AP Registration : కాసుల వర్షం కురిపించిన రిజిస్ట్రేషన్లు.. రికార్డు స్థాయిలో ఆదాయం.. ఈ జిల్లాల్లోనే ఎక్కువ!
AP Registration : ఏపీ ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ల ద్వారా భారీగా ఆదాయం వచ్చింది. ఒక్కరోజులోనే రూ.139 కోట్ల ఆదాయం జమ అయ్యింది. విశాఖ, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో ఎక్కువగా రిజిస్టేషన్లు జరిగాయి. ఈ జిల్లాల నుంచి భారీగా ఆదాయం వచ్చింది. ఈ స్థాయిలో రిజిస్ట్రేషన్లు జరగడానికి కారణం ఏంటో ఓసారి చూద్దాం.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. ఆస్తుల క్రయ, విక్రయ రిజిస్ట్రేషన్ల ద్వారా.. శుక్రవారం ఒకరోజే రూ.139 కోట్ల ఆదాయం వచ్చింది. గురువారం కూడా రూ.107 కోట్ల వరకు ఆదాయం వచ్చిందని అధికారులు చెబుతున్నారు. ఈ రెండు రోజుల్లోనే రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.246 కోట్లు ప్రభుత్వ ఖజానాలో జమ అయ్యాయి.

ఛార్జీల భారం పెరుగుతోందని..
శనివారం (ఫిబ్రవరి 1వ తేదీ) నుంచి భూముల కొత్త రిజిస్ట్రేషన్ విలువలు అమల్లోకి వచ్చాయి. సవరించిన విలువలతో రిజిస్ట్రేషన్ ఛార్జీల భారం పెరిగింది. దీంతో ఛార్జీల భారం పడకుండా.. జనవరి 30, 31వ తేదీల్లో ఎక్కువ మంది రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. ఆస్తుల క్రయ, విక్రయదారులతో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు రద్దీగా కనిపించాయి. గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లోనే ఎక్కువగా రిజిస్ట్రేషన్లు జరిగాయి.
టాప్ 10 జిల్లాలు ఇవే..
జనవరి 31న ఎక్కువ ఆదాయం వచ్చిన టాప్ 10 జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.
1.విశాఖపట్నం- రూ.16.94 కోట్లు
2.గుంటూరు- రూ.16.92 కోట్లు
3.ఎన్టీఆర్ జిల్లా- రూ.12.07 కోట్లు
4.తూర్పుగోదావరి- రూ.11.35 కోట్లు
5.తిరుపతి- రూ.8.94 కోట్లు
6.కృష్ణా జిల్లా- రూ.6.69 కోట్లు
7.కాకినాడ- 6.14 కోట్లు
8.పశ్చిమ గోదావరి- రూ.5.78 కోట్లు
9.నెల్లూరు- రూ.5.69 కోట్లు
10.అనంతపురం- రూ.5.19 కోట్లు
20 శాతం వరకు..
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంపుపై చర్చ జరుగుతుంది. జనవరి 1 నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతాయనే ప్రచారం కూడా జరిగింది. అయితే దీనిపై రెవెన్యూ మంత్రి అనగాని స్పష్టత ఇస్తూ.. ఫిబ్రవరి 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమలవుతాయని ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా సగటున 0 నుంచి 20 శాతం రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుదల ఉండనుంది. కొన్ని ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ ఛార్జీలు 0 శాతం మాత్రమే ఉంటాయి.
అమరావతిలో అంతే..
విజయవాడ, విశాఖపట్నం తోపాటు కోనసీమ, ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగాయి. మరికొన్ని చోట్ల ఛార్జీలను తగ్గించారు. అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో రిజిస్ట్రేషన్ విలువలు పెంచకూడదని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఇక్కడ పాత ఛార్జీలే ఉండనున్నాయి. రాష్ట్రంలో ఎక్కడ గ్రోత్ కారిడార్లు ఉన్నాయో అక్కడ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగాయి.