Andhra Capital Issue : మూడు కాదు…. విశాఖ మాత్రమే రాజధాని…బుగ్గన
Andhra Capital Issue ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులనే విషయంలో అంతా పొరబడుతున్నారని విశాఖ మాత్రమే ఏపీ రాజధానిగా ఉంటుందని ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యానించారు. విశాఖలో జరిగే గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా బెంగుళూరులో నిర్వహించిన రోడ్ షోలో బుగ్గన పారిశ్రామకవేత్తల సందేహాలను నివృత్తి చేశారు. కర్ణాటకలోని బెలగావిలో శాసనసభ నిర్వహిస్తున్నట్లే అమరావతిలో కూడా శాసనసభ జరుగుతుందన్నారు. ప్రాంతీయ ఆకాంక్షలను నెరవెర్చే క్రమంలో అన్ని ప్రాంతాలకు కార్యకలాపాలను విస్తరించాలన్నది ప్రభుత్వ యోచనగా చెప్పారు.

Andhra Capital Issue ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులంటూ అంతా పొరబడుతున్నారని, విశాఖపట్నం మాత్రమే ఏపీకి శాశ్వత రాజధానిగా ఉంటుందని ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బెంగుళూరులో స్పష్టం చేశారు. పారిశ్రామిక వేత్తలు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చిన బుగ్గన సమాచారలోపంతోనే ఏపీకి మూడు రాజధానుల ప్రచారం జరిగిందని, విశాఖ మాత్రమే ఏపీకి రాజధానిగా ఉంటుందని చెప్పారు.
రాష్ట్ర విభజన జరిగిన తర్వాత విశాఖపట్నాన్ని రాజధాని చేయాలని భావించినా రాజకీయ కారణాలతోనే దానిని పక్కన పెట్టారని బుగ్గన చెప్పారు. ఏపీకి మూడు రాజధానులు ఉన్నాయన్న అంశం పూర్తిగా తప్పుడు సమాచారమని.. రాష్ట్ర పాలన అంతా విశాఖ నుంచే నిర్వహించాలని తమ ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన తెలిపారు. గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్ సన్నాహక ప్రచారంలో భాగంగా పెట్టుబడుదారులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు.
పరిపాలనా మొత్తం విశాఖ నుంచి నడపాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించినట్లు బుగ్గన చెప్పారు. విశాఖలో ఇప్పటికే ఉన్న మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండటంతో పాటు, అన్ని విధాలుగా అనువుగా ఉంటుందని చెప్పారు. పోర్టులు అందుబాటులో ఉండటంతో పాటు కాస్మోపాలిటిన్ వాతావరణం రాజధాని ఏర్పాటుకు అనువైన విధంగా ఉంటుందని చెప్పారు. ఏపీలో రాజధానికి అన్ని విధాలుగా అనువైన వాతావరణం విశాఖలో మాత్రమే ఉందని బుగ్గన చెప్పారు.
గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం రకరకాల కారణాలతో విశాఖపట్నాన్ని పక్కన పెట్టిందని, 2019 తర్వాత రాజధాని తరలించాలని భావించినా రకరకాల కారణాలతో అది సాద్యపడలేదన్నారు. కోవిడ్‌తో పాటు ఇతర అంశాలు ప్రభావితం చూపాయని బుగ్గన చెప్పారు. రాజధానికి అన్ని విధాలుగా అనువైన వాతావరణం విశాఖపట్నంలో మాత్రమే ఉందని చెప్పారు.
కర్ణాటకలోని ధార్వాడ్, గుల్బార్గాల్లో హైకోర్టు బెంచ్‌లు ఉన్నట్టే, కర్నూలులో హైకోర్టు కార్యకలాపాలకు సంబంధించిన డిమాండ్ వందేళ్లకు పైగా ఉందని బుగ్గన చెప్పారు. 1937లోనే శ్రీభాగ్ ఒప్పందం జరిగిందని, అన్ని ప్రాంతాలకు తగిన ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో ఈ ఒప్పందం చేసుకున్నారని, పరిపాలనా ఆంధ్రా ప్రాంతం నుంచి జరిగితే న్యాయ కార్యకలాపాలు కర్నూలు నుంచి జరగాలనే ఒప్పందం ఉందన్నారు.
అందులో భాగంగానే కర్నూలు జ్యూడిషియల్ క్యాపిటల్ ఏర్పాటు చేయాలనుకున్నామని చెప్పారు. గుంటూరులో కూడా శాసనసభా కార్యకలాపాలను నిర్వహించాలని భావిస్తున్నామని, కర్ణాటకలో కూడా ఇలా చేస్తున్నారని గుర్తు చేశారు. మిగిలిన ప్రాంతాలను ఎందుకు ఎంపిక చేయలేదనే ప్రశ్నకు గుల్బర్గా, బీదర్ వంటి ప్రాంతాల్లో డిమాండ్లు ఉన్నా కర్ణాటక ఎందుకు చేయలేకపోయిందో అలాంటి కారణాలతోనే ఏపీలో కూడా కొన్ని ప్రతికూలతల వల్ల ఇతర ప్రాంతాల ఎంపిక సాధ్యపడదలేదని బుగ్గన చెప్పారు.
పెట్టుబడులకు పుష్కల అవకాశాలు….
పారిశ్రామికాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ నలుదిక్కులా..పుష్కలంగా అవకాశాలున్నాయని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోపల, వెలుపలా రవాణా ఖర్చు తగ్గించేందుకు 'ఇన్ లాండ్ వాటర్ వే పాలసీ'ని తీసుకొస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే 27 ప్రాంతాలను గుర్తించామన్నారు. 2029 కల్లా 10 మిలియన్ టన్నుల సామర్థ్యంతో నిర్వహించేలా ముందుకెళుతున్నట్లు మంత్రి వివరించారు.
ఏపీలో 26 నైపుణ్య కళాశాలల అభివృద్ధి దిశగా అడుగులు పడ్డాయని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పేర్కొన్నారు. బెంగళూరులోని ఐటీసీ హోటల్ వేదికగా మంగళవారం జరిగిన ఇండస్ట్రియల్ మీట్ లో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ మౌలిక సదుపాయాలు, మానవవనరులే పెట్టుబడులకు పునాది అని తెలిపారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పారిశ్రామిక ప్రదేశ్ గా తీర్చిదిద్దుతామన్నారు.
వైజాగ్ లాంటి ప్రాంతం భూమ్మీద ఎక్కడా దొరకదని మంత్రి బుగ్గన వెల్లడించారు. అన్ని రంగాలకు, అన్ని రకాల పరిశ్రమల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ లో అవకాశాలున్నాయన్నారు.ఏపీ ప్రభుత్వం ప్రధానంగా విద్య, నైపుణ్యం, గృహ నిర్మాణం, వైద్య రంగాలకు ప్రాధాన్యతనిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. వ్యాపారంలో భాగంగా దేశవ్యాప్తంగా చుట్టి వచ్చిన పాతికేళ్ల క్రితం కాలంలో, చాలా తక్కువ పరిశ్రమలు మాత్రమే ఉండేవన్నారు.
ఇప్పుడు పరిశ్రమల హబ్ లు గా ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్ కత్తా వంటి ప్రధాన నగరాలు తయారయ్యాయన్నారు. సామాజిక, ఆర్థిక , పర్యావరణ ప్రమాణాల ఆధారంగా నీతి ఆయోగ్ ప్రకటించిన అనువైన వాతావరణమున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ది నాలుగో స్థానమన్నారు. పారిశ్రామిక అభివృద్ధికి అవసరమైన విస్తారమైన ల్యాండ్ బ్యాంక్ ఏపీ సొంతమన్నారు. ఆంధ్రప్రదేశ్ బల్క్ డ్రగ్ పార్క్‌ను అభివృద్ధి చేస్తోందన్నారు.