అక్రమ మైనింగ్ కేసు, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి అరెస్ట్-ap former minister kakani govardhan reddy arrested in illegal mining case ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  అక్రమ మైనింగ్ కేసు, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి అరెస్ట్

అక్రమ మైనింగ్ కేసు, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి అరెస్ట్

అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డిని ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. గత కొంత కాలంగా పరారీలో ఉన్న కాకాణిని కేరళలో అదుపులోకి తీసుకున్నారు.

అక్రమ మైనింగ్ కేసు, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి అరెస్ట్

వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. అక్రమ మైనింగ్ కేసులో కాకాణిని ఏపీ పోలీసులు కేరళలో అదుపులోకి తీసుకున్నారు. క్వార్ట్జ్‌ అక్రమ తవ్వకాలు, రవాణా, నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాల వినియోగం పొదలకూరు పోలీసు స్టేషన్‌లో కాకాణిపై ఈ ఏడాది ఫిబ్రవరిలో కేసు నమోదైంది.

అరెస్టు భయంతో పరారీ

ఈ కేసులో అరెస్టు భయంతో గత కొంతకాలంగా కాకాణి పరారీలో ఉన్నారు. ఆయన కేరళలో ఉన్నట్లు సమాచారం రావడంతో పోలీసులు అక్కడికి వెళ్లి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. రేపు ఉదయం కాకాణిని నెల్లూరు తీసుకొచ్చే అవకాశం ఉంది.

వైసీపీ ప్రభుత్వం హయాంలో నెల్లూరు జిల్లా వరదాపురం సమీపంలో ప్రభుత్వ భూమిలో భారీగా క్వార్ట్జ్‌ ఖనిజాన్ని అక్రమంగా తవ్వి తరలించారని మైనింగ్‌ అధికారి ఇచ్చిన ఫిర్యాదుతో ఫిబ్రవరి 16న పొదలకూరు పోలీసులు కేసు నమోదు చేశారు.

అక్రమ మైనింగ్

క్వార్ట్జ్ ఖనిజం తవ్వకానికి అనుమతులు లేకుండా పేలుడు పదార్థాలు వినియోగించారని మైనింగ్‌ అధికారి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. పేలుళ్లపై ప్రశ్నించిన గిరిజనులను తన అనుచరులతో బెదిరించారని తెలిపారు. ఈ కేసులో ఏ4గా ఉన్న కాకాణి, ముందస్తు బెయిల్, కేసు కొట్టివేయాలని హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

కోర్టుల్లో లభించిన ఊరట

హైకోర్టు, సుప్రీంకోర్టులో కాకాణికి ఊరట లభించలేదు. దీంతో గత రెండు నెలలుగా ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆయన పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా కేరళలో కాకాణిని ఏపీ పోలీసులు అరెస్టు చేశారు.

రూ.250 కోట్ల విలువైన ఖనిజం అక్రమ రవాణా

వైసీపీ హయాంలో రూ.250 కోట్ల విలువైన క్వార్ట్జ్ ఖనిజాన్ని అక్రమంగా రవాణా చేశారని ఆరోపణలు వచ్చాయి. క్వార్ట్జ్ గని లీజు కాలం ముగిసినా కూడా వైసీపీ నేతలు ఆక్రమించుకుని మైనింగ్ చేశారని ఆరోపణలు రాగా అధికారులు విచారణ చేపట్టారు. దీంతో పాటు రాళ్లను పేల్చేందుకు నిబంధనలకు విరుద్ధంగా పెద్దఎత్తున పేలుడు పదార్థాలను నిల్వ చేసి ఉపయోగించారని మైనింగ్ అధికారుల విచారణలో తెలింసింది.

మూడుసార్లు నోటీసులు

దీంతో అధికారులు ఫిబ్రవరి 16న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డితో పాటు పలువురిపై ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇందులో కాకాణి గోవర్థన్ రెడ్డిని ఏ4గా చేరుస్తూ విచారణకు రావాలని పోలీసులు మూడుసార్లు నోటీసులు ఇచ్చారు. నెల్లూరుతో పాటు హైదరాబాద్ లోని ఆయన నివాసాలకు వెళ్లి నోటీసులు ఇచ్చారు.

అయితే కాకాణి మూడుసార్లు విచారణకు గైర్హాజరు అయ్యారు. కోర్టుల్లో బెయిల్ కోసం ప్రయత్నిస్తూ...గత రెండు నెలలుగా పరారీలో ఉన్నారు. కోర్టుల్లో కూడా కాకాణికి వ్యతిరేకంగా తీర్పులు రావడంతో... ఎట్టకేలకు కేరళలో పోలీసులు అరెస్ట్ చేశారు.

బండారు.సత్యప్రసాద్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. అలాగే ఆరోగ్యం, విద్యా ఉద్యోగ, లైఫ్ స్టైల్ వార్తలు రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం