాలేదు” అని ఆయన పేర్కొన్నారు.

పౌరులకు వివిధ సేవలను అందించడంలో మొదటి దశలో… ప్రభుత్వం ఇటీవల మెటా సహాయంతో వాట్సాప్ గవర్నెన్స్ ను ప్రారంభించింది. ప్రస్తుతం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 163 సేవలు అందుబాటులో ఉన్నాయని, భవిష్యత్తులో పౌరులకు అవసరమైన అన్ని సేవలు, వివిధ ధ్రువీకరణ పత్రాలు వాట్సాప్ ద్వారానే అందుబాటులోకి వస్తాయని భాస్కర్ వివరించారు.

తదుపరి దశలో పౌరులు వారి ధృవీకరణ పత్రాలను డిజిలాకర్లలో భద్రపరిచే సదుపాయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని భాస్కర్ తెలిపారు. డాక్యుమెంట్లను పొందడానికి వారు వాట్సాప్ ద్వారా చెల్లింపులు చేయవచ్చన్నారు. సురక్షితంగా వీటిని పొందే అవకాశం ఉంటుందన్నారు.

ఈ సేవలను సమర్థవంతంగా అందించడానికి… శాఖల మధ్య వేగవంతమైన డేటా ఇంటిగ్రేషన్ కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు. వాట్సాప్ ద్వారా పౌరులకు మూడు ప్రధాన సేవలను అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పుకొచ్చారు.

ప్రతి శాఖకు రెండు రోజుల్లో చీఫ్ డేటా టెక్నికల్ ఆఫీసర్ (సీడీటీవో)ను నియమించాలని ఐటీ కార్యదర్శి భాస్కర్ కాటంనేని కోరారు. ఆర్టీజీఎస్ డేటా లేక్ ద్వారా శాఖల వారీగా డేటాను పంచుకునే ప్రక్రియను వారంలోగా పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు.

Whats_app_banner

సంబంధిత కథనం