అమర్‌నాథ్ యాత్రికులకు రేపటి నుంచి వైద్య పరీక్షలు, మెడికల్ సర్టిఫికెట్ల జారీకి ఏపీ ప్రభుత్వం అనుమతి
అమర్ నాథ్ యాత్రకు మెడికల్ సర్టిఫికెట్ జారీ రేపటి(బుధవారం) నుంచి ప్రారంభం కానుంది. గుంటూరు జీజీహెచ్ లో యాత్రికులు మెడికల్ టెస్టులు నిర్వహించి, సర్టిఫికెట్లు జారీ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
Amarnath Tour Medical Certificate : హిందూ భక్తులు ఎప్పుడా అని ఎదురు చూస్తున్న అమర్‌నాథ్ యాత్రకు మెడికల్ సర్టిఫికెట్ జారీ రేపటి (బుధవారం) నుంచి ప్రారంభం కానుంది. యాత్రికులకు మెడికల్ టెస్టులు నిర్వహించి, సర్టిఫికెట్ల జారీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ సర్టిఫికెట్లు ఇచ్చేందుకు టెస్టులు నిర్వహించనుంది.
ఒకపక్క అమర్‌నాథ్ యాత్రకు స్లాట్ బుకింగ్ ప్రారంభమైనప్పటికీ, రాష్ట్రంలో మెడికల్ సర్టిఫికెట్లు జారీలో జాప్యం జరుగుతుందని భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆసుపత్రుల చుట్టూ భక్తులు కాళ్లరిగేలా తిరిగారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి రాలేదని, అనుమతి వచ్చిన వెంటనే ప్రక్రియ ప్రారంభిస్తామని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి పేర్కొంటున్నాయి. దీనిపై విమర్శలు వ్యక్తమవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే యాత్రికులకు మెడికల్ సర్టిఫికెట్లు జారీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో వైద్య పరీక్షలు నిర్వహించేందుకు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి చర్యలు చేపట్టింది. గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణ ప్రకటన విడుదల చేశారు.
మెడికల్ టెస్టులకు కావాల్సిన పత్రాలు
అమర్‌నాథ్ యాత్రకు వెళ్లేవారు మెడికల్ సర్టిఫికేట్ కావాలంటే ఈ క్రింద ధ్రువీకరణ పత్రాలు అవసరం, వైద్య పరీక్షలకు వెళ్లేటప్పుడు వాటిని తీసుకెళ్లాలి.
1. మెడికల్ సర్టిఫికేట్ నమూనా రెండు కాపీలు
2. రెండు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు
3. వయస్సు ధృవీకరణ పత్రం
4. ఆధార్ కార్డు
5. ప్రభుత్వ గుర్తింపు
మెడికల్ టెస్టులు ఎప్పుడెప్పుడు చేస్తారు?
గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్ టెస్టులు చేస్తారు. మెడికల్ టెస్టుల అనంతరం మెడికల్ సర్టిఫికేట్ జారీ చేస్తారు. అయితే మెడికల్ టెస్టులు వారంలో రెండు రోజుల పాటు చేస్తారు. ప్రతి బుధవారం, శుక్రవారాల్లో ఉదయం 9 గంటల నుంచి 11 గంటల మధ్య మెడికల్ టెస్టులు చేస్తారు. యాత్రికులు ఆ సమయాల్లో గుంటూరు జీజీహెచ్‌కి వెళ్లి మెడికల్ టెస్టులు చేయించుకుని, మెడికల్ సర్టిఫికేట్ పొందాలి.
ఈ యాత్రకు వెళ్లేవారికి వయో పరిమితి
అమర్‌నాథ్ యాత్రకు వెళ్లేవారికి వయో పరిమితి విధించారు. అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే వారికి వయస్సు 13 సంవత్సరాల నుంచి 75 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆ వయస్సు వారు మాత్రమే మెడికల్ టెస్టులకు రావాలని గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణ తెలిపారు.
మెడికల్ సర్టిఫికేట్‌కు ఫీజు ఎంత?
మెడికల్ సర్టిఫికేట్ కోసం ఫీజు ఒక్కొక్కరికి రూ. 1,500 చెల్లించాల్సి ఉంటుంది. ఫీజును జీజీహెచ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో హెచ్‌డీఎస్ కౌంటర్‌లో చెల్లించాలని డాక్టర్ యశశ్వి రమణ తెలిపారు. ఈనెల 16 నుంచి మెడికల్ సర్టిఫికేట్లను జారీ చేస్తామని అన్నారు. ఇతర వివరాల కోసం 9963766638 ఫోన్ నెంబర్‌లో సంప్రదించాలని పేర్కొన్నారు. అమర్‌నాథ్ యాత్రకు వెళ్లాలంటే, స్లాట్ బుకింగ్ చేసుకున్నప్పుడే మెడికల్ సర్టిఫికేట్ తప్పనిసరిగా అప్లొడ్ చేయాల్సి ఉంటుంది.
అమర్నాథ్ యాత్ర-2025కి రిజిస్ట్రేషన్ ప్రారంభం
జూలై 3 నుంచి ఆగష్టు 9 వరకు జరిగే అమర్‌నాథ్ యాత్ర-2025 కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైంది. ఈ యాత్రకు వెళ్లాలనుకునే వారు కచ్చితంగా ముందస్తు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అధికారిక వెబ్‌సైట్ https://jksasb.nic.in/ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. పాస్‌పోర్టు సైజ్ ఫొటో, హెల్త్ సర్టిఫికెట్, ఓటీపీ సమర్పించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది కలిసి గ్రూప్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకునే వెసులుబాటు కూడా ఉంది.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు