AP Electricity Charges Hike : ఏపీ ప్రజలకు కూటమి సర్కార్ కరెంట్ షాక్, విద్యుత్ ఛార్జీల పెంపునకు ప్రతిపాదనలు-ap discoms suggested electricity charges hike proposals to aperc on trup charges adjust ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Electricity Charges Hike : ఏపీ ప్రజలకు కూటమి సర్కార్ కరెంట్ షాక్, విద్యుత్ ఛార్జీల పెంపునకు ప్రతిపాదనలు

AP Electricity Charges Hike : ఏపీ ప్రజలకు కూటమి సర్కార్ కరెంట్ షాక్, విద్యుత్ ఛార్జీల పెంపునకు ప్రతిపాదనలు

Bandaru Satyaprasad HT Telugu
Nov 04, 2024 04:01 PM IST

AP Electricity Charges Hike : ఏపీ ప్రజలపై విద్యుత్ భారం పడనుంది. విద్యుత్ ఛార్జీలు పెంచేందుకు డిస్కమ్ లు ఈఆర్సీకి ప్రతిపాదనలు పంపాయి. ఈ ప్రతిపాదనలను ఈఆర్సీ బహిర్గతం చేసింది. విద్యుత్ ఛార్జీల పెంపుపై ఈ నెల 19లోపు అభ్యంతరాలు తెలపాలని కోరింది.

ఏపీ ప్రజలకు కూటమి సర్కార్ కరెంట్ షాక్, విద్యుత్ ఛార్జీల పెంపునకు ప్రతిపాదనలు
ఏపీ ప్రజలకు కూటమి సర్కార్ కరెంట్ షాక్, విద్యుత్ ఛార్జీల పెంపునకు ప్రతిపాదనలు

ఏపీ ప్రజలకు కూటమి సర్కార్ కరెంట్ ఛార్జీల షాక్ ఇవ్వనుంది. విద్యుత్ ఛార్జీల పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సమాచారం. అధికార పార్టీలు గత ప్రభుత్వం వైఫల్యం వల్ల విద్యుత్ ఛార్జీలు పెంచాల్సి వస్తుందని అంటున్నాయి. ప్రతిపక్ష వైసీపీ మాత్రం కూటమి ప్రభుత్వం బాదుడు మొదలుపెట్టిందని ఆరోపిస్తుంది.

రూ.11,826 కోట్ల ట్రూ అప్ ఛార్జీలు

ప్రజలకు విద్యుత్ భారం పడనుంది. రాష్ట్రంలో ట్రూ అప్ ఛార్జీలు పెంచనున్నట్లు తెలుస్తోంది. ఇంధన సర్దుబాటు ఛార్జీల కింద డిస్కమ్‌లు రూ. 11,826 కోట్ల ప్రతిపాదనలను ఏపీఈఆర్సీకి పంపినట్లు సమాచారం. 2023-24 సంవత్సరానికి సంబంధించి ఛార్జీల పెంపు ప్రతిపాదనలు డిస్కమ్ లు ఈఆర్‌సీకి పంపాయి. ఈ ప్రతిపాదనలపై ఈ నెల 19వ తేదీలోపు లిఖిత పూర్వక అభ్యంతరాలు తెలియజేయాలని ఏపీఈఆర్‌సీ కోరింది. అయితే 2022-23 సంవత్సరానికి ఇంధన సర్దుబాటు పేరుతో రూ. 6200 కోట్లకు ఈఆర్‌సీ ఆమోదం తెలిపింది. బాదుడే బాదుడు అంటూ గత ప్రభుత్వంపై విమర్శలు చేసిన కూటమి పార్టీలు అధికారంలోకి రాగానే విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నాయని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. విద్యుత్ ఛార్జీల పెంపుపై వామపక్షాలు, విద్యుత్ వినియోగాదారుల సంఘాలు ఆందోళన చేస్తున్నాయి.

రూ.17 వేల కోట్ల భారం

అధిక ధరలతో ఒక వైపు, ఆదాయాలు తరిగిపోయి మరో వైపు సతమతమవున్న ప్రజలపై రాష్ట్ర ప్రభుత్వం తాజాగా 11 వేల కోట్ల రూపాయలు, గతంలో రూ.6 వేల కోట్లు మొత్తం రూ.17 వేల కోట్ల ట్రూ అప్ ఛార్జీల భారం వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సీపీఎం ఓ ప్రకటన తెలిపింది. ప్రభుత్వం వెంటనే ఆ ప్రతిపాదనను ఉపసంహరించాలని డిమాండ్ చేసింది. 2023-24 సంవత్సరానికి FPPCA ఛార్జీల పేరిట ట్రూ అప్ ఛార్జీలు పెంపు ప్రతిపాదిస్తూ మూడు విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్ లు) సోమవారం నోటిఫికేషన్లు ఇచ్చాయి. ఇటీవల వేసిన రూ. 6,072 కోట్ల ట్రూ అప్ భారం ఇంకా అమలులోకి రాక ముందే అంతకు రెట్టింపు భారాన్ని ప్రజలపై మోపడం దారుణమని సీపీఎం మండిపడింది. మొత్తం కలిపి 17 వేల కోట్ల రూపాయల భారం ప్రజలపై మోపడం సరికాదంది. తాజా ప్రతిపాదనలో యూనిట్ విద్యుత్ కు గరిష్టంగా రెండున్నర రూపాయలు వడ్డిస్తున్నారని ఆరోపించింది.

"నిరుపేద గృహస్తులు యూనిట్ కి చెల్లించే 1.90 పైసలకు ఇది 130 శాతం అధికం. డిస్కముల ప్రకటనలో మొత్తం ఎంత భారం వేశారో, అది ఎందుకు అవసరం అయ్యిందో కనీసం ఒక్క వాక్యం కూడా ఇవ్వకపోవడం ప్రజలను మోసగించడమే. ఉన్న ప్రభుత్వ జెన్కో ప్లాంట్ల నుంచి కరెంటు తీసుకోకుండా అధిక ధరలకు ఓపెన్ మార్కెట్ లో కొనుగోలు చేయడం ఇందుకు ముఖ్య కారణం. ప్రైవేట్ కంపెనీలకు అడ్డగోలుగా చెల్లింపులు చేయడం మరోకారణం. ప్రభుత్వాల తప్పుడు విధానాలు, అవినీతి, అక్రమాలకు ప్రజలను బలి చేయడం తగదు. ప్రభుత్వం చేసిన తప్పులకు ప్రజలు భారాలు మోయాలనడం అసంబద్ధం. మోసపూరితమైన ట్రూ అప్ విధానాన్ని రద్దు చేయాలని, మొత్తం 17 వేల కోట్ల రూపాయల ట్రూఅప్ భారాన్ని ఉపసంహరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం"-సీపీఎం రాష్ట్ర కమిటీ

Whats_app_banner

సంబంధిత కథనం