AP Pensions: అర్హత ఉన్న వారి పెన్షన్లను తొలగించడం లేదని స్పష్టం చేసిన ఏపీ ప్రభుత్వం,విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో పెన్షన్-ap government clarifies that pensions of eligible people will not be removed ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Pensions: అర్హత ఉన్న వారి పెన్షన్లను తొలగించడం లేదని స్పష్టం చేసిన ఏపీ ప్రభుత్వం,విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో పెన్షన్

AP Pensions: అర్హత ఉన్న వారి పెన్షన్లను తొలగించడం లేదని స్పష్టం చేసిన ఏపీ ప్రభుత్వం,విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో పెన్షన్

Sarath Chandra.B HT Telugu

AP Pensions: ఏపీలో పెన్షన్ల తొలగింపుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. నిర్దేశిత ప్రమాణాల మేరకు అర్హతలు ఉన్న ఏ ఒక్కరి పెన్షన్ తొలగించడం లేదని, వికలాంగులైన విద్యార్థులకు నేరుగా బ్యాంకు ఖాతాలకు పెన్షన్లు జమ చేస్తున్నట్టు మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి ప్రకటించారు.

పెన్షన్ల తొలగింపుపై క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం

AP Pensions: ఇతర ప్రాంతాల్లో విద్యనభ్యసిస్తున్న దివ్యాంగ విద్యార్దులకు నేరుగా వారి ఖాతాల్లో ఫించను జమ చేయనున్నట్టు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. అర్హత కలిగిన ఏ ఒక్కరి ఫించన్ తొలగించడం లేదని, కేంద్ర ప్రభుత్వ సహకారం తో రాష్ట్రంలో కొత్తగా 12 వృద్దాశ్రమాలు నిర్మించనున్నట్టు ప్రకటించారు. వయోవృద్దుల ,విభిన్న ప్రతిభావంతులకు సంక్షేమంతో పాటు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు.

వయోవృద్దుల, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమంలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ, వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు. సీనియర్ సిటిజన్స్ స్టేట్ కౌన్సిల్ 2 వ సమావేశం మరియు స్టేట్ అడ్వైజరీ బోర్డ్ ఆన్ డిజాబులిటీ సమావేశం నిర్వహించారు.

వయో వృద్ధుల ఆరోగ్య సంరక్షణ, వృద్ధాశ్రమాల ఏర్పాటు, సామాజిక భద్రత పింఛన్లు, గ్రామ వార్డు సచివాలయాల ద్వారా డిజిటల్ కార్డుల పంపిణీ, విభిన్న ప్రతిభావంతులకు వైకల్యం ధృవపత్రాల జారీ, ప్రధాన మంత్రి దివ్యాస కేంద్రాల (పిఎమ్‌డికెలు) స్థాపన మరియ ఉపకరణాల సరఫరా. వివిధ అభివృద్ధి పథకాలు/కార్యక్రమాలలో 5% రిజర్వేషన్ల అమలు, వసతి గృహాలు, కళాశాలల్లో విద్య నభ్యసిస్తున్న విభిన్న ప్రతిభావంతుల విద్యార్థులకు DBT మోడ్‌లో పెన్షన్ల పంపిణీ తదితర అంశాలపై మంత్రి సమీక్షించారు.

వయోవృద్దులు,విభిన్న ప్రతిభావంతులకు సంక్షేమంతోపాటు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి చెప్పారు. ఇంటికి దూరంగా ఉంటూ వివిధ ప్రాంతాల్లో వసతి గృహాలు, కళాశాలల్లో విద్యనభ్యసిస్తున్న దివ్యాంగ విద్యార్దుకులకు ఫించన్ నేరుగా వారిఖాతాల్లోనే జమచేస్తామని ప్రకటించారు.

నిజమైన లబ్దిదారులకు ఫించన్ అందించడమే లక్ష్యంగా ఫించన్ల వెరిఫికేషన్ జరుగుతోందని అర్హత కలిగిన ఏ ఒక్కరి ఫించన్ తొలగించమని అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పధకాలు అందాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యం అన్నారు. దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్లు తప్పనిసరిగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

రాష్ట్రంలో 5 ప్రధానమంత్రి దివ్యాస కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, వీటిని విజయవాడ, విశాఖ, ఒంగోలు, తిరుపతి, కర్నూలులో ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో దివ్యాంగులకు వీల్ చైర్లు ఏర్పాటు చేయాలని ఇప్పటికే ఆదేశాలిచ్చామన్నారు. ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

అంధ విద్యార్దులకు వచ్చే విధ్యా సంవత్సరం మొదట్లోనే బ్రెయిలీ లిపి పుస్తకాలు అందిస్తామన్నారు. ఆటిజం విద్యార్దులు తల్లితండ్రులకు సైకాలజిస్టుల ద్వారా కౌన్సిలింగ్ ఇప్పిస్తామని మంత్రి తెలిపారు.

కొత్తగా 12 వృద్ధాశ్రమాలు…

కేంద్ర సహకారంతో రాష్ట్రంలో కొత్తగా 12 వృద్దాశ్రమాలు నిర్మిస్తున్నామని,అన్ని జిల్లాల్లో వృద్దాశ్రమాల ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. వయో వృద్దుల హక్కులపై వారికి అవగాహన కల్పించటంతో పాటు చట్టాల్ని పటిష్టింగా అమలు చేయాలన్నారు. ఒంటరిగా నివాసం ఉంటున్న వయోవృద్దుల వివరాలు పోలీసు శాఖ సేకరించి గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించాలన్నారు.

వయోవృద్దులందరికీ డిజిటల్ గుర్తింపు కార్డులు ఇవ్వనున్నట్టు మంత్రి తెలిపారు. వయో వృద్దులపై వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని, వృద్దుల ఆరోగ్య సంరక్షతోపాటు ఆస్తుల సంకరక్షణకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు.

Sarath Chandra.B

TwittereMail
శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.