"2029లో మీరు ఎలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం' - వైసీపీ నేతలకు డిప్యూటీ సీఎం పవన్ కౌంటర్-ap deputy cm pawan kalyan strong counter to ysrcp leaders comments about 2029 elections ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  "2029లో మీరు ఎలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం' - వైసీపీ నేతలకు డిప్యూటీ సీఎం పవన్ కౌంటర్

"2029లో మీరు ఎలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం' - వైసీపీ నేతలకు డిప్యూటీ సీఎం పవన్ కౌంటర్

2029లో అధికారంలోకి వస్తామంటూ వైసీపీ నేతల చేస్తున్న వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. అధికారంలోకి వస్తే రంపాలు తెస్తాం, కుత్తుకలు కోసేస్తాం అని చెప్పే మాటలకు భయపడేవాళ్ళం కాదన్నారు. అసలు వాళ్లు ఎలా అధికారంలోకి వస్తారో తాము కూడా చూస్తామని వ్యాఖ్యానించారు.

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (ఫైల్ ఫొటో)

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రకాశం జిల్లాల్లో పర్యటించారు. మార్కాపురంలో రూ.1290 కోట్ల విలువైన తాగు నీటి పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన… చిన్నతనంలో రెండేళ్లపాటు తాను ప్రకాశం జిల్లాలో ఉన్నానని గుర్తు చేశారు. అప్పటి నుండి ఇప్పటికీ తాగు నీటి సమస్య ఉందన్నారు. ఫ్లోరైడ్ సమస్యతో మోకాళ్ళు, వెన్నెముకలు ఒంగిపోయే పరిస్థితి ఉందని చెప్పుకొచ్చారు.

ఎలా వస్తారో మేమూ చూస్తాం - డిప్యూటీ సీఎం పవన్

“గత ప్రభుత్వం మీకు ఏం చేసింది ఎలా ప్రవర్తించారో మీకు తెలుసు ప్రకాశం జిల్లాకు సంబంధించి వెలిగొండ ప్రాజెక్టుకు 4000 కోట్ల రూపాయలు కావాలి. వాళ్ళు రాష్ట్రంపైన లక్షల కోట్ల అప్పులు తీసుకున్నారు కానీ మనకొక ప్రాజెక్టు తేలేకపోయారు. గత పాలకులు మళ్ళీ రౌడీయిజం, గుండాగర్ది చేసే భావనలోనే ఉన్నారు. వీటికి భయపడితే మనం రాజకీయాల్లోకి వస్తామా! 2029 లో వస్తే మీ అంతు చూస్తాం అంటే.. అసలంటూ మీరు రావాలి కదా..! మీరు ఎలా వస్తారో మేమూ చూస్తాం” అంటూ వైసీపీ నేతలను ఉద్దేశిస్తూ పవన్ కౌంటర్ ఇచ్చారు.

వ్యక్తిగత కక్షలు లేవు…

“నాకు వైసీపీలో ఎవరిపైనా వ్యక్తిగత కక్షలు లేవు. కానీ సగటు మనిషిని భయభ్రాంతులకు గురి చేస్తే సహించేది లేదు. దాన్ని ఎదుర్కునే కదా ఇక్కడి వరకు వచ్చాం. మీకు 151 సీట్లు వచ్చి, నేను రెండు చోట్లా ఓడిపోయినప్పుడే కదా మేము బలంగా ఎదుర్కుని నిలబడింది. అంటే గుండెల్లో ఎంత దమ్ముండాలి మీలాంటోల్లని ఎదుర్కొన్నాం అంటే…! 11 సీట్లు వచ్చిన పార్టీగా మీకు గౌరవం ఇస్తున్నాం. తప్పొప్పులు ఉంటే చెప్పండి సరిచేసుకుంటాం. లేదా వివరణ ఇస్తాం. అంతే కానీ రంపాలు తెస్తాం, కుత్తుకలు కోసేస్తాం అంటే అలాంటి తాటాకు చప్పుళ్లకు మేము భయపడేవాళ్లం కాదు” అని డిప్యూటీ సీఎం పవన్ కామెంట్స్ చేశారు.

“జల్ జీవన్ మిషన్ కి 2019 నుండి 2024 వరకు మోదీ సర్కార్ ప్రభుత్వం మన రాష్ట్రానికి 26,000 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. వీళ్లు దానిలో 4000 కోట్లు ఖర్చు చేశారు. పోనీ కనీసం కొన్ని ఊర్లకైన దాహం తీర్చారా అంటే లేదు.. నీటి మూలం లేకుండా ఉత్తినే పైప్ లు వేశారు ఎగుడు దిగుడుగా ఇష్టమొచ్చినట్టు. అలా 4000 కోట్లు వృధా చేశారు. 18 మండలాలు, 578 గ్రామాలు, దాదాపు 10 లక్షల పైన జనానికి వచ్చే 30 సంవత్సరాల పాటు ఈ పథకం ద్వారా తాగు నీరు అందించబోతున్నాం. ప్రజలకు మంచి నీరు అందించే కార్యక్రమాన్ని పూర్తిగా గత పాలకులు అటకెక్కించారు. చివర్లో ఇంకా ఓడిపోతున్నాం అనుకునే దశలో ఒక శిలాఫలకం వేశారు” అని పవన్ కల్యాణ్ దుయ్యబట్టారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.