AP Free Gas Cylinder: ఉచిత గ్యాస్ స్కీంపై అప్‌డేట్‌, నేటి నుంచి రెండో విడత గ్యాస్ సిలిండర్ బుకింగ్-జులై 31 వరకు అవకాశం-ap free gas cylinder scheme 2nd phase bookings open now claim by july 31st ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Free Gas Cylinder: ఉచిత గ్యాస్ స్కీంపై అప్‌డేట్‌, నేటి నుంచి రెండో విడత గ్యాస్ సిలిండర్ బుకింగ్-జులై 31 వరకు అవకాశం

AP Free Gas Cylinder: ఉచిత గ్యాస్ స్కీంపై అప్‌డేట్‌, నేటి నుంచి రెండో విడత గ్యాస్ సిలిండర్ బుకింగ్-జులై 31 వరకు అవకాశం

HT Telugu Desk HT Telugu

AP Free Gas Cylinder : ఏపీలో నేటి నుంచి రెండో విడత గ్యాస్ సిలిండర్ బుకింగ్ ప్రారంభం అయ్యింది. జులై 31 వరకు ఫ్రీ సిలిండర్ బుకింగ్ అందుబాటులో ఉంటుంది.

ఉచిత గ్యాస్ స్కీంపై అప్‌డేట్‌, నేటి నుంచి రెండో విడత గ్యాస్ సిలిండర్ బుకింగ్-జులై 31 వరకు అవకాశం

AP Free Gas Cylinder : ఉచిత గ్యాస్ స్కీంపై వినియోగ‌దారుల‌కు అప్‌డేట్ వ‌చ్చింది. నేటి నుంచి రెండో విడ‌త గ్యాస్ సిలిండ‌ర్ బుకింగ్ ప్రారంభం అయింది. గ్యాస్ బుకింగ్‌ జులై 31 వ‌ర‌కు అవకాశం ఉంది. ఈ మ‌ధ్యకాలంలో గ్యాస్ సిలిండ‌ర్ బుక్ చేసుకోవాలి. జులై 31 దాటితే బుకింగ్‌కు అవ‌కాశం ఉండ‌దు. ఒక గ్యాస్ సిలిండ‌ర్ వృథా అవుతుంది. దీపం-2 పథకం కింద ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండ‌ర్లు అందిస్తుంది ప్రభుత్వం.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీ ప్రకారం దీపం-2 పథకం కింద ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండ‌ర్లు అమ‌లు చేస్తున్నారు. 2024 అక్టోబర్ 31న సీఎం చంద్రబాబు ఈ పథకాన్ని ప్రారంభించారు. అయితే కూట‌మి ప్రభుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత‌ ఒక ఆర్థిక సంవ‌త్సరం పూర్తి అయింది. నేటి నుంచి రెండో ఆర్థిక సంవ‌త్సరం ప్రారంభం అయింది. గతేడాది మధ్యలో పథకం ప్రారంభం కావడంతో ఆ ఏడాది ఒకే సిలిండర్ లబ్ధిదారులకు అందింది. అయితే ఈ సంవ‌త్సరం నుంచి గ్యాస్ వినియోగ‌దారుల‌కు మూడు ఉచిత గ్యాస్ సిలిండ‌ర్లు ల‌భించ‌నున్నాయని అధికారులు చెబుతున్నారు.

దీనికి సంబంధించి మొద‌టి గ్యాస్ సిలిండ‌ర్ బుకింగ్‌ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం అవుతుంద‌ని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరభ్ గౌర్ తెలిపారు. ఇదే విష‌యాన్ని రాష్ట్ర పౌర స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్ కూడా వెల్లడించారు. ఏప్రిల్ 1 నుంచి జులై 31 వర‌కు రెండో విడుత మొద‌టి ఉచిత గ్యాస్ సిలిండ‌ర్‌ను బుక్ చేసుకోవ‌డానికి అవ‌కాశముంద‌ని తెలిపారు. ఆ బ్లాక్ పీరియ‌డ్ లోపు గ్యాస్ సిలిండ‌ర్ బుక్ చేసుకోక‌పోతే, ఒక గ్యాస్ సిలిండ‌ర్ వృథా అవుతుంది.

సూపర్-6 హామీల్లో భాగంగా కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 'దీపం-2' పథకం కింద ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 97 లక్షల మంది లబ్ధిదారులు మొద‌టి ఉచిత గ్యాస్ సిలిండర్లను బుక్ చేసుకున్నారు. అయితే వారిలో 94 లక్షల మంది బ్యాంకు ఖాతాల్లో 48 గంటల్లోనే సబ్సిడీ డబ్బులు జమ అయింది. ఇంకా 14 వేల మందికి సబ్సిడీ చెల్లింపులు పూర్తి కాలేదు. దీనికి వివిధ సాంకేతిక కారణాలు చెబుతున్నారు. ప్రధానంగా ఈకేవైసీ, ఆధార్ లింక్ వంటి కార‌ణాలతో స‌బ్సిడీకి ల‌బ్ధిదారులు దూరం అవుతున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 1,100 డిస్ట్రిబ్యూష‌న్ ఏజెన్సీ ద్వారా 1.55 కోట్ల మంది వినియోగ‌దారులకు గ్యాస్ సిలిండ‌ర్లు స‌ర‌ఫ‌రా జ‌రుగుతుండ‌గా, అందులో 1.47 కోట్లు మంది తెల్లరంగు రేష‌న్ కార్డుల వినియోగ‌దారులు ఉన్నారు. అందులోనూ 97 ల‌క్షల మందే ఉచిత గ్యాస్‌ను బుక్ చేసుకున్నారు. వివిధ కారణాల‌తో దాదాపు 50 ల‌క్షల మంది గత ఆర్థిక సంవత్సరం మొదటి ఉచిత గ్యాస్ సిలిండర్‌కు దూరం అయ్యారు.

ల‌బ్దిదారుల‌కు ఈకేవైసీ స‌మ‌స్య

మ‌రోవైపు ఉచిత గ్యాస్ సిలిండ‌ర్ల ప‌థ‌కానికి రాష్ట్ర ప్రభుత్వం ఈకేవైసీని త‌ప్పనిస‌రి చేయ‌డంతో ప్రజ‌లకు క‌ష్టాలు ప్రారంభ‌మైయ్యాయి. దాదాపు 10 ల‌క్షల మంది వినియోగ‌దారుల‌కు గ్యాస్ ఏజెన్సీల వ‌ద్ద ఈకేవైసీ జ‌ర‌గ‌లేదు. 2024 అక్టోబ‌ర్ నుంచి ఈకేవైసీ న‌మోదు జ‌రుగుతున్నప్ప‌టికీ ఇంకా పూర్తి కాలేదు. దీంతో ల‌క్ష‌లాది మంది ల‌బ్దిదారులు ఉచిత గ్యాస్‌కు దూరం అవుతున్నారు.

అయితే ఈకేవైసీ పూర్తి కాని వారికి, అలాగే ప్ర‌తినెల రేష‌న్ తీసుకోని వారికి, 300 యూనిట్ల‌కు పైగా విద్యుత్ వినియోగించేవారికి ఉచిత గ్యాస్ సిలిండ‌ర్ ప‌థ‌కం వ‌ర్తించ‌ద‌ని అధికారులు పేర్కొంటున్నారు. కారు ఉన్నా ఈ ప‌థ‌కం వ‌ర్తించ‌ద‌ని అంటున్నారు.

మూడు బ్లాక్ పీరియ‌డ్స్‌తో ప‌థ‌కం అమ‌లు

ప్రభుత్వం అందజేసే మూడు ఉచిత సిలిండర్లలో మొదటి సిలిండర్ మార్చి 31 లోపు, రెండోది జూలై 31 లోపు, మూడోది నవంబర్ 30 లోపు ఎప్పుడైనా పొందవచ్చు. ఈ పథకం అమలుకు ఏడాదికి మూడు బ్లాక్ పీడియడ్లుగా పరిగణించడం జరుగుతుంది. మొదటి బ్లాక్ పీరియడ్ ఏప్రిల్ 1 నుండి జూలై 31 వరకు, రెండో బ్లాక్ పీరియడ్ ను ఆగస్టు 1 నుండి నవంబరు 31 వరకు, మూడో బ్లాక్ పీరియర్‌ను డిశంబరు 1 నుండి మార్చి 31 వరకు పరిగణించడం జరుగుతుంది.

గ్యాస్ సిలిండ‌ర్ బుకింగ్ ఇలా

గ్యాస్ సిలిండ‌ర్‌ను ఫోన్‌లో బుకింగ్ చేసుకోవ‌చ్చు. లేదంటే, గ్యాస్ ఏజెన్సీ వద్ద అయినా బుకింగ్ చేసుకోవ‌చ్చు. ఫోన్‌లో గ్యాస్ ఏజెన్సీ నెంబ‌ర్‌కు ఫోన్ చేస్తే చాలు గ్యాస్ బుక్ అవుతుంది. వెంట‌నే గ్యాస్ బుక్ చేసుకున్నట్లు ఒక మేసేజ్ సంబందిత లబ్దిదారుని ఫోన్ నెంబరుకు వెళ్తుంది. దీంతో బుకింగ్ ప్ర‌క్రియ పూర్తి అవుతుంది.

48 గంట‌ల్లో రాయితీ డ‌బ్బులు జ‌మ‌

గ్యాస్ బుక్ చేసుకున్న 24 గంటల్లో పట్టణ ప్రాంతాల్లో, 48 గంటల్లో గ్రామీణా ప్రాంతాల్లో గ్యాస్ సిలిండ‌ర్ల‌ను డెలివరీ చేయడం జరుగుతుంది. గ్యాస్ సిలిండర్ డెలివరీ చేసిన 48 గంటల్లోనే డైరెక్ట్ బెనిఫిస‌రీ ట్రాన్స్‌ఫ‌ర్ (డీబీటీ) విధానం ద్వారా లబ్దిదారుల ఖాతాలోని నేరుగా రాయితీ సొమ్ము జమ చేయడం జరుగుతుంది. ఈ పథకం అమల్లో లబ్దిదారులకు ఏదైనా సమస్యలు ఎదురైతే టోల్ ఫ్రీ నెం.1967 కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసుకునే సౌల‌భ్యం కూడా ఉంది.

రిపోర్టింగ్ : జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

సంబంధిత కథనం