AP Garbage Tax: చెత్తపన్ను రద్దు చేస్తే చెత్త ఊడవడానికి వసూళ్లు..విజయవాడలో వీఎంసీ వివాదాస్పద నిర్ణయం
AP Garbage Tax: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైసీపీ హయంలో తీసుకున్న వివాదాస్పద చెత్త పన్నును రద్దు చేసి ప్రజలకు ఊరటనిస్తే విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్‌లో మాత్రం కాలనీల్లో పారిశుధ్య సిబ్బంది రోడ్లను ఊడ్చేందుకు స్థానికులే ప్రతి నెల వారి జీతాలు చెల్లించాలని నిర్ణయించారు.
AP Garbage Tax: ప్రజల్లో గత ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతకు కారణమైన నిర్ణయాల్లో చెత్త పన్ను ఒకటి.గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో ఆస్తి పన్ను వసూల్లతో ప్రజలకు పౌర సేవలు అందుతుంటాయి. వైసీపీ హయంలో చెత్త సేకరణ కోసం ప్రత్యేకంగా మునిసిపల్ చట్ట సవరణ చేసి బలవంతపు వసూల్లకు పాల్పడింది. ప్రధాన కార్పొరేషన్లలో ఎప్పటి నుంచో ఇంటింటి చెత్త సేకరణ అమల్లో ఉండగా కొత్తగా వాహనాలు కొనుగోలు పేరుతో చెత్త పన్ను వసూళ్లను ప్రారంభించింది.
వార్డు సచివాలయ సిబ్బందితో బలవంతంగా ప్రజల నుంచి చెత్త పన్ను వసూళ్లు చేయడంతో పట్టణ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతకు కారణమైంది. గత ఎన్నికల్లో వైసీపీని పట్టణ ప్రాంత ఓటర్లు తిరస్కరించడంలో చెత్త పన్ను వంటి వివాదాస్పద నిర్ణయాలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో ఎన్నికల సమయంలో చెత్తపన్నును రద్దు చేస్తామని టీడీపీ ప్రకటించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ హయంలో మునిసిపల్ చట్టానికి చేసిన సవరణలను పునరుద్దరించి చెత్త పన్ను భారాన్ని పూర్తిగా తొలగించింది. విజయవాడలో మాత్రం మునిసిపల్ అధికారులు అతి తెలివి ప్రదర్శించారు.
వైసీపీ ప్రభుత్వ హయంలో జారీ చేసిన జీవో నంబర్ 36ఆధారంగా కొన్ని ప్రాంతాల్లో పారిశుధ్య విధులు నిర్వర్తించే కార్మికుల వేతనాలను స్థానికంగా నివసించే వారు చెల్లించాలని నిర్ణయించేశారు. ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లకుండా ఏక పక్షంగా ఈ నిర్ణయా్ని అమలు చేశారు. గత మార్చిలో జారీ చేసిన జీవో ఆధారంగా విజయవాడ మునిసిపల్ కమిషనర్ నవంబర్ 10వ తేదీన పారిశుధ్య కార్మికుల వేతనాల్లో కాలనీలు సగం చెల్లించాలని నిర్ణయించారు.దీనిపై అయా కాలనీల్లో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గత ప్రభుత్వం జారీ చేసిన జీవోకు అనుగుణంగా నగరంలని 6కాలనీల్లో రోడ్లను శుభ్రం చేయడానికి ఏడాదికి అయ్యే ఖర్చులో సగం అందులో నివసించే ప్రజలు భరించాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఇలా ఏడాదికి రూ.24లక్షలు అపార్ట్‌మెంట్‌లు, ఇళ్ల యజమానులు చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
వైసీపీ హయంలో చెత్త పన్నును ఇంటి పన్నులతో కలిపి వసూలు చేసిన కొన్ని కాలనీల్లో అపార్ట్‌మెంట్ అసోసియేషన్లు విడిగా నివాసాల నుంచి వసూలు చేశాయి.కొన్ని ప్రాంతాల్లో వార్డు సచివాలయ సిబ్బంది చెత్త పన్ను వసూలు చేసినా, వాటి చెల్లింపులకు సంబంధించి రశీదులు ఇవ్వలేదు.
తాజాగా విజయవాడ నగరంలోని 10వ డివిజన్ పరిధిలోని టీచర్స్ కాలనీ, కస్తూరి పూర్ణచంద్రరావు కాలనీ, వాసవి కన్యకా పరమేశ్వరి కాలనీ, 8వ డివిజన్‌లోని రఘురామ స్ట్రీట్ వెల్ఫేర్ అసోసియేషన్, సాయినగర్ కాలనీ, ఆర్టీసీ కాలనీలలో మొత్తం 19 మంది సిబ్బందితో పారిశుధ్య విధులు నిర్వర్తించడానికి నెలకు రూ.4లక్షల వరకు జీతాలకు ఖర్చు చేయాల్సి ఉంటుందని అంచనా వేశారు.
ప్రతి నెల అందులో సగం అయా కాలనీల నుంచి వసూలు చేయాలని నిర్ణయించారు. ప్రతి నెల 19మంది పారిశుధ్య కార్మికుల జీతాల కోసం 6 కాలనీల నుంచి రూ.2లక్షలు వసూలు చేయాలని మునిసిపల్ కార్పొరేషన్ నిర్ణయించింది. ఇలా ఏటా దాదాపు రూ.24లక్షల రుపాయల్ని పారిశుధ్య విధుల కోసం అయా కాలనీల్లో నివసించే ప్రజలు చెల్లించాల్సి ఉంటుంది.
కార్పొరేషన్ స్టాండింగ్ కౌన్సిల్ నిర్ణయం గురించి స్థానికులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండానే నిర్ణయం తీసుకుని చెత్త పన్నుతో సమానంగా ప్రతి ఇంటికి రూ.100 తక్కువ కాకుండా చెల్లించాలని నిర్ణయించారు. ప్రభుత్వం చెత్త పన్ను రద్దు చేస్తే కొత్తగా ఊడ్చే వారికి జీతాలు తాము చెల్లించడం ఏమిటని కాలనీల్లో ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
వైసీపీ హయంలో అలా…
ఏపీలో వైసీపీ ప్రభుత్వంలో వసూలు చేస్తున్న పన్నుపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. నివాసాలు, వాణిజ్య ప్రాంతాలనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి నుంచి చెత్త పన్నులు వసూలు చేశారు. 2022 మార్చి నుంచి పన్ను వసూళ్లు ప్రారంభించి ముక్కు పిండి వసూలు చేస్తున్నారు.
చెత్త సేకరణ కోసం వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది ఇంటింటికి తిరిగి వసూలు చేసేవారు. అపార్ట్‌మెంట్లలో ఒక్కో ఫ్లాట్‌కు రూ.120 చెత్త పన్నుగా వసూలు చేశారు. పేద, మధ్య తరగతి ప్రజలు నివసించే ప్రాంతాల్లో రూ.30, రోడ్డు పక్కన పెట్టుకునే బడ్డీలు, తోపుడు బళ్లకు రూ.200 వరకు పన్నుగా నిర్ణయించారు. చిన్న తరహా రెస్టారెంట్లకు నెలకు రూ.500, సినిమా థియేటర్లకు రూ.2500, ఫైవ్ స్టార్ హోటళ్లకు రూ.15వేలు, హోల్‌సేల్ దుకాణాలకు రూ.200 వసూలు చేసేవారు.
వాణిజ్య సంస్థల్ని మినహాయిస్తే నివాస ప్రాంతాల్లో ఒక్కో ప్రాంతానికి ఒక్కో రకంగా పన్ను వసూలు చేయడంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. మురికి వాడల్లో రూ.30, ఇతర ప్రాంతాల్లో రూ.120గా పన్ను నిర్ణయించి బలవంతంగా వసూలు చేశారు.
ప్రభుత్వం పంచాయితీలు మొదలుకుని కార్పొరేషన్‌ల వరకు ప్రతి నెల ఇంటి పన్ను, ఆస్తి పన్ను వసూలు చేస్తుండగా మళ్లీ చెత్త సేకరణకు ప్రత్యేకంగా పన్ను వసూలు చేయడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తమైంది. చెత్త సేకరణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని తడిచెత్త, పొడిచెత్తల నిర్వహణకు ఖర్చు చేయాల్సి వస్తోందని పురపాలక శాఖ చెప్పుకున్నా ప్రజలు దానిని తీవ్రంగా వ్యతరేకించారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసిన అంశాల్లో చెత్త పన్ను సేకరణ అంశం కూడా ఒకటి.