Deputy CM Pawan : సెఫ్టీ అడిట్ అంటే పరిశ్రమలు మూసివేస్తారనే భయం ఉంది - పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
అచ్యుతాపురం సెజ్ ప్రమాద ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ప్రమాదం చాలా బాధాకరమన్నారు. అచ్యుతాపురం ప్రమాదం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు శాఖ కిందకు రాదన్నారు. అన్ని పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ చేయాలని మొదట్లోనే చెప్పాననని.. అలా చేస్తే పరిశ్రమలు మూసేస్తారనే భయం యజమానులలో ఉందని వ్యాఖ్యానించారు.
అచ్యుతాపురం ప్రమాదం చాలా బాధాకరమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. గురువారం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో మీడియాతో మాట్లాడిన… అచ్యుతాపురం ప్రమాదం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు శాఖ కిందకు రాదని చెప్పారు. అన్ని పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ చేయాలని మొదట్లోనే చెప్పానని గుర్తు చేశారు. అయితే సేఫ్టీ ఆడిట్ చేస్తే పరిశ్రమలు మూసేస్తారనే భయం యజమానులలో ఉందని కామెంట్స్ చేశారు.
కార్మికుల భద్రత నేపథ్యంలోనే సెఫ్టీ అడిట్ చేయాలని భావిస్తున్నప్పటికీ యజమానులు మాత్రం మరోలా అర్థం చేసుకునే పరిస్థితులు ఉన్నాయని అన్నారు. ముఖ్యంగా పరిశ్రమలు మూసివేస్తారా అన్న వదంతులు కూడా ప్రచారం చేసే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. సెఫ్టీ అడిట్ చేస్తే పరిశ్రమల్లో పని చేసే కార్మికులకు భద్రతపట్ల భరోసా ఇవ్వొచ్చన్నారు. తాను పదవీ బాధ్యతలు తీసుకున్న మొదట్లోనే వైజాగ్ ఏరియాలో పారిశ్రామికవేత్తలతో ఓ సమావేశాన్ని కూడా నిర్వహించానని పవన్ తెలిపారు. కార్మికుల భద్రతపై చర్చించానని, సెఫ్టీ అడిట్ అంశాన్ని ప్రస్తావించానని గుర్తు చేశారు. ఈ విషయంపై పారిశ్రామికవేత్తలకు మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.
"సెజ్ ప్రమాదంలో యాజమాన్యం నిర్లక్ష్యం ఉన్నట్లు తెలుసింది. ఇద్దరు యాజమానులు ఉన్నట్లు సమాచారం అందిందని… వారి మధ్య కూడా విబేధాలు ఉన్నట్లు తెలిసింది. గత నెలలో కూడా ఓ ప్రమాదం జరిగింది. కేవలం సంతాపం తెలిపి పరిహారం ఇవ్వడంతో సమస్య పరిష్కారం కాదు. రాబోయే మూడు నెలల్లో పరిశ్రమల భద్రతపై కార్యాచరణ సిద్ధం చేస్తాం" అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేస్తాం - పవన్ కల్యాణ్
ఎన్నికల సమయంలో NDA కూటమి ప్రభుత్వం ఏర్పరచిన వెంటనే పంచాయతీరాజ్ వ్యవస్థని బలోపేతం చేస్తామని మాట ఇచ్చామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గుర్తు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం… ఈ నెల 23వ తేదీన దేశంలోనే మునుపెన్నడూ జరగని విధంగా రాష్ట్రంలోని 13,326 పంచాయతీలలో 4,500 కోట్ల రూపాయిల నిధులతో 87 రకాల పనులను చేపడుతామన్నారు.
“9 కోట్ల పని దినాలతో 54 లక్షల కుటుంబాలకు ఉపాధి హామీ పథకం కోసం ఒకే రోజున గ్రామ సభలు నిర్వహించి తీర్మానాలు చేయబోతున్నాం. దేశంలోనే పంచాయతీ వ్యవస్థను ప్రవేశపెట్టిన రెండో రాష్ట్రం మనది. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించి మూడు దశాబ్దాలు దాటింది. ఇప్పుడు రెండో తరం సంస్కరణలతో పంచాయతీ మలి దశ విప్లవం మన ఆంధ్ర రాష్ట్రం నుంచే మొదలు పెడుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థలో తీసుకువస్తున్న సంస్కరణల కొనసాగింపుగా గ్రామ సభలను నిర్వహిస్తున్నాం. గ్రామ సభ అంటే పది మంది ఒక చోట చేరడం కాదు. గ్రామాభివృద్ధికి బాధ్యత తీసుకోవడం. మన గ్రామాన్ని మనమే పరిపాలించుకోవడం” అని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.
“రాష్ట్రవ్యాప్తంగా జరగనున్న గ్రామసభల్లో యువత, విద్యార్థులు, మహిళలు తప్పనిసరిగా పాల్గొనాల్సిందిగా పిలుపునిస్తున్నాను. ఏ ప్రాంతంలో ఉన్నా సరే మీ గ్రామాలకు చేరుకుని గ్రామసభల్లో మీ ఆలోచనలు తెలియజేసే అవకాశం వినియోగించుకోండి, మీ గ్రామాలను అభివృద్ది చేసుకోవడంలో భాగస్వాములు అవ్వండి” అని పవన్ కల్యాణ్ కోరారు.
సంబంధిత కథనం