రాష్ట్రంలో దివ్యాంగులకు గుర్తింపు కార్డుల జారీకి అవసరమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి అధికారులను ఆదేశించారు. దివ్యాంగులకు గుర్తింపు కార్డులు అందజేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని.. అందులో భాగంగానే ఈ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా సదరమ్ స్లాట్ బుకింగ్స్ పై కూడా కీలక ఆదేశాలను జారీ చేశారు.
శుక్రవారం వెలగపూడి సచివాలయంలో దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమంపై సంబందిత అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. సదరం సర్ట్ఫికెట్లు, PMJAY వందన వయోవృద్ధుల హెల్త్ స్కీమ్ పై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.... గ్రామ సచివాలయాలు, మీసేవ కేంద్రాలతో పాటు మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సదరం స్లాట్ బుకింగ్ కి చర్యలు చేపట్టాలన్నారు.
స్లాట్ బుకింగ్ చేసుకున్న రోజు నుంచి నెల రోజుల లోపు సదరం సర్టిఫికెట్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని మంత్రి డోలా ఆదేశించారు. సుదూర ప్రాంతాలు, గిరిజన తండాల నుంచి వచ్చే దివ్యాంగులకు ఇబ్బందులు లేకుండా సదరం క్యాంపులు నిర్వహించాలని సూచించారు.
దివ్యాంగులకు గుర్తింపు కార్డులు అందజేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని గుర్తు చేశారు. ఈ గుర్తింపు కార్డులో అంగవైకల్య శాతం, దివ్యాంగుల వివరాలు ఉంటాయన్నారు. గుర్తింపు కార్డులు తయారీ, జారీ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. 70 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ PMJAY వందన స్కీమ్ ద్వారా రూ.5 లక్షల ఉచిత వైద్యం అందిస్తామని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి వివరించారు.
శారీరక వైకల్యం, మానసిక లోపాలు, కంటిచూపు లోపం వంటి ఇతర లోపాలతో బాధపడే వారికి వైకల్యాన్ని నిర్ధారిస్తూ అందించేదే సదరం సర్టిఫికెట్. ఈ సర్టిఫికేట్‌ను ఆధారంగా తీసుకునే ప్రభుత్వం పెన్షన్, ఇతర దివ్యాంగు కోటా సంక్షేమ పథకాలను అందిస్తోంది. కనుక ప్రతి ఒక్క దివ్యాంగుడు ఈ సదరం సర్టిఫికేట్ పొందాల్సి ఉంటుంది. అప్పుడే ఆయన అన్ని రకాల పథకాలు, రాయితీలు వర్తిస్తాయి. సదరం సర్టిఫికేట్ లేని దివ్యాంగుడు ప్రభుత్వ పథకాలకు, రాయితీలకు అనర్హుడుగా గుర్తిస్తారు.
ఈ సదరం సర్టిఫికెట్‌ను ప్రైవేట్ వ్యక్తులు, ప్రైవేటు వైద్యులు కాకుండా.... ప్రభుత్వ ఆసుపత్రుల్లో వివిధ రకాల కొలమానాల ప్రకారం అందిస్తారు. ఏదైనా ప్రమాదం జరిగి అవయవాలు కోల్పోయిన వారికి ఆర్థో, అంధత్వం, వినికిడి, మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వారికి ప్రభుత్వం సదరం సర్టిఫికెట్ జారీ చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పెన్షన్‌తో పాటు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్, రాష్ట్ర, కేంద్ర రవాణా సంస్థలైన ఆర్టీసీ బస్సులు, రైళ్లలో ప్రయాణ చార్జీల్లో రాయితీలు, ఉచిత ప్రయాణం, చిన్న పరిశ్రమ స్థాపనకు రుణాలు, సబ్సిడీకి సందరం సర్టిఫికెట్ ఎంతో ఉపయోగపడుతోంది. సదరం స్లాట్ ఎక్కువ కాలం అందుబాటులో ఉండవు కనుక అందుబాటులో ఉన్న సమయంలోనే బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.