Krishna Water Allocation : కృష్ణా జలాల కేటాయింపులు - సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం, ఫిబ్రవరిలో విచారణ-ap government challenged central government notification on krishna water allocation in supreme court ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Krishna Water Allocation : కృష్ణా జలాల కేటాయింపులు - సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం, ఫిబ్రవరిలో విచారణ

Krishna Water Allocation : కృష్ణా జలాల కేటాయింపులు - సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం, ఫిబ్రవరిలో విచారణ

HT Telugu Desk HT Telugu
Jan 23, 2025 10:35 PM IST

ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాల కేటాయింపు వ్యవహారాన్ని ఏపీ సర్కార్ సుప్రీంకోర్టులో మెన్షన్ చేసింది. దీనిపై స్పందించిన ధర్మాసనం… ఫిబ్రవరి 13న మధ్యాహ్నం 2 గంటలకు వాదనలు వింటామని స్పష్టం చేసింది.

సుప్రీంలో ఏపీ సర్కార్ పిటిషన్
సుప్రీంలో ఏపీ సర్కార్ పిటిషన్

ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ రాష్ట్రాల మ‌ధ్య‌నే కృష్ణా న‌దీ జలాల పంపకాల చేయాల‌న్న కేంద్ర ప్ర‌భుత్వ నోటిఫికేష‌న్‌ను ఏపీ ప్ర‌భుత్వం స‌వాల్ చేసింది. ఈ వ్యవహారంపై అత్యున్నత న్యాయ‌స్థానంలో మెన్షన్‌ చేసింది. కృష్ణా ట్రిబ్యూనల్‌ ముందు దాఖలైన కృష్ణా న‌దీ జలాల పంప‌కానికి సంబంధించిన‌ రెండు రిఫరెన్స్‌ల విచారణ వ్యవహారాన్ని ఈ పిటిష‌న్‌లో పేర్కొంది.

అక్టోబర్ లో నోటిఫికేషన్…

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రెండు రాష్ట్రాల మ‌ధ్య‌నే కృష్ణా న‌దీ జ‌లాల‌ పంప‌కం జ‌ర‌గాల‌ని 2023 అక్టోబర్‌ 23న కేంద్ర ప్ర‌భుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీన్ని స‌వాల్ చేస్తూ ఏపీ ప్ర‌భుత్వం సుప్రీం కోర్టును ఆశ్ర‌యించింది. దీనికి సంబంధించిన పిటిష‌న్‌ను గురువారం సుప్రీం కోర్టు న్యాయ‌మూర్తులు జ‌స్టిస్ సూర్య‌కాంత్‌, జ‌స్టిస్ కోటేశ్వ‌ర్ సింగ్‌లతో కూడిన ద్విస‌భ్య ధ‌ర్మాస‌నం ముందు ఏపీ ప్ర‌భుత్వం మెన్ష‌న్ చేసింది.

ఫిబ్రవరి 13న విచారణ….

ఏపీ ప్ర‌భుత్వం త‌ర‌పు సీనియ‌ర్ న్యాయ‌వాది జ‌య‌దీప్ గుప్తా వాద‌న‌లు వినిపిస్తూ.. కృష్ణా ట్రిబ్యూనల్ తీసుకున్న నిర్ణయాన్ని ధ‌ర్మాస‌నం ముందు ప్రస్తావించారు. ఫిబ్రవరి 19న ట్రిబ్యూనల్‌ రెండో రిఫరెన్స్‌నే విచారణకు తీసుకుంటామని చెప్పిన విషయాన్ని ధ‌ర్మాస‌నం దృష్టికి తీసుకెళ్లారు. కృష్ణా ట్రిబ్యూన‌ల్ విచార‌ణ చేప‌ట్ట‌క‌ముందే.. తమ పిటిషన్‌ను త్వరతిగతిన విచారణ చేపట్టాలని కోరారు. ఏపీ ప్రభుత్వం ప్రస్తావనను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు…. తదుపరి విచారణను ఫిబ్రవరి 13న మధ్యాహ్నం 2 గంట‌లకు చేపట్టనున్నట్లు ప్రకటించింది.

ఇటీవలే బ్రిజేష్‌ కుమార్ ట్రిబ్యునల్ నిర్ణయం…

2023 అక్టోబర్‌ 23న కేంద్ర ప్ర‌భుత్వం విడుదల చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌పై ఇటీవల బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యూనల్ నిర్ణయం విడుదలైంది. విభజన చట్టం ప్రకారం నీటి వాటాల పంపకంపై ఏపీ, తెలంగాణ రెండు రిఫరెన్స్‌లను ట్రిబ్యూనల్‌లో దాఖలు చేశాయి. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ మధ్య నీటి పంపకాలు చేస్తూ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యున‌ల్ ఇప్పటికే తీర్పు వెలువరించింది.

2014లో రాష్ట్ర విభజన తరువాత‌ తలెత్తిన కృష్ణా నదీ నీటి పంపకాలపై ట్రిబ్యునల్‌ను తెలంగాణ ప్ర‌భుత్వం ఆశ్రయించింది. కృష్ణా నది తమ భూభాగంలోనే ఎక్కువ ప్రవహిస్తుంద‌ని… కాబట్టి రాష్ట్ర విభజన చట్టం ప్రకారం తమకు 70 శాతం నీటి వాటా ఉండాలని కోరింది. లేని పక్షంలో రెండు రాష్ట్రాలకు 50 శాతం చొప్పున పంపిణీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

ఈ వ్యవహారంపై ట్రిబ్యూనల్‌ తేల్చక ముందే… 2023 అక్టోబర్‌ 10న కేంద్ర ప్ర‌భుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ మధ్యనే నీటి పంపకాలను తేల్చాలని, దానిపైనే విచారణ చేపట్టాలని నోటిఫికేషన్‌లో కేంద్ర ప్ర‌భుత్వం పేర్కొంది. కేంద్ర ప్ర‌భుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో ఏపీ ప్ర‌భుత్వం పిటిషన్‌ దాఖలు చేసింది. తమ ముందు ఉన్న రెండు రిఫరెన్స్‌లలో… 2023లో కేంద్ర ప్ర‌భుత్వం విడుదల చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ రిఫరెన్స్‌ పైనే ముందుగా విచారణ చేపడుతామని ఈనెల 16న కృష్ణా ట్రిబ్యూనల్ తేల్చి చెప్పింది.

దీంతో ట్రిబ్యునల్‌ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రస్తావించింది. ఫిబ్రవరి 19న ట్రిబ్యునల్‌ రెండో రిఫరెన్స్‌నే విచారణకు తీసుకుంటామని చెప్పిన నిర్ణ‌యాన్ని సుప్రీంకోర్టు ధ‌ర్మాస‌నం దృష్టికి ఏపీ న్యాయ‌వాది జ‌య‌దీప్ గుప్తా తీసుకెళ్లారు. తమ పిటిషన్‌పై త్వరతిగతిన విచారణ చేపట్టాలని కోరారు. ఏపీ ప్రభుత్వం ప్రస్తావనను పరిగణనలోకి తీసుకున్న జస్టిస్‌ సూర్యకాంత్‌ , జస్టిస్‌ కోటేశ్వర్‌ సింగ్‌ల ధర్మాసనం… తదుపరి విచారణను ఫిబ్రవరి 13న మధ్యాహ్నం 2 గంట‌లకు చేపట్టనున్నట్లు ప్రకటించింది.

రిపోర్టింగ్ : జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.

Whats_app_banner

సంబంధిత కథనం