స్వర్ణాంధ్ర 2047 కోసం టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు.. ఛైర్మన్‌గా సీఎం చంద్రబాబు-ap government has formed task force for swarnandhra 2047 industrial development ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  స్వర్ణాంధ్ర 2047 కోసం టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు.. ఛైర్మన్‌గా సీఎం చంద్రబాబు

స్వర్ణాంధ్ర 2047 కోసం టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు.. ఛైర్మన్‌గా సీఎం చంద్రబాబు

Anand Sai HT Telugu

స్వర్ణాంధ్ర 2047 పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది.

చంద్రబాబు (AP CMO)

స్వర్ణాంధ్ర 2047లో భాగంగా ఏపీ ప్రభుత్వం టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసింది. ఛైర్మన్‌గా సీఎం చంద్రబాబు ఉంటారు. కో ఛైర్మన్‌గా టాటా సన్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్, సభ్యులుగా సీఐఐ డీజీ చంద్రజిత్ బెనర్జీ, అపోలో ఆసుపత్రి వైస్ ఛైర్‌పర్సన్ ప్రీతారెడ్డి, భారత్ బయోటెక్ ఎండీ సుచిత్ర ఎల్ల, ప్రొఫెసర్ రాజ్‌రెడ్డి, సతీశ్ రెడ్డి, జీఎం రావు, ఎల్అండ్‌టీ ఛైర్మన్ సుబ్రమణ్యన్, టీవీఎస్ మోటర్ ఛైర్మన్ వేణు శ్రీనివాస్, సీఎస్ విజయానంద్ ఉండనున్నారు.

ఇప్పటికే స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాన్ని సాధించడానికి 26 జిల్లాల్లోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక్కొక్కటి చొప్పున విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్లను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయం నుండి ప్రారంభించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, సీనియర్ అధికారులను ఉద్దేశించి ఆన్‌లైన్ వీడియో మోడ్‌లో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. స్వర్ణాంధ్రను విస్తృత దృక్పథంలో సాకారం చేసుకునే ప్రయత్నాలలో భాగంగా సంబంధిత జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గానికి ఏర్పాటు చేసిన కార్యాచరణ ప్రణాళికలను అమలు చేయడానికి ఈ యూనిట్లు పనిచేస్తాయని అన్నారు.

ప్రతి యూనిట్‌లో తొమ్మిది మంది సభ్యుల బృందం ఉంటుందని సీఎం వివరించారు. నియోజకవర్గ కార్యాచరణ ప్రణాళిక విభాగానికి ఎమ్మెల్యే అధ్యక్షుడిగా, నియోజకవర్గ ప్రత్యేక అధికారి కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడిగా ఉంటారు. స్థానిక సంస్థల నుండి సంబంధిత ఎమ్మెల్సీ, మునిసిపాలిటీ/నగర పంచాయతీ చైర్‌పర్సన్, ఆర్డీఓ/సబ్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్లు, తహశీల్దార్లు, ఎంపీడీఓలు దీనిలో సభ్యులుగా ఉంటారు. ప్రతి యూనిట్‌లో తొమ్మిది మంది ఉంటారు. వీరిలో ఎమ్మెల్యే, జిల్లా నోడల్ అధికారి, ఒక విద్యావేత్త, ఒక యువ ప్రొఫెషనల్, గ్రామ సచివాలయాలు, వార్డ్ సచివాలయాలకు చెందిన ఐదుగురు సిబ్బంది ఉన్నారు.

స్వర్ణాంధ్ర-2047 నుండి పేదరికం లేని సమాజ స్థాపన, ఉపాధి కల్పన, మానవ వనరుల అభివృద్ధికి నైపుణ్య శిక్షణ, నీటి భద్రత, వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, అంతర్జాతీయ ప్రమాణాల లాజిస్టిక్స్ అభివృద్ధి, ఇంధన వనరుల సమర్థవంతమైన వినియోగం, ఉత్పత్తుల నాణ్యమైన బ్రాండింగ్, స్వచ్ఛ ఆంధ్ర, దీప్‌టెక్ వంటి 10 లక్ష్యాలను చంద్రబాబు చెప్పారు.

26 జిల్లాలకు ఐదేళ్ల రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేశామని సీఎం అన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలు సమానంగా అభివృద్ధి చెందేలా రాబోయే నాలుగు సంవత్సరాలలో ఎలాంటి అభివృద్ధిని చేపట్టాలో ప్రణాళిక వేయడం ముఖ్యమైన విషయం అని పేర్కొన్నారు.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.