ఇక సులభంగా వారసత్వ ధ్రువీకరణ పత్రం..! ఫీజు చాలా తక్కువ, ఇవిగో వివరాలు-ap government decides to issue succession certificate ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  ఇక సులభంగా వారసత్వ ధ్రువీకరణ పత్రం..! ఫీజు చాలా తక్కువ, ఇవిగో వివరాలు

ఇక సులభంగా వారసత్వ ధ్రువీకరణ పత్రం..! ఫీజు చాలా తక్కువ, ఇవిగో వివరాలు

వారసత్వ భూముల విషయంపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. వారసత్వ భూములకు ధ్రువీకరణ పత్రాలను అందజేయనుంది. రూ.10లక్షల వరకు విలువైన వారసత్వ భూములకు రూ.100 చెల్లిస్తే సరిపోతుంది. స్థానికంగా ఉండే గ్రామ సచివాలయాల్లోనే వీటిని పొందే అవకాశాన్ని తీసుకువస్తోంది.

ఇక సులభంగా వారసత్వ ధ్రువీకరణ పత్రం

ఏపీ రెవెన్యూ వ్యవస్థలో మరో మార్పు రానుంది. వారసత్వ భూముల విషయంలో ఉన్న ఇబ్బందులకు చెక్ పెట్టే దిశగా అడుగులు వేసింది. కుటుంబ సభ్యుల మధ్య వివాదాలకు దారితీస్తున్నాయనే విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం…. అతి ఫీజుతోనే వారసత్వ ధ్రువీకరణ పత్రాలను అందజేయాలని నిర్ణయించింది.

ఇటీవలే సీఎం చంద్రబాబు రెవెన్యూశాఖపై సమీక్షించారు. ఇందులో పలు అంశాలపై చర్చించగా.. వారసత్వ భూములకు సెక్షన్‌ (సక్సెషన్) సర్టిఫికెట్‌ ఇవ్వాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని రెవెన్యూ సమస్యలను అక్టోబరు 2లోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అయితే వారసత్వ భూములకు ఇచ్చే సెక్షన్ సర్టిఫికెట్ ధరలు కూడా తక్కువగా ఉండేలా నిర్ణయం తీసుకున్నారు.

వారసత్వ భూములకు సర్టిఫికెట్‌ - ముఖ్య వివరాలు

  • వారసత్వ ధ్రువీకరణ పత్రం (సక్సెషన్ సర్టిఫికెట్) లేకపోవడం వల్ల గ్రామాల్లో పలు వివాదాలకు దారితీస్తున్నాయనే విషయాన్ని గుర్తించిన ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
  • వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ కోసం ఇచ్చే ధ్రువీకరణ పత్రం జారీని సులభతరం చేయాలని నిర్ణయించింది.
  • రూ.10 లక్షల విలువ లోపు భూములకు కేవలం రూ.100 ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. రూ.10 లక్షలకు పైబడిన భూములకు రూ.1000 కట్టాలి.
  • ఇందుకు సంబంధించే సర్టిఫికెట్లను స్థానిక గ్రామ సచివాలయాల్లోనే అందజేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
  • ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ల విషయంలో ఉన్న ఇబ్బందులు తగ్గే అవకాశం ఉంటుంది. సులభంగా రిజిస్ట్రేషన్లు జరుగుతాయని అధికారులు భావిస్తున్నారు.
  • ఇక రాష్ట్రంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో దాదాపు 1.85 లక్షల దరఖాస్తులురాగా…. వాటిలో ఇప్పటికి కేవలం 687 మాత్రమే పెండింగ్ లో ఉన్నాయని ప్రభుత్వం ప్రకటించింది.
  • గత ఏడాది కాలంలో ప్రభుత్వానికి అందిన 4.63 లక్షల గ్రీవెన్సుల్లో ఇప్పటి వరకూ 3.99 లక్షల గ్రీవెన్సులను పరిష్కరించడం జరిగినట్లు రెవెన్యూశాఖ మంత్రి అనగాని వివరించారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.