AP Rains Schools Holiday : ఏపీకి తుపాను ముప్పు, రాయలసీమలో అతి భారీ వర్షాలు-ఈ జిల్లాల్లో రేపు స్కూళ్లకు సెలవు
AP Rains Schools Holiday : రాగల 48 గంటల్లో అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దక్షిణకోస్తా, రాయలసీమలో అతిభారీ వర్ష సూచన చేసింది. భారీ వర్షాల నేపథ్యంలో అనంతపురం, చిత్తూరు, తిరుపతి, శ్రీసత్యసాయి జిల్లాల్లో రేపు స్కూళ్లకు సెలవు ప్రకటించారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. మరో 48 గంటల్లో అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. అల్పపీడనం ప్రభావంతో రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నెల 16, 17 తేదీలలో అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. కలెకర్ట్ ఆదేశాలతో విద్యాశాఖ అధికారులు ఈ ఉత్తర్వులు జారీ చేశారు. వాతావరణ పరిస్థితులు మెరుగుపడితే సెలవులను రద్దు చేస్తామన్నారు.
విద్యాసంస్థలకు సెలవు
అనంతపురం జిల్లా కలెక్టరేట్‌తో సహా అన్నిమండల కేంద్రాలలో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని అధికారులకు తెలిపారు. ఈ నెల 16, 17 తేదీలలో పల్లెపండుగ కార్యక్రమాలను స్థానిక నాయకులు మాట్లాడుకుని వాయిదా వేసుకోవాలని సూచించారు. అనంతపురం జిల్లాలో ప్రమాదకరంగా ఉన్న వంతెనలు, భవనాలను గుర్తించాలని, వారి సమీపంలోకి ఎవరిని వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
రేపు చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అన్ని స్కూళ్లు , కాలేజీలు కలెక్టర్లు సెలవు ప్రకటించారు. అన్ని విద్యాసంస్థలు తప్పనిసరిగా సెలవు ఇవ్వాలని ఆదేశించారు. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో రేపు, ఎల్లుండి కూడా సెలవు ప్రకటించారు.
నెల్లూరు భారీ వర్షాలు
అల్పపీడనం ప్రభావంతో ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు జిల్లా జలదంకి మండలంలో అత్యధికంగా 17.7 సెం.మీ వర్షపాతం రికార్డైంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో 146 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. బాపట్ల జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షానికి దుద్దుకూరు యార వాగు పొంగి ప్రవహిస్తోంది. దీంతో ఒంగోలు, ఇంకొల్లు మధ్య రాకపోకలకు నిలిచిపోయాయి.
48 గంటల్లో వాయుగుండంగా
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరో 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. విపత్తుల సంస్థ కంట్రోల్ రూమ్ నుంచి వర్షాలపై స్పెషల్ సీఎస్ సిసోడియా పర్యవేక్షిస్తున్నారు. భారీ నుంచి అతిభారీ వర్షాల నేపథ్యంలో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల కలెక్టర్లకు సూచనలు చేశారు. ప్రజలకు హెచ్చరికలు జారీ చేసే విధానంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కమ్యూనికేషన్ సిస్టమ్ లో ఎక్కడ లోపం లేకుండా చూసుకోవాలన్నారు. కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతిన్నప్పుడు వినియోగించే శ్యాటిలైట్ ఫోన్స్ పనితీరు పరిశీలించాలన్నారు. జిల్లాల్లో అత్యవసరమైతే శ్యాటిలైట్ ఫోన్స్ వినియోగించడానికి ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.
బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనంగా బలపడింది. రాగల 2 రోజులలో పశ్చిమ వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు, దక్షిణకోస్తా తీరాల వైపు అల్పపీడనం కదిలేందుకు అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణకోస్తా, రాయలసీమలో భారీ నుంచి అతిభారీ వర్ష సూచన చేసింది. ఏపీకి తుపాను ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు.
దక్షిణ ఏపీ తీరం వైపు పయనం
నైరుతి రుతుపవనాలు ఇవాళ్టి నుంచి ఉపసంహరించుకుంటున్నాయని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. అదే సమయంలో ఆగ్నేయ ద్వీపకల్ప భారతదేశంలో నేటి నుంచి ఈశాన్య రుతుపవనాల వర్షపాతం ప్రారంభమయ్యాయని పేర్కొంది. దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇవాళ ఉదయం 8.30 గంటల నుంచి అదే ప్రాంతంలో కొనసాగుతుందని, పశ్చిమ వాయువ్య దిశగా పయనించి వాయుగుండంగా నైరుతి బంగాళాఖాతములో బలపడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. ఈ వాయుగుండం తదుపరి 24 గంటల్లో ఇది పశ్చిమ వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరిని ఆనుకుని దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వైపు ప్రయాణించే అవకాశం ఉందన్నారు. ఉపరితల ఆవర్తనం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరంలో సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తు వరకు వరకు విస్తరించి ఉందన్నారు.