DGP : సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులపై డీజీపీ వార్నింగ్, రౌడీ షీట్ల తరహాలో సైబర్ షీట్లు తెరుస్తామని ప్రకటన
DGP Dwaraka Tirumalarao : 2024లో సైబర్ క్రైమ్ కు సంబంధించి 916 కేసులు నమోదు చేశామని డీజీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు. ఈ ఏడాది సైబర్ కేటుగాళ్లు రూ. 1229 కోట్లు కొట్టేశారన్నారు. డిజిటల్ అరెస్టు అనేదే లేదన్నారు.
DGP Dwaraka Tirumalarao : 2025 మార్చి 31 తేదీనాటికి పోలీసు కమాండ్ కంట్రోల్ తో 1 లక్ష సీసీ కెమెరాలు అనుసంధానిస్తామని డీజీపీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు అన్నారు. ప్రజల భాగస్వామ్యంతో ఇప్పటికే 25 వేల పై చిలుకు సీసీ కెమెరాలను నేర నియంత్రణకు వినియోగిస్తున్నామన్నారు. శనివారం విజయవాడలో మాట్లాడిన ఆయన...గతంతో పోలిస్తే సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయని అన్నారు. ఈ ఏడాదిలో సైబర్ క్రైమ్ కు సంబంధించి 916 కేసులు నమోదు చేశామన్నారు. మొత్తంగా రూ.1229 కోట్ల మేర నగదు సైబర్ నేరాల ద్వారా చోరీ చేశారన్నారు. డిజిటల్ అరెస్టు అనేది అసలు లేదని, అలాంటి కాల్స్ ను విశ్వసించొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. కొత్తగా ప్రతీ జిల్లాలోనూ సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
"గంజాయి, డ్రగ్స్ కేసుల వ్యవహారంలో ఈగల్ వ్యవస్థ ప్రజల్లోకి బలంగానే వెళ్తోంది. 10 వేల 380 ఎకరాల్లో గంజాయిని ధ్వంసం చేసి ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాల్సిందిగా గిరిజనులకు అవగాహన కల్పిస్తున్నాం. స్మార్ట్ పోలీసింగ్ లో భాగంగా దేశంలోనే తొలిసారి ఏపీలో స్మార్ట్ పోలీస్ ఏఐ వినియోగిస్తున్నాం. ప్రస్తుతం ఏలూరు జిల్లా పోలీసులు ఈ స్మార్ట్ పోలీస్ ఏఐను ప్రారంభించారు. నేర నమోదు నుంచి కేసు విచారణ వరకూ ఈ స్మార్ట్ పోలీస్ ఏఐ విచారణాధికారికి సహకరిస్తుంది" -డీజీపీ ద్వారకా తిరుమలరావు
సోషల్ మీడియా అభ్యంతరకర పోస్టులపై 572 కేసులు
ట్రాఫిక్, క్రౌడ్ మేనేజ్మెంట్ కోసం విజయవాడ పోలీసులు ఏఐ వజ్రాస్త్రం పేరిట ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత వినియోగిస్తున్నారని డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా గ్రేహౌండ్స్, పోలీసు ట్రైనింగ్ అకాడమీ, ఏపీ పోలీస్ అకాడమీ(అప్పా) కోసం స్థల సేకరణ చేశామన్నారు. అప్పా ఏలూరు సమీపంలో, గ్రేహౌండ్స్ కొత్తవలస వద్ద ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. డిప్యూటీ సీఎం భద్రతా వలయంలోకి నకిలీ ఐపీఎస్ రావటంపై విచారణ చేస్తున్నామన్నారు. అది భద్రతాపరమైన లోటు కాదని భావిస్తున్నామన్నారు. భూకబ్జాలు, ఇసుక అక్రమ తవ్వకాలు, చౌక బియ్యం అక్రమ రవాణాలపై పీడీయాక్టు నమోదు చేస్తున్నామన్నారు. సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులపై ఇప్పటి వరకూ 572 కేసులు నమోదు చేశామన్నారు. ఈ కేసుల్లో రౌడీషీట్ లాగే నిందితులపై సైబర్ షీట్ లను నమోదు చేస్తున్నామని డీజీపీ సీహెచ్ ద్వారకా తిరుమల రావు తెలిపారు.