ఏపీలో ఉగ్రవాద కదలికలపై అప్రమత్తంగా ఉండండి-సీఎస్, డీజీపీలకు పవన్ కల్యాణ్ లేఖ-ap deputy cm pawan kalyan letter warns terrorist movements alerts cs dgp ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  ఏపీలో ఉగ్రవాద కదలికలపై అప్రమత్తంగా ఉండండి-సీఎస్, డీజీపీలకు పవన్ కల్యాణ్ లేఖ

ఏపీలో ఉగ్రవాద కదలికలపై అప్రమత్తంగా ఉండండి-సీఎస్, డీజీపీలకు పవన్ కల్యాణ్ లేఖ

ఏపీ ఉగ్రవాద కదలికలపై మరింత అప్రమత్తంగా ఉండాలని సీఎస్, డీజీపీలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచించారు. ఈ మేరకు ఆయన ఓ లేఖ రాశారు. రాష్ట్ర అంతర్గత భద్రతపై జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

ఏపీలో ఉగ్రవాద కదలికలపై అప్రమత్తంగా ఉండండి-సీఎస్, డీజీపీలకు పవన్ కల్యాణ్ లేఖ

విజయనగరంలో ఉగ్రవాదులతో సంబంధం కలిగిన ఓ యువకుడిని నిఘా వర్గాలు అరెస్టు చేశాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్...సీఎస్, డీజీపీలకు లేఖ రాశారు.

స్లీపర్ సెల్స్ పై దృష్టి పెట్టండి

ఆంధ్రప్రదేశ్ లో ఉగ్రవాద కదలికలపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తీర ప్రాంత జిల్లాల్లో ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు.

రోహింగ్యాలు, ఉగ్రవాద మద్దతుదారులు, సానుభూతిపరులు, స్లీపర్‌ సెల్స్‌పై దృష్టి పెట్టాలని కోరారు. రాష్ట్ర అంతర్గత భద్రతపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దేశ భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.

అప్రమత్తత అవసరం

ఆపరేషన్ సిందూర్ అనంతరం ఏపీలో ఉగ్రవాద కదలికలపై నిరంతర అప్రమత్తత అవసరమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. విజయనగరంలో ఒక యువకుడికి ఐసిస్ తో సంబంధాలున్నాయని, పేలుళ్లకు కుట్ర పన్నిన విషయాన్ని నిఘా వర్గాలు గుర్తించి, అరెస్టు చేశాయన్నారు.

ఉగ్రవాద జాడలు కనిపిస్తే

ఈ క్రమంలో ఏపీ పోలీసులు మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఉగ్రవాద సానుభూతిపరులు, స్లీపర్ సెల్స్, అక్రమ వలసదారుల కదలికలపై అన్ని జిల్లాల అధికారులు నిఘా పెట్టాలని కోరారు. ఎక్కడైనా ఉగ్రవాద జాడలు కనిపిస్తే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు.

తీర ప్రాంత జిల్లాల పరిధిలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని పవన్ కల్యాణ్ సూచించారు. పోలీసు యంత్రాంగం శాంతిభద్రతలతో పాటు అంతర్గత భద్రతపై దృష్టి సారించాలన్నారు.

జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉగ్రవాద కదలికలు, వారి సానుభూతిపరుల జాడలపై అప్రమత్తంగా ఉండాలని పోలీస్ శాఖ, పరిపాలనా శాఖలకు సూచించారు.

పహల్గాం ఉగ్ర దాడులు, తదనంతర పరిణామాలతో దేశ అంతర్గత భద్రతపై తగిన జాగ్రత్తలు తీసుకునే విషయంలో రాష్ట్రంలోని అక్రమ వలసదారులు, ఉగ్రవాద సానుభూతిపరులపై ఇప్పటి వరకూ ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారాన్ని అనుసరించి మరింత లోతుగా విచారణ చేపట్టాలని కోరారు.

స్లీపర్ సెల్స్ ను గుర్తించేందుకు చర్యలు

గతంలో రాష్ట్రంలో ఏవైనా ఉగ్ర కార్యకలాపాల్లో పాల్గొన్న వారిపై పూర్తి స్థాయి అప్రమత్తత అవసరం అని.. ఉత్తరాంధ్ర, గోదావరి, మన్యం జిల్లాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు. స్లీపర్ సెల్స్, తీవ్రవాద సానుభూతిపరుల ఉనికిని గుర్తించేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు.

అనుమానాస్పద కార్యకలాపాలపై నిఘా ఉంచి తక్షణం తీసుకోవాల్సిన చర్యలపై ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని తెలిపారు.

రోహింగ్యాల ఉనికిపై సమగ్ర దర్యాప్తు

ఈ లేఖల్లో రోహింగ్యాలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. గుంటూరుతోపాటు ఇతర జిల్లాల్లోనూ రోహింగ్యాల ఉనికిపై సమగ్ర దర్యాప్తు జరపాలని కోరారు. వీరిలో కొందరికి రేషన్, ఆధార్, ఓటర్ కార్డులు ఉన్నాయనే సమాచారం వస్తోంది.. ఇది ఆందోళనకర పరిణామం అని తెలిపారు. ఈ క్రమంలో కొన్ని సూచనలు చేశారు.

అనుమానితులపై దృష్టి సారించండి

అనుమానితుల ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడీ మొదలైన గుర్తింపు పత్రాలు కలిగి ఉన్నారా? లేదా? అనుమానిత వ్యక్తులు ప్రభుత్వ శాఖల నుంచి ఐడీ కార్డులు, ధ్రువపత్రాలు పొంది ఉంటే వాటిని ఎలా పొందారు? వారికి ఆశ్రయం ఎవరు ఇచ్చారు? స్థానికంగా వారికి ఎవరు సౌకర్యాలు కల్పిస్తున్నారు? వారికి సహకరిస్తున్న వ్యక్తులు, సంస్థల గుర్తింపు తదితర అంశాలపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని స్పష్టం చేశారు.

గతేడాది ఎన్ఐఏ దాడులు

జాతీయ భద్రత, ప్రజల భద్రతను అత్యంత ప్రాధాన్యంతాంశంగా పరిగణించి తక్షణం చర్యలు తీసుకోవాలన్నారు. కొన్నేళ్ల కిందట గుంటూరు, గతేడాది రాయలసీమ ప్రాంతాల్లో ఎన్.ఐ.ఏ. దాడులు చేసి అనుమానితులను అదుపులోకి తీసుకొంది. ఈ విషయాన్నీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు గమనంలోకి తీసుకోవాలని సూచించారు.

దేశ భద్రత, రక్షణ అనేవి ఈ తరుణంలో అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్నవని చెబుతూ...రాష్ట్ర పోలీసు యంత్రాంగం శాంతిభద్రతలతోపాటు అంతర్గత భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తే కేంద్ర ప్రభుత్వ చర్యలకి రాష్ట్రం సహకారం తోడవుతుందన్నారు.

బండారు.సత్యప్రసాద్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. అలాగే ఆరోగ్యం, విద్యా ఉద్యోగ, లైఫ్ స్టైల్ వార్తలు రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం