AP Deputy CM Pawan : నాకు పరిపాలన అనుభవం లేదు, నేర్చుకోవడానికి సిద్ధమే - పవన్ కల్యాణ్
సినిమాలని, రాజకీయాలని చాలా ప్రత్యేకంగా చూస్తానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. మైసూరావారిపల్లి గ్రామసభలో మాట్లాడిన ఆయన.. సినిమాలకంటే సమాజమే ముఖ్యమని చెప్పుకొచ్చారు. తనకు ప్రజాదరణ ఉండొచ్చేమో కానీ పరిపాలన అనుభవం లేదని వ్యాఖ్యానించారు. ప్రజల కోసం పని చేయడానికి సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు.
పంచాయతీలు దేశ అభివృద్ధికి చాలా కీలకమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. అన్నమయ్య జిల్లా పర్యటించిన ఆయన.. మైసూర్‌వారి పల్లిలో నిర్వహించిన గ్రామసభలో ప్రసంగించారు. సినిమాలని, రాజకీయాలని చాలా ప్రత్యేకంగా చూస్తానని చెప్పిన ఆయన.. సినిమాలకంటే దేశమే ముఖ్యమన్నారు. సినిమాలకంటే సమాజం ముఖ్యమని వ్యాఖ్యానించారు.
“అబ్బాయికి చదువు నేర్పితే తను మాత్రమే ఎదుగుతాడు. ఆడబిడ్డకి చదువు నేర్పితే దేశం ఎదుగుతుంది. రాయలసీమ అంటే గొడవలు, కొట్లాటలు గుర్తు చేసుకుంటారు. కానీ నిజానికి రాయలసీమ చదువుల నేల. కోస్తా జిల్లాల్లో కన్నా ఎక్కువ గ్రంధాలయాలు ఉన్న నేల రాయలసీమ. నాకు ప్రజాదరణ ఉండొచ్చేమో కానీ పరిపాలన అనుభవం లేదు. నాకంటే బాగా ఆలోచించేవారికి.. నాకంటే రాష్ట్రము కోసం పనిచేసే వారి పక్కన నడవడానికి, నేర్చుకోవడానికి నేనేమి సంకోచించను. అనుభవజ్ఞుడు, పరిపాలనా దక్షత ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గర నేర్చుకోడానికి నేను సంసిద్ధంగానే ఉంటాను. తప్పా అదేదో తక్కువ అని భావించను” అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కామెంట్స్ చేశారు.
పదవులు తనకు అలంకారం కాదు బాధ్యత కాదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తాను నిరంతరం ప్రజల కోసం పనిచేయడానికి సంసిద్ధంగా ఉంటానని… అహర్నిశలు పని చేస్తానని అన్నారు.
“మన గ్రామంలో ఏమేమి ఉన్నాయి, ఏ మౌలిక సదుపాయాలు ఉన్నాయి, ఏమేమి కావాలి అనేవి కూర్చుని చర్చించుకుని, నిర్ణయం చేసుకోవడం గ్రామసభల ముఖ్య లక్ష్యం. ప్రభుత్వపరంగా పంచాయితీలకు ఆస్తులు లేకపోతే గ్రామం ఎప్పుడూ ప్రైవేట్ వ్యక్తుల దగ్గర దేహి అనాల్సిన పరిస్థితి. ఇవాళ మైసూరావారిపల్లి దుస్థితి ఏంటి అంటే పిల్లలకి ఆట స్థలం కోసం దాతలని అడుక్కోవాల్సిన వస్తుంది. నేను ఇప్పుడు చెప్తున్నా డిప్యూటీ సీఎం ఆఫీస్ నుండి నిధులు సమకూర్చి మైసూరావారిపల్లిలో పిల్లల కోసం ఆటస్థలం సమకూర్చే బాధ్యత నేను తీసుకుంటాను” అని పవన్ కల్యాణ్ హామీనిచ్చారు.
సీఎం దృష్టికి తీసుకెళ్తా - పవన్ కల్యాణ్
“బాధ్యత తీసుకోకపోతే నాలాంటివారు ఎంతమంది వచ్చినా మన రాష్ట్రాన్ని మార్చలేరు. అలా కాకుండా మీరు గ్రామ సభలకొచ్చి మాట్లాడితే మొత్తం సమూలంగా మారిపోతాయి. స్వయంపోషక పంచాయితీలు అవుతాయి. ఈ గ్రామ సభలో పగడాల లక్ష్మి అనే మహిళ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కావాలి అని అడిగింది. ఈ మాట ఒక్క పురుషుడు అడగలేదు ఈరోజు దాకా. అందుకే నేను స్త్రీ శక్తిని తక్కువ అంచనా వెయ్యను, స్త్రీ శక్తి లేకపోతే దేశమే ఆగిపోతుంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళతాను. రాయలసీమ నుండి వలసలు ఆగటానికి, ఇక్కడే అభివృద్ధి వచ్చేలాగా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఏర్పాటు ఆలోచనని ముందుకు తీసుకెళతాం” అని పవన్ తెలిపారు.